HRA Fraud: అద్దె భత్యం కోసం అడ్డదారులు.. ఆ ఉద్యోగులపై ఐటీ శాఖ నజర్‌!

www.mannamweb.com


దిల్లీ: దేశంలో మరో కొత్త తరహా మోసం వెలుగు చూసింది. ఇంటి అద్దె భత్యం (HRA) కోసం కొందరు అడ్డదారులు తొక్కుతున్న వైనాన్ని ఆదాయపు పన్ను శాఖ (IT department) గుర్తించింది. ఆదాయపు పన్ను మినహాయింపు కోసం పాన్‌ కార్డులను అనధికారికంగా ఉపయోగించి మోసాలకు పాల్పడుతున్నట్లు తేలింది. అద్దె ఇంట్లో నివసించనప్పటికీ.. కేవలం పన్ను నుంచి తప్పించుకోవడం కోసం ఇతరుల పాన్‌ కార్డులను అనధికారికంగా ఉపయోగిస్తున్నట్లు గుర్తించింది. ఇలా సుమారు 8-10 వేల కేసులను గుర్తించినట్లు ఐటీ శాఖ వర్గాలు తెలిపినట్లు ఓ ఆంగ్ల పత్రిక పేర్కొంది.

హెచ్‌ఆర్‌ఏ అనేది వేతనంలో భాగంగా ఉంటుంది. అద్దె ఇంట్లో ఉంటున్నవారు రెంటల్‌ అగ్రిమెంట్‌ చూపించి పన్ను మినహాయింపు పొందొచ్చు. కొందరు వ్యక్తులు తాము అద్దెకు లేకపోయినా అద్దె చెల్లిస్తున్నట్లు పేర్కొనడం వెలుగుచూసింది. ఇందుకోసం వారు ఇతరుల పాన్‌ కార్డులను అనధికారికంగా వినియోగిస్తున్నట్లు తేలింది. అంటే పాన్‌ కార్డుదారుడికి తన పేరుమీద అద్దె అదాయం వస్తున్నట్లు కూడా తెలీదన్నమాట. కోటి రూపాయల రెంట్‌ రిసిప్ట్‌ను ఓ వ్యక్తి పెట్టడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చిందని ఐటీ శాఖ వర్గాలు తెలిపాయి. సదరు పాన్‌ కార్డుదారుడిని ఆరా తీస్తే తనకూ ఎలాంటి అద్దె రావడం లేదని పేర్కొనడంతో ఈ వ్యవహారం బట్టబయలైంది.

ఆదాయపు పన్ను మినహాయింపు కోసమే కొందరు ఉద్యోగులు ఈ తరహాలో అడ్డదారులు తొక్కుతున్నట్లు తెలిసింది. పాన్‌ కార్డు ఇలా దుర్వినియోగం అవుతుండడంతో ఆదాయపు పన్ను శాఖ దర్యాప్తునకు సిద్ధమైంది. ఎవరైతే తప్పుడు ట్యాక్స్‌ క్లెయిమ్‌లు దాఖలు చేశారో వారిపై గురి పెట్టనుందని ఆ శాఖ వర్గాలు తెలిపాయి. వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటారా? లేదా? అన్నది తెలియాల్సిఉంది. నెలవారీ అద్దె రూ.50 వేలు, లేదా వార్షికంగా అయితే రూ.6 లక్షలు ఉన్నప్పుడు మాత్రమే మూలం వద్ద కోత వర్తిస్తుంది. సరిగ్గా ఇదే అదునుగా అద్దె ఆదాయంపై పన్ను కట్టకుండా కొందరు దీన్ని దుర్వినియోగం చేస్తున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు.

నిత్య జీవితంలో జరిగే ఆర్థిక లావాదేవీలన్నీ పాన్‌తో ముడిపడి ఉంటాయి. ఒకప్పటితో పోలిస్తే సాంకేతికత కూడా బాగా అభివృద్ధి చెందింది. పన్ను తప్పించుకోవడానికి ఎవరైనా అక్రమాలకు పాల్పడితే ఐటీ శాఖ ఇట్టే పట్టేస్తుందని నిపుణులు చెబుతున్నారు. పన్ను మాట పక్కన పెడితే.. ఒకవేళ ఆదాయపు పన్ను శాఖకు చిక్కితే భారీ జరిమానాలతోపాటు, న్యాయపరమైన చిక్కులు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఒకవేళ తల్లిదండ్రులకు అద్దె ఆదాయం చెల్లించాల్సినవారు కూడా చెక్‌ లేదా ఇతర ఎలక్ట్రానిక్‌ పద్ధతిలో చెల్లించాలని సూచిస్తున్నారు. అద్దె అందుకుంటున్న వారు కూడా ఈ మొత్తాన్ని తమ అద్దె ఆదాయంలో చూపించాల్సి ఉంటుందని పేర్కొంటున్నారు.