పాపికొండలు అంటేనే ఓ అందమైన అనుభూతి. ఈ జర్నీ ఓ దృశ్యకావ్యంలా మరపురాని అనుభూతిని మిగులుస్తుంది. గోదావరి ఒడ్డున పచ్చని కొండల మధ్య సాగే పాపికొండల విహారయాత్ర వర్ణనాతీతంగా కన్నుల పండగలా సాగుతుంది.
ఇక్కడ ప్రతి దృశ్యం ఓ అద్భుతమే. ఈ విహారయాత్రకు ప్రతి ఏటా వేలాది మంది పర్యాటకులు వస్తుంటారు. గోదావరిలో భారీ వరదల కారణంగా జులైలో ఈ యాత్రను నిలిపివేశారు అధికారులు. అయితే ఇటీవల గోదావరికి వరద ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో తిరిగి ఈ విహారయాత్ర ప్రారంభం అయింది.
పాపికొండలు.. తూర్పు కనుమలలోని దట్టమైన అడవులతో కూడిన ఒక పర్వత శ్రేణి. ఇవి ఏపీలోని పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల మధ్య విస్తరించి ఉన్నాయి. ఈ పాపికొండలు రాజమండ్రికి 60 కిలోమీటర్ల దూరంలోనూ, తెలంగాణలోని భద్రాచలం నుండి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. అలాగే హైదరాబాద్ నగరానికి సుమారు 410 కిలోమీటర్ల దూరంలో పాపికొండలు ఉన్నాయి. పాపికొండల వద్ద గోదావరి నది తక్కువ వెడల్పులో రెండు కొండల మధ్య ప్రవహిస్తూ ఉంటుంది. రాజమండ్రి నుంచి పాపికొండలు యాత్ర పర్యటకులకు ఓ మర్చిపోలేని అనుభూతిని మిగుల్చుతుంది. పాపికొండలు విహార యాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలోని పట్టిసం ద్వీపం నుండి ప్రారంభం అవుతుంది. అక్కడి నుండి పోలవరం, గొందూరు (పోచమ్మ గండి), సిరివాక, కొల్లూరు, పేరంటాలపల్లి మీదుగా యాత్ర సాగుతుంది.
ఎలా చేరుకోవాలి..?
పాపికొండలు విహారయాత్ర చేయాలంటే విమాన ప్రయాణం అయితే చెన్నై, బెంగళూర్, హైదరాబాద్ విజయవాడ నుండి విమానాల ద్వారా చేరుకోవచ్చు. ఇక పాపికొండలకు రైల్వే స్టేషన్ లేదు. ఈ ప్రాంతానికి సమీపంలో రాజమండ్రి రైల్వే స్టేషన్ ఉంది. దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల రైళ్లు ఇక్కడ ఆగుతాయి. రాజమండ్రి రైల్వే స్టేషన్ విజయవాడ నుండి 150 కిలోమీటర్లు.. విశాఖపట్నం నుండి 220 కిలోమీటర్లుగా ఉంది. ఇక రోడ్డు మార్గం అయితే ఖమ్మం జిల్లా నుండి బస్సులు ఉంటాయి. అలాగే తూర్పు గోదావరి జిల్లా నుండి రాజమండ్రికి టాక్సీలో చేరుకోవచ్చు. తూర్పు గోదావరి నుండి పాపికొండలు శ్రేణికి 35 కిలోమీటర్ల రహదారి మార్గం ఉంది.
ప్యాకేజీ వివరాలు..
రాజమండ్రి నుంచి పాపికొండలు టూర్ వివరాలు చూస్తే పెద్దవారికి రూ. 1,250 ఉంది. పిల్లలకు రూ. 1,050 ఉంది. బోటు సర్వీసులు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఉంటాయి. ఈ ప్యాకేజీలోనే బ్రేక్ ఫాస్ట్, లంచ్, టీ, స్నాక్స్ అందిస్తారు. రాజమండ్రి- పాపికొండలు- భద్రాచలం టూర్ ప్యాకేజీ అయితే పెద్దలకు రూ. 2,300 , పిల్లలకు రూ. 2,100 గా ఉంది. భద్రాచలం- పాపికొండలు ప్యాకేజీ అయితే పెద్దలకు రూ. 1300 పిల్లలకు రూ. 1,100 లుగా ఉంది. ఇక హైదరాబాద్- భద్రాచలం- పాపికొండలు టూర్ వివరాలు చూస్తే పెద్దలకు రూ. 6,999 అలాగే పిల్లలకు రూ. 5,599 గా ఉంది. ఈ ప్యాకేజీలో భాగంగా హైదరాబాద్ నుంచి ఏసీ లేదా నాన్ ఏసీ బస్సు సర్వీసు, ఆ తర్వాత బోటు సర్వీసు, బ్రేక్ ఫాస్ట్, లంచ్ ఉంటాయి.



































