తెలంగాణ రాష్ట్రంలోని యువతకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. స్వయం ఉపాధి రుణాలు మంజూరు చేసేందుకు ‘రాజీవ్ యువ వికాసం’ (Rajeev Yuva Vikasam Scheme) స్కీమ్‌ను అమలు చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.
ఈ మేరకు మార్చి 17వ తేదీ నుంచి దరఖాస్తులను స్వీకరిస్తారు. ఈ స్వీమ్‌కు అప్లై చేసుకునేందుకు సంబంధించి అధికారిక ప్రకటన విడుదలైంది.
ఈ స్కీమ్‌తో రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ యువతకు (SC, ST, BC, Minority) స్వయం ఉపాధి రుణాలను మంజూరు చేస్తారు. ఇందుకోసం రాజీవ్ యువ వికాసాన్ని అమలు చేయాలని నిర్ణయించింది.
రాజీవ్ యువ వికాసం స్కీమ్‌కు సంబంధించిన పూర్తి వివరాలను రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ పథకం కింద అర్హులైన లబ్ధిదారులకు రూ.3 లక్షల విలువైన యూనిట్లు మంజూరు చేయాలని ప్రతిపాదించింది. ఈ స్కీమ్ కోసం ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరించనుంది.
ఈ ప్రక్రియ మార్చి 17వ తేదీ నుంచి ప్రారంభం కానుంది.ఆన్ లైన్ ద్వారా చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ కార్పొరేషన్లు వేర్వురుగా నోటిఫికేషన్లు జారీ చేశాయి.
ఈ పథకం అర్హతలు, ఎంపిక విధానం వివరాలన్నీ (https://tgobmms.cgg.gov.in/) పోర్టల్‌లో పొందుపరిచినట్లు బీసీ కార్పొరేషన్ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్ 6 నుంచి మే 31 వరకు దరఖాస్తుల పరిశీలన కొనసాగుతుందని ప్రభుత్వం వెల్లడించింది. లబ్ధిదారుల్లో అర్హులను ఎంపికచేసి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున(జూన్ 2న) రాయితీ రుణాల మంజూరు పత్రాలు అందజేయనుంది.
రాజీవ్ యువ వికాసం పథకంలో కేటగిరీ-1, 2, 3 వారీగా రుణాలు ఖరారు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేటగిరీ-1 కింద రూ.లక్ష వరకు రుణాలు ఇస్తారు. ఇందులో 80 శాతం రాయితీ ఉంటే, మిగతా 20 శాతం లబ్ధిదారుడు భరించడమో లేదా బ్యాంకు అనుసంధానం యూనిట్లు ఇస్తారు. ఇక కేటగిరీ 2 కింద రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు రుణాలు ఇవ్వాలని సర్కార్ నిర్ణయించింది. ఇందులో 70 శాతం వరకు రాయితీ లభిస్తుంది. కేటగిరీ-3 కింద రూ.3 లక్షలలోపు రుణాలు ఇస్తారు. 60 శాతం వరకు రాయితీ అందుతుంది.