కొన్ని నెలలుగా ఎదురుచూస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు పండుగల సమయంలో ప్రభుత్వం గిఫ్ట్ ఇస్తుందనుకుంటే ఎలాంటి ప్రకటన చేయలేదు. ఆశగా ఎదురుచూస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు నిరాశే మిగిలింది.
పండుగ పూట కూడా దిగాలుతో ఉన్నాయి. గొంతెమ్మ కోరికలు కాకుండా తమకు న్యాయపరంగా హక్కుగా దక్కాల్సినవి కూడా ఇవ్వకపోవడంతో రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పటికే తమ అసంతృప్తిని వెళ్లగక్కినా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఈ ఆగ్రహంతో ఉన్న ఉద్యోగులు ఎలాగోలా దసరా పండుగ చేసుకున్నారు. పండుగ తర్వాత ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు సిద్ధమయ్యారు. ముఖ్యంగా పదవీ విరమణ పొందిన ఉద్యోగులు ఎల్లుండి భారీ నిరసన ప్రదర్శన చేపట్టనున్నారు.
ఈ క్రమంలోనే అక్టోబర్ 7వ తేదీన మంగళవారం రోజు కరీంనగర్ కలెక్టరేట్ ముందు రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ (రెవా) ధర్నా చేపట్టనుంది. ఈ మేరకు రెవా ప్రతినిధులు వివరాలు వెల్లడించారు. 2024 మార్చి నుంచి ఇప్పటివరకు ఉద్యోగ విరమణ చెందిన ఉద్యోగులు, ఉపాధ్యాయుల ప్రయోజనాలు వెంటనే చెల్లించాలనే ప్రధాన డిమాండ్ ఫై ధర్నా చేయనున్నారు. రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ రేవా (రెవా) జగిత్యాల జిల్లా సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా రెవా జగిత్యాల జిల్లా కన్వీనర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా కార్యదర్శి ఎన్నం రాoరెడ్డి, ప్రధాన కార్యదర్శి సుంకిశాల ప్రభాకర్ రావు మాట్లాడారు.
‘ఏడాదిన్నర కాలంగా ఉద్యోగ విరమణ చెందిన ఉద్యోగులకు రావలసిన జీపీఎఫ్, జీఐఎస్, లీవ్ ఎన్ కాష్ మెంట్, కమ్యూటేషన్, గ్రాట్యూటీ అందలేదు’ అని రెవా నాయకులు వివరించారు. ఉద్యోగ విరమణ పొందిన తర్వాత వెంటనే రావాల్సిన బకాయిలు అందక పెన్షనర్లు నానా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్న సమయంలో ఇలాంటి పరిస్థితి ఉండేది కాదని గుర్తు చేశారు.
































