కార్ల ధరలు… ఎంత తగ్గనున్నాయంటే

జీఎస్టీ (GST) శ్లాబుల మార్పులతో చిన్నకార్ల (Small Cars)కు డిమాండ్‌ గణనీయంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ నిర్ణయంతో 4 మీటర్ల కంటే తక్కువ పొడవున్న కార్లపై పన్ను భారం 10శాతం తగ్గనుంది.


వీటితోపాటు రోజువారీ వాడుకొనే చిన్న బైకులకు రిలీఫ్‌ లభించింది.

ఇప్పటికే ప్రభుత్వం ఆదాయపు పన్నులో రూ.12 లక్షల వరకు ఉపశమనం ఇవ్వడం, వడ్డీరేట్లు తగ్గడంతో ఆటోమొబైల్‌ రంగం పుంజుకోవడానికి అనువైన పరిస్థితి ఏర్పడింది. దీనికితోడు జీఎస్టీ (GST) కోత ఈ జోరును మరింత పెంచనుంది. భారీ బైకులు, లగ్జరీ కార్లపై పన్నులు పెంచడంతో ప్రభుత్వం ఆదాయాన్ని బ్యాలెన్స్‌ చేసుకొంది.

ఎవరికి లబ్ధి..?

1500 సీసీలోపు ఉన్న డీజిల్‌, డీజిల్‌ హైబ్రిడ్‌ కార్లు, 1200 సీసీలోపు పెట్రోల్‌, పెట్రోల్‌ హైబ్రిడ్‌, సీఎన్‌జీ, ఎల్‌పీజీ కార్లకు కొత్త పన్ను శ్లాబ్‌ ప్రకారం సెస్సు కాకుండా 18శాతం ట్యాక్స్ పడనుంది. ఉదాహరణకు టాటా ఆల్ట్రోజ్‌, మారుతీ సుజుకీ, హ్యుందాయ్‌ ఐ10, 120, రెనో క్విడ్‌ వంటి వాహనాల ధరలు తగ్గనున్నాయి. గతంలో ఈ వాహనాలపై 28శాతం పన్ను, ఇంధనం, ఇంజిన్‌ సామర్థ్యాన్ని బట్టి 1-3శాతం సెస్సు విధించేవారు.

చిన్నకారు ధరలు రూ.6-10 లక్షల మధ్య అనుకొంటే ప్రభుత్వ నిర్ణయంతో వినియోగదారులకు రూ.60 వేల నుంచి రూ.లక్ష వరకు మిగలనుంది. కాకపోతే కంపెనీలు ఎటువంటి కారణాలు చెప్పకుండా జీఎస్టీ (GST) లబ్ధిని వినియోగదారులకు బదలాయించాల్సి ఉంటుంది.

మోటార్‌ సైకిళ్లలో అత్యధిక మంది వినియోగించే బజాజ్‌ పల్సర్‌, హీరో స్ప్లెండర్‌ వంటి వాహనాలపై జీఎస్టీ (GST) కూడా 28 నుంచి 18 శాతానికి తగ్గనుంది.

వీటిపై పన్ను పెంపు.. కానీ..

350 సీసీకి మించిన సామర్థ్యంతో ఇంజిన్‌ ఉండే బైకులు ప్రీమియం శ్రేణి కిందకు వస్తాయి. ఎన్‌ఫీల్డ్‌, కేటీఎం వంటివన్నమాట. వీటిపై జీఎస్టీ (GST) 28 శాతం నుంచి 40 శాతానికి పెరిగింది. అదనంగా 3 శాతం సెస్సు విధించనున్నారు.

ఇక మధ్యశ్రేణి, భారీ ఎస్‌యూవీలపై కూడా పన్ను 28శాతం నుంచి 40శాతానికి చేరింది. వీటిపై ప్రస్తుతం 28శాతం జీఎస్టీ (GST), 17-22శాతం సెస్సు విధిస్తున్నారు. దీంతో పన్ను రేటు 45-50శాతం మధ్యలోకి వెళుతోంది. కానీ, ఇప్పుడు నేరుగా జీఎస్టీ 40శాతం మాత్రమే విధించడంతో 5-10శాతం వరకు పన్ను మిగలనుంది. పన్ను రేటు పెరిగినా.. సెస్సు రూపంలో వినియోగదారులకు మిగులు లభిస్తోంది. ఈ శ్రేణిలోకి టాటా హారియర్‌, మహీంద్రా ఎక్స్‌యూవీ 700, మారుతీ గ్రాండ్‌ విటారా, హ్యుందాయ్‌ క్రెటా వంటి వాహనాలు వస్తాయి.

* ఇక విద్యుత్తు వాహనాలపై 5శాతం జీఎస్టీ (GST) రేటు కొనసాగుతుంది.

”ప్రభుత్వ నిర్ణయంతో ట్రాక్టర్లు, వ్యవసాయ పరికరాలు మరింత చౌకగా మారి రైతులకు అందుబాటులోకి వస్తాయి. వాణిజ్య వాహనాల ధరలు తగ్గుతాయి. వ్యక్తిగత వాహనాలను ఎక్కువ మంది వినియోగించే అవకాశం ఉంది. డిమాండ్‌ను మరింత పెంచేలా ఈ నిర్ణయాలున్నాయి” మహీంద్రా అండ్‌ మహీంద్రా ఆటో-ఫార్మ్‌ సెక్టార్‌ సీఈవో రాజేష్‌ జెజురికర్‌ పేర్కొన్నారు.

2025-2026 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌-జూన్‌ నెలలకు ఆటోమొబైల్‌ (Auto Mobile) రంగంలో ప్యాసింజర్‌ వాహనాల డిమాండ్‌ 1.4శాతం తగ్గింది. ఇక 1.01 మిలియన్‌ వాహనాలు మాత్రమే అమ్మారు. టూవీలర్స్‌ విభాగంలో కూడా డిమాండ్‌ 6.2శాతం పడిపోయింది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.