డీఏ బకాయిల జమ ఇలా, ఎప్పుడు ఎంత – చెల్లింపు పై తాజా ఉత్తర్వులు

పీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. దీపావళి కానుకగా ప్రకటించిన డీఏ చెల్లింపు జీవో పైన ఉద్యోగ సంఘాల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. దీంతో..


బకాయిల చెల్లింపు పైన స్పష్టత ఇస్తూ ప్రభుత్వం సవరణ జీవో జారీ చేసింది. 2024 జనవరి 1 నుంచి ఈ ఏడాది సెప్టెంబరు 30వ తేదీ వరకూ డిఎ బకాయిలను 2027 ఫిబ్రవరిలోపు 4 వాయిదాల్లో చెల్లించ నున్నట్లు తాజా జిఓలో పేర్కొన్నారు. అదే విధంగా జీపీఎఫ్ ఖాతాల్లో జమ.. నగదు రూపంలో చేసే చెల్లింపుల పైనా జీవోలో స్పష్టత ఇచ్చారు.

ప్రభుత్వ ఉద్యోగులకు ‘దీపావళి’ కానుకగా ప్రకటించిన డీఏ చెల్లింపుల పైన ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. దీపావళి వేళ జారీ చేసిన జీవోలో 2024 జనవరి నుంచి చెల్లించాల్సిన 3.64 శాతం డీఏ బకాయిలను… రిటైర్మెంట్‌ సమయంలో చెల్లిస్తామని పేర్కొన్నారు. ఇప్పటిదాకా పీఆర్సీ బకాయిలను మాత్రమే రిటైర్మెంట్‌ సమయంలో చెల్లించేలా నిర్ణయాలు తీసుకున్నారు. దీని పైన ఉద్యోగుల్లో తీవ్ర చర్చ మొదలైంది. ఈ విషయాన్ని ఉద్యోగ సంఘాల నేతలు అప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై మంగళరం రాత్రి సవరణ జీవో జారీ చేసింది. తాజా నిర్ణయం మేరకు 2024 జనవరి డీఏకు సంబంధించిన బకాయిలు అంటే 21 నెలల బకాయిలను నాలుగు విడతల్లో ఉద్యోగులకు అందజేస్తారు. బకాయిల్లో 10 శాతాన్ని 2026 ఏప్రిల్‌లో చెల్లిస్తారు. సీపీఎస్‌, పీటీడీ ఉద్యోగులకు ప్రభుత్వ వాటాతో కలిపి వారి ప్రాన్‌ ఖాతాల్లోకి జమ చేస్తారు.

కాగా, మిగిలిన 90 శాతం బకాయిలను 3 సమాన భాగాల్లో 2026 ఆగస్టు, 2026 నవంబరు, 2027 ఫిబ్రవరి నెలల్లో అందిస్తామని జీవోల్లో స్పష్టం చేశారు. ఈ మొత్తాలను ఓపీఎస్‌ ఉద్యోగులకు వారి జీపీఎఫ్‌ ఖాతాల్లో జమ చేస్తామని… సీపీఎస్‌, పీటీడీ ఉద్యోగులకు నగదు రూపంలో అందజేస్తామని జీవోలో వెల్లడించారు. తాజాగా డీఏ చెల్లింపు పైన ఆర్దిక శాఖ తొలుత జారీ చేసిన జీవో పైన ఉద్యోగ సంఘాల నుంచి అభ్యంతరాలు రావటంతో సీఎం వారిని పిలిచి మందలించారు. ఇకపై ఇలాంటి తప్పులు దొర్లకూడదని, సాధారణంగా డీఏ బకాయిలు ఎలా చెల్లిస్తారో అలాగే ఇప్పుడూ చెల్లించేలా జీవోను సవరించాలని ఆదేశించారు. ఆ మేరకు ఆర్థిక శాఖ తాజాగా జీవో 62 విడుదల చేసింది. దీంతో నాలుగు వాయిదాల్లో ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ బకాయిలు చెల్లించేలా నిర్ణయిస్తూ.. ఈ జీవోలో స్పష్టత ఇచ్చారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.