రోజూ మీరు ఎంత నీరు తాగుతున్నారు..? కనీసం 7-8 గ్లాసులు తాగాలనేది సాధారణ సిఫారసు.
అయితే, అందరికీ ఈ నీటి సూత్రం వర్తించదు. వయసు, శారీరక శ్రమ, ఆరోగ్య పరిస్థితులతోపాటు..
ఉష్ణోగ్రతలు, వాతావరణాలపై నీటి మోతాదు ఆధారపడి ఉంటుందంటున్నారు వైద్య నిపుణులు!
తగినంత నీరు తాగితే..
- చెమట, మూత్రం ద్వారా మలినాలు బయటకు పోతాయి.
- శరీరంలో ప్రతి కణం, కణజాలం, అవయవం సరిగ్గా పనిచేస్తాయి.
- శరీర ఉష్ణోగ్రతలు నియంత్రణలో ఉంటాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
- మెదడు పనితీరు, జీర్ణక్రియ మెరుగుపడతాయి.
- చర్మం, కీళ్లు, కండరాలు, మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉంటాయి.
ఒంట్లో నీటి శాతం తగ్గితే..
- ఎలక్ట్రోలైట్లు బ్యాలెన్స్ తప్పుతాయి.
- శక్తి సన్నగిల్లి నీరసం, తలనొప్పి, చిరాకు, ఒత్తిడి లాంటి లక్షణాలు కనిపిస్తాయి.
- మూత్రం వాసనతో ముదురు పసుపు రంగులో వస్తుంది. మలబద్ధకం లాంటి సమస్యలూ వస్తాయి.
ఎప్పుడు తాగాలి?
- ఉదయం నిద్ర లేవగానే నీళ్లు తాగాలి. అందులో అరచెక్క నిమ్మరసం పిండుకుంటే శరీరానికి అవసరమైన యాంటీఆక్సిడెంటు,్ల విటమిన్- సి, పొటాషియం, ఫైటో పోషకాలు లభిస్తాయి.
- వాతావరణం వేడిగా ఉన్నప్పుడు, వ్యాయామం చేసినప్పుడు చెమట రూపంలో ద్రవాలు బయటకు పోతాయి. ఇలాంటి పరిస్థితుల్లో నీరు తాగాలి.
- భోజనానికి అరగంట ముందు.. భోజనం చేసిన అరగంట తర్వాత నీరు తాగితే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. భోజనం చేస్తున్నప్పుడు, చేసిన వెంటనే తాగకూడదు.
- అలసట, తలనొప్పి, ఒత్తిడి ఉన్నప్పుడు టీ, కాఫీల కంటే మంచినీరు తాగడం మేలు.
- ఒకేసారి ఎక్కువ నీరు తాగితే వాటర్ ఇన్‌టాక్సికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. శరీరంలో సోడియం స్థాయి పడిపోయి సమస్యలు వస్తాయి.
- చల్లని నీరు కంటే.. గోరు వెచ్చని నీరు తాగితే జీర్ణక్రియకు మంచిది.
అధ్యయనాలు ఏం చెబుతున్నాయి..?
- ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్)- 2020: వాతావరణం, ఆహార పద్ధతుల దృష్ట్యా పురుషులు 3 లీటర్లు, మహిళలు 2.2 నుంచి 2.5 లీటర్ల నీళ్లు తాగాలి. గర్భిణులు, పాలిచ్చే తల్లులు అదనంగా 0.5 నుంచి లీటరు వరకు తీసుకోవాలి.
- నేషనల్ అకాడమీస్ ఆఫ్ సైన్సెస్- 2019: ఆహారం ద్వారా లభించే నీటితో కలిపి పురుషులు రోజుకు 3.7 లీటర్లు, మహిళలు 2.7 లీటర్ల నీరు తాగాలి.
- జర్నల్ ఆఫ్ హ్యూమన్ న్యూట్రిషన్ అండ్ డైటీటిక్స్- 2018: తగినంత నీరు తాగేవారిలో కిడ్నీలో రాళ్లు, మూత్రపిండాల సమస్యలు తగ్గుతాయి.
- యూరోపియన్ హైడ్రేషన్ ఇన్‌స్టిట్యూట్ నివేదిక: ఒక శాతం డీహైడ్రేషన్ కూడా దృష్టి, జ్ఞాపకశక్తి, ఏకాగ్రతపై ప్రభావం చూపుతుంది.
- దీర్ఘకాలిక మధుమేహం, రక్తపోటుతో బాధపడుతున్నవారు నీళ్లు అవసరానికి మించి తాగితే కిడ్నీ, గుండెపై ఒత్తిడి పడే అవకాశం ఉంది.
- ఒకేసారి ఎక్కువ నీళ్లు తాగితే గుండెకు రక్తం పంప్ కావడం తగ్గుతుంది. ఊపిరితిత్తులు, గుండె చుట్టూ నీరు చేరడం, కాళ్ల వాపులు వస్తాయి.
- అనారోగ్య సమస్యలు లేనివారు ఎక్కువ నీరు తాగితే ఒక్కసారిగా రిసెప్టార్లు యాక్టివేట్ అయి తాగిన దానికంటే ఎక్కువ నీరు మూత్రం ద్వారా బయటకు వెళ్లి డీహైడ్రేట్ అవుతారు.
- కిడ్నీ సమస్యలు ఉన్నవారు ఒకేసారి ఎక్కువ నీరు తాగకూడదు. గంటకు 250-350 మి.లీ చొప్పున నీళ్లు తాగాలి.
- దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వృద్ధులు ఎక్కువ నీరు తాగకూడదు. మిగిలిన వారు రోజుకు 1.8 నుంచి 2.8 లీటర్ల నీరు తాగొచ్చు.
- కాళ్లు, ముఖం వాపు ఉన్నా, నడిస్తే ఆయాసం వచ్చినా నీళ్లు తాగడం తగ్గించి వైద్యుల సూచనలతో జాగ్రత్తలు తీసుకోవాలి.
































