భార్యకు గుడి కట్టి పూజిస్తున్న భర్త! ఈ తరానికి తెలియని నిజమైన ప్రేమ

www.mannamweb.com


ఈ రోజుల్లో మూడు ముళ్లు పడిన రోజే విడాకులకు వెళుతున్నారు దంపతులు. కాపురాన్ని మూడు నాళ్ల ముచ్చటగా మార్చేసుకుంటున్నారు. అలకలు, గొడవలు మొదలయ్యి.. ఒకరిపై ఒకరు నిత్యం తీవ్ర ఆరోపణలు చేసుకుంటూ దూషించుకుంటూ సంసారాన్ని రణ రంగం, యుద్దకాండలా మార్చేసుకుంటున్నారు. భర్త మాట అంటే భార్యకు పడటం లేదు. అలాగే పత్ని కసురుకుంటూ వెంటనే తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు పతి. దీంతో నీతో కలిసి ఉండేది ఏంటీ అంటూ ఎవరి దారి వారు వెతుక్కుంటున్నారు. స్వేచ్ఛ, స్వాతంత్ర్యం హద్దులు మీరి ఒకరి అవసరం మరొకరికి లేకుండా పోతుంది. ఇలాంటి కాలంలో ఓ వ్యక్తి తనను వదిలేసి వెళ్లిపోయిన భార్యకు గుడి కట్టి నిత్యం పూజలు చేస్తున్నాడు.

వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఆ భర్తది తెలంగాణాలోని ఓ జిల్లా. ఈ భర్తది వరంగల్ జిల్లాలోని ఖానాపురం మండలం బుధరావుపేట. వివరాల్లోకి వెళితే బుధరావు పేటకు చెందిన వెంకటనారాయణ, సుజాత దంపతులు. ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. అందరి భార్యా భర్తల్లాగే వీరి మధ్య కూడా చిన్న చిన్ని చిలిపి తగాదాలు జరిగేవి. కానీ వాటిని అధిగమించి అన్యోన్యంగా జీవించేవారు. కానీ విధికి వీరి దాంపత్యం చూసి కన్నుకొట్టింది. ఈ బంధాన్ని విడదీసింది. గత ఏడాది సుజాత గుండెపోటుతో మృతిచెందింది. భార్య మరణించిన వార్త జీర్ణించుకోలేకపోయాడు భర్త వెంకటనారాయణ. భార్య సుజాత లేకపోవడాన్ని ఆయన ఊహించుకోలేకపోయాడు. నిత్యం ఆమె ఆలోచనల్లోనే బతికేవాడు. భార్య లేని బతుకు వ్యర్థమని భావించేవాడు.
భార్య లేకపోతే.. భార్య ప్రతిరూపాన్ని ప్రతిష్టించాలని అనుకున్నాడు. భార్య మరణించినా.. నిత్యం తన కన్నుల ముందే ఆమె ఉండాలని భావించాడు. ఈ క్రమంలోనే.. ఆమె గుర్తుగా పొలం వద్ద గుడి కట్టించారు. అందులో తన భార్య ప్రతిరూపాన్ని ప్రతిష్టించి.. నిత్యం పూజలు చేస్తున్నాడు. బతికి ఉన్నప్పుడు తనకు చేసిన సేవలకు గానూ.. ఇప్పుడు ఆమె ప్రతిరూపాన్ని కొలుస్తున్నాడు. ఆమెకు నిత్యం పూజలు చేసి, పూలు, పళ్లు అందించి.. ఓ దేవతలా పూజిస్తున్నాడు. ప్రతి క్షణం గొడవ పడే భార్యా భర్తలకు.. నిజమైన ప్రేమకు నిదర్శనంగా నిలిచాడు ఈ భర్త.