Death Valley: మృత్యులోయపై మోజెందుకు..? డెత్‌వ్యాలీకి భారీగా పర్యటకులు..!

www.mannamweb.com


Death Valley: మృత్యులోయపై మోజెందుకు..? డెత్‌వ్యాలీకి భారీగా పర్యటకులు..!

వెర్రి వెయ్యి రకాలన్నట్లు.. మలమలా మాడ్చే ఎండ ఎలా ఉంటుందో చూద్దామనుకొని జనాలు ఆ ప్రదేశానికి బారులు తీరుతున్నారు. మనం ఎండ 40 డిగ్రీల సెల్సియస్‌ దాటితేనే కాలు బయటపెట్టకుండా ఇంట్లో ఏసీ వేసుకొని ఉంటాం. కానీ, కొందరు మాత్రం 50 డిగ్రీల సెల్సియస్‌ దాటితే వేడి ఎలా ఉంటుందో అనుభవించాలనుకొని కాలిఫోర్నియాలోని డెత్‌వ్యాలీకి బారులు తీరుతున్నారు. అక్కడి నేషనల్‌ పార్క్‌ యాజమాన్యం వద్దని చెబుతున్నా వినడం లేదు. తాజాగా ఓ బైక్‌ రైడర్‌ వేడి దెబ్బకు ప్రాణాలు కూడా కోల్పోయాడు. అయినా పర్యటకులు మాత్రం ఆగడం లేదు. అసలు ఈ డెత్‌ వ్యాలీ ఎందుకంత ప్రమాదకరం.. దానిలో ప్రత్యేకతలేమిటో తెలుసుకొందాం.

ప్రపంచంలోనే అత్యధిక ఉష్ణోగ్రత..
అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న డెత్‌వ్యాలీ (Death Valley) ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు చేసే ప్రాంతం. ఇక్కడ అసాధారణ ఉష్ణోగ్రతలకు భౌగోళిక పరిస్థితులు కూడా కారణమే. ఇక్కడ 1913లో జులై 10వ తేదీన అత్యధికంగా 134 డిగ్రీల ఫారెన్‌ హీట్‌ (56.66 డిగ్రీల సెల్సియస్‌) నమోదైంది. కాకపోతే ఇది సరికాదనే వివాదం కూడా ఉంది. కానీ, 2020 ఆగస్టు 16, 2021 జులై 9, 2023 జూన్‌ 16వ తేదీల్లో 130 డిగ్రీల ఫారెన్‌హీట్‌ నమోదైంది. ఇక్కడి ఫర్నేస్‌ క్రీక్‌లోని అత్యాధునిక సెన్సర్లు వీటిని గుర్తించాయి. 129 డిగ్రీలు ఆరుసార్లు నమోదైంది. ఈ స్థాయి ఉష్ణోగ్రత డెత్‌వ్యాలీ బయట కువైట్‌లో 2016 జులై 21న నమోదైంది. ఈ ఒక్క అంశమే మృత్యులోయ ప్రత్యేకతను చెబుతోంది.

ఏడాదిలో అత్యధిక రోజులు నిప్పులకొలిమే..
ఇక్కడ ఉష్ణోగ్రత గణాంకాలు చూస్తే ఎవరికైనా చెమటలు పట్టాల్సిందే. ఫర్నేస్‌ క్రీక్‌ అనే ప్రాంతంలో భీకరమైన వేడి ఉంటుంది.

ఏడాదిలో 147 రోజులు సగటున 100 డిగ్రీల ఫారెన్‌ఫారెన్‌హీట్‌ నమోదవుతుంది. ఇది కూడా ఏప్రిల్‌ 14 నుంచి అక్టోబర్‌ 12లోపే.
ఏటా 92 రోజులు అత్యల్ప సగటు ఉష్ణోగ్రత 80 డిగ్రీల ఫారెన్‌హీట్‌.
ఏటా 23 రోజులు సగటున 120 డిగ్రీల వేడి ఉంటుంది. ఇక 32 రోజుల అత్యల్ప ఉష్ణోగ్రత 90 డిగ్రీల పైమాటే.
1972 జులై 5న ఇక్కడ నేలపై 201 డిగ్రీల ఫారెన్‌హీట్‌ వేడి నమోదైంది. ఇది నీరు మరిగే వేడి కన్నా కొన్ని డిగ్రీలే తక్కువ. అదేరోజు వాతావరణ ఉష్ణోగ్రత 128 డిగ్రీల ఫారన్‌హీట్‌.
1929, 1953 సంవత్సరాల్లో చుక్క వర్షం పడలేదు. 1931-34 మధ్యలో 40 నెలల్లో కేవలం అంగుళం వర్షపాతం కంటే తక్కువే నమోదైంది.
భూలోక నరకంలా ఎందుకు..?
డెత్‌ వ్యాలీ (Death Valley)లోని నేషనల్‌ పార్క్‌లో ఉన్న ఫర్నేస్‌ క్రీక్‌ సముద్ర మట్టం కంటే 190 అడుగులు కింద ఉంటుంది. దీనిచుట్టూ నాలుగువైపులా పర్వతాలు ఉన్నాయి. సముద్రమట్టం కంటే కిందకు గాలి వచ్చేకొద్దీ వేడెక్కుతుంది. దీనికి చుట్టూ కొండలు ఉండటంతో చల్లటి గాలి ఈ లోయలోకి వచ్చే అవకాశం లేకపోగా.. ఉన్న గాలి మరింత తీవ్రంగా వేడెక్కుతుంది. ఇది బయటకు పోయే అవకాశం కూడా ఉండదు.

ఇక్కడ కేవలం ఉష్ణోగ్రతలే కాదు..ప్రమాదకరమైన మెరుపు వరదలు కూడా చాలా సహజం. ఇక్కడ 2022 ఆగస్టులో వచ్చిన వరదలు పార్కులో విధ్వంసం సృష్టించాయి. 2015లో మెరుపు వరదలు ఇక్కడి రోడ్లను తుడిచిపెట్టేశాయి. కొన్ని అడుగుల బురదతో ఈ ప్రాంతం నిండిపోయింది. అత్యంత అరుదుగా హిమపాతం కూడా నమోదవుతుంది. 1949 జనవరి 10-11 తేదీల్లో 4 అంగుళాల మంచు కురిసింది. ఇదే సముద్ర మట్టం కంటే తక్కువలో నమోదైన అత్యధిక హిమపాతం.

తండోపతండాలుగా ఐరోపా వాసులు..!
డెత్‌ వ్యాలీలో ఈ ఏడాది భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ఐరోపా దేశాల నుంచి భారీగా పర్యటకులు వస్తున్నారు. ఇటీవల ఇక్కడ 128 డిగ్రీల ఫారెన్‌హీట్‌ నమోదైంది. తాజాగా బ్యాడ్‌ వాటర్‌ బైసన్‌ అనే ప్రాంతంలో ఓ బైకర్‌ వేడికి మృతి చెందాడు. మరొకరు ఆస్పత్రి పాలయ్యారు. ఇక్కడి వేడి పర్యటకుల ఆరోగ్యంపై పెను ప్రభావం చూపుతుందని నేషనల్‌ పార్క్‌ సూపర్‌ వైజర్‌ మైక్‌ రేనాల్డ్స్‌ హెచ్చరించారు. ఈ ప్రాంతంలో త్వరలోనే ప్రపంచంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.