రోజురోజుకూ ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రజలకు మరింత చేరువవుతున్నారు. ఎప్పటికప్పుడూ మాటల్లో రాటుదేలుతున్నారు. పులివెందుల గడ్డ మీద నిలబడి సీఎం జగన్‌ను టార్గెట్ చేస్తూ ఆమె మాట్లాడారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె పాల్గొన్న పులివెందుల సభకు వచ్చిన హ్యూజ్ రెస్పాన్స్ చూసి వైసీపీ నాయకులకు గుండె దడ పుట్టిందనే టాక్ వినిపిస్తోంది. ఎంతగా అడ్డుకున్నా, వెళ్లొద్దని వైసీపీ నాయకులు చెప్పినా లెక్కచేయని ప్రజలు షర్మిల సభకు భారీ ఎత్తున తరలిరావడం విశేషం.
వరుసగా రెండు ఎన్నికల్లోనూ పులివెందుల నుంచి జగన్మోహన్‌రెడ్డి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఒకప్పుడు వైఎస్‌కు కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గం ఇప్పుడు జగన్ అడ్డాగా మారింది. అలాంటి చోట నిలబడి షర్మిల ధైర్యంగా చేసిన ప్రసంగం ఆకట్టుకుంది. కడప లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న షర్మిల.. ఈ జిల్లా పర్యటనలో భాగంగా పులివెందుల్లో నిలబడి జగన్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాజన్న బిడ్డగా ఆదరించాలని ఆమె ఎమోషనల్ స్పీచ్ ప్రజల్లోకి బలంగా వెళ్లిందనే టాక్ వినిపిస్తోంది. తాను వైఎస్ఆర్ కడప జిల్లాలో తిరుగుతుంటే జగన్ భయపడి అవినాష్ రెడ్డిని మార్చాలనే ఆలోచనకు వచ్చారని షర్మిల అన్నారు. అంటే అవినాషే హంతకుడని జగన్ భావిస్తున్నట్లే కదా అని షర్మిల ప్రశ్నించారు.
పులివెందుల బిడ్డ ఒక్క రాజధాని కూడా కట్టలేకపోయారని, ఉద్యోగాలు ఇవ్వకుండా ఇప్పుడు కుంభకర్ణుడిలా నిద్రలేచి డీఎస్సీ అంటున్నారని షర్మిల తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పులివెందుల నియోజకవర్గం అంటే వైఎస్ కుటుంబానికి పెట్టని కోట. దీని కారణంగా ఇక్కడ గతంలో కాంగ్రెస్ పటిష్ఠంగా ఉండేది. 1978 నుంచి 2009 వరకు కాంగ్రెస్ తరపున వైఎస్ కుటుంబ సభ్యులు ఇక్కడ విజయం సాధించారు. షర్మిల తండ్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పులివెందుల నుంచి ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2011 ఉప ఎన్నికల్లో వైసీపీ నుంచి విజయమ్మ నెగ్గారు. ఆ తర్వాత రెండు ఎన్నికల్లోనూ జగన్ విజయం సాధించారు. అలాంటి చోట జగన్‌కు వ్యతిరేకంగా షర్మిల నిర్వహించిన సభకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఆదరణ దక్కడం విశేషం.