ఏపీ ప్రభుత్వం ప్రారంభించిన అన్న క్యాంటీన్లకు విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. నిరుపేదల ఆకలి తీర్చే ఈ పథకాన్ని తమ వంతు సాయం అందించేందుకు పలువురు దాతలు ముందుకు వస్తున్నారు. ఇక విరాళాలు అందించే వారి కోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా బ్యాంకు ఖాతా కూడా తెరిచిన సంగతి తెలిసిందే. అలాగే వెబ్‌సైట్ ద్వారా కూడా విరాళాలు అందించే అవకాశం కల్పించింది. ఈ క్రమంలోనే పలు సంస్థలు, ప్రముఖులు అన్న క్యాంటీన్ల నిర్వహణకు విరాళాలు అందిస్తున్నారు. తాజాగా అన్నక్యాంటీన్ నిర్వహణకు సెల్‌కాన్ సంస్థ విరాళం అందించింది. సెల్‌కాన్ సీఎండీ వై. గురుస్వామి నాయుడు అన్న క్యాంటీన్ల కోసం రూ.26.25 లక్షల విరాళం ఇచ్చారు. తన పుట్టినరోజు సందర్భంగా అన్న క్యాంటీన్లలో ఒక్క రోజు భోజనం పంపిణీకి అయ్యే ఖర్చు రూ. 26.25 లక్షలను విరాళంగా అందించారు.
ఈ మేరకు సెల్‌కాన్ సీఎండీ గురుస్వామి నాయుడు సీఎం చంద్రబాబుకు కలిసి విరాళం తాలూకు చెక్ అందజేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ఆయనను అభినందించారు. పేదల ఆకలి తీర్చే కార్యక్రమంలో భాగస్వామ్యులు అయినందుకు అభినందనలు తెలియజేశారు. మరోవైపు ఇప్పటికే అన్న క్యాంటీన్ల నిర్వహణ కోసం మాజీ ఎంపీ, లైలా గ్రూప్ ఛైర్మన్ డా. గోకరాజు గంగరాజు కోటి రూపాయలు విరాళం అందించారు. అలాగే విజయవాడకు చెందిన శ్రీలక్ష్మీ వెంకటేశ్వర డెవలపర్స్ సంస్థ అధినేత పెనుమత్స శ్రీనివాసరాజు సైతం కోటి రూపాయలను అన్న క్యాంటీన్ల నిర్వహణకు విరాళంగా అందించారు. ఎన్టీఆర్ ట్రస్టు తరుఫున సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి.. కోటి రూపాయలు విరాళం అందించారు. ఇవే కాకుండా పలువురు ప్రముఖులు, సాధారణ వ్యక్తులు అన్న క్యాంటీన్లకు విరాళాలు అందిస్తున్నారు.
మరోవైపు ఏపీలో ప్రస్తుతం వంద అన్న క్యాంటీన్లు నడుస్తున్నాయి. ఈ క్యాంటీన్ల ద్వారా ఐదు రూపాయలకే భోజనం అందిస్తున్నారు. ఉదయం ఏడు నుంచి రాత్రి 9 గంటల వరకూ మూడు పూటల ఈ అన్న క్యాంటీన్లు పలువురి ఆకలి తీరుస్తున్నాయి. ముఖ్యంగా కార్మికులు, రోజువారీ కూలీల కడుపు నిండుతోంది. దీంతో మరిన్ని అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగానే సెప్టెంబర్ 13న మరో 75 అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తారు. ఆదివారం మినహా మిగతా ఐదు రోజులు అన్న క్యాంటీన్లు నడుస్తుండగా.. రూ.15 లకే మూడు పూటల భోజనం లభిస్తోంది. ఇక అన్న క్యాంటీన్ల నిర్వహణలో ప్రజలను సైతం భాగస్వామ్యం చేసేందుకు ప్రభుత్వం విరాళాలు సేకరిస్తోంది.