ఆటోమొబైల్ లవర్స్ ఎంతగానో ఎదురు చూసే ఆటో ఎక్స్‌పో 2025.. ఇంకొద్ది రోజుల్లో వచ్చేస్తోంది. జనవరి నెలలో ఈ ఈవెంట్ జరగనుంది. ఏటా జరిగే ఈ ఎక్స్‌పోలో ఎన్నో కొత్త కార్లను పరిచయం చేస్తూ ఆటోమొబైల్ సంస్థలు సందడి చేస్తాయి.
ఈ ఈవెంట్‌లో ప్రతిసారి.. దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ మారుతీ సుజుకీ కొత్త మోడళ్లను పరిచయం చేస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈసారి కూడా ఆ సంస్థ సరికొత్త మోడల్స్‌తో ముందుకు రానుంది. తమ సంస్థ నుంచి ఒక ఎలక్ట్రిక్ మైక్రో ఎస్‌యూవీ కారును పరిచయం చేయనుంది. ఆ విశేషాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
మారుతీ సంస్థ ఈ ఎలక్ట్రిక్ కారును తీసుకురానుందనే వార్త తెలియగానే.. అభిమానులు దాని కోసం ఆరా తీయడం మొదలు పెట్టారు. Hustler మోడల్ ఈవీ కారును 2025 ఆటో ఎక్స్ పోలో మారుతీ సంస్థ పరిచయం చేయనుంది. కొన్ని నెలల క్రితమే ఈ కారును భారత రోడ్లపై టెస్టింగ్ చేశారు. భారత మార్కెట్ లో.. ఈవీలను తీసుకురావడంలో ఇతర సంస్థలతో పోలిస్తే మారుతీ సుజుకీ కాస్త ఆలస్యంగా మొదలుపెట్టింది.
2030 నాటికి తాము 6 కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను భారత మార్కెట్లోకి తీసుకువస్తామని మారుతీ సుజుకీ సంస్థ గతేడాది ప్రకటించింది. ఇప్పుడు పరిచయం చేయనున్న హస్ట్లర్ కారు కూడా ఈ 6 కార్లలో ఒకటని తెలుస్తోంది. దీని డిజైన్, సైజ్ కారణంగా.. జపాన్‌లో ఈ కారు వినియోగదారులను ఇప్పటికే విశేషంగా ఆకర్షించింది. ఈ కారు చూసేందుకు జిమ్నీ, ఎస్- ప్రెస్ మోడల్ కార్ల కాంబినేషన్‌గా కనిపిస్తుంది.
ఈ కారు MG comet కంటే కాస్త పెద్దదిగా ఉంటుంది. కోమెట్ లాగా కాకుండా ఈ హస్ట్లర్‌లో 4 డోర్స్ ఉంటాయి. ఇక జపనీస్ మోడల్ కారు విషయానికి వస్తే అది 658 సీసీ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. అయితే ప్రస్తుతం ఈవీ కార్ల హవా కొనసాగుతున్నందున ఈ కారును పూర్తిగా ఎలక్ట్రిక్ పవర్ ట్రెయిన్‌తో అందుబాటులోకి తీసుకురానుంది సుజుకీ సంస్థ.
హస్ట్లర్ ఈవీ ఫీచర్లకు సంబంధించి ఇప్పటివరకైతే సుజుకీ సంస్థ ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. అయితే ఈ కారు మారుతీ WagonR EV ప్రోటో టైప్‌తో రానున్నట్లు తెలుస్తోంది. 2018 నుంచి మారుతీ సుజుకీ WagonR ఈవీని టెస్టింగ్ చేస్తోంది. అయితే కొన్ని కారణాలతో ఈ ప్రాజెక్టును పక్కన పెట్టింది. ఇప్పుడు WagonR ఈవీ తయారీ అనుభవంతో మరికొన్ని హంగులను జోడించి హస్ట్లర్ మోడల్ ఈవీని తీసుకురానుంది.
v3Cars వెబ్‌సైట్‌లో ప్రచురితమైన కథనం ప్రకారం సుజుకీ హస్ట్లర్ ఈవీ… బ్యాటరీ ప్యాక్ 30kwh సామర్ధ్యం కంటే తక్కువలో రానున్నట్లు తెలుస్తోంది. ఈ బ్యాటరీ ప్యాక్ ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 250 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. ఈ కారు సైజ్, స్టైల్ విషయంలో.. MG Comet EV, Tata Tiago EV, and Citroen eC3 ఈవీలతో పోటీ పడనుంది.
అయితే ఈ కారును కస్టమర్స్‌కు అందుబాటులోకి తీసుకువస్తారా? లేదా? అనే విషయంలో సందేహాలు ఉన్నాయి. భారత్‌లో సాధారణంగా పెద్ద వాహనాలకు డిమాండ్ అధికంగా ఉంటుంది. మారుతి సుజుకి గనక హస్ట్లర్ మాడల్‌ను మార్కెట్లో లాంచ్ చేస్తే.. ఈ కారు ఎక్కువ స్పేస్ కారణంగా వినియోగదారులను ఆకట్టుకునే అవకాశం ఉంది. ఈ హస్ట్లర్ కారు మారుతీ సంస్థకు చెందిన ఇగ్నిస్ మోడల్ కారును గుర్తుకు తెచ్చేలా ఉంటుందని తెలుస్తోంది.
ఒకప్పుడు విపరీతంగా ఆకట్టుకున్న ఈ ఇగ్నిస్ కారు తయారీని ఆ సంస్థ కొన్ని సంవత్సరాల క్రితమే ఆపేసింది. ఇప్పుడు తీసుకురానున్న ఈ హస్ట్లర్ ఇగ్నిస్‌ని రీప్లేస్ చేయనుంది. భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్ పో 2025.. జనవరి 17 నుంచి 22 మధ్య జరగనుంది న్యూఢిల్లీ వేదికగా జరిగే ఈవెంట్లో.. అనేక ఆటోమొబైల్ సంస్థలు తమ కొత్త వాహనాలతో సందడి చేయడానికి సిద్ధమవుతున్నాయి.