Big Breaking: ఇక ఆ తప్పు అస్సలు చేయను.. చంద్రబాబు ఇంట్రస్టింగ్ కామెంట్స్..

అమరావతి, జూన్ 06: తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ(Telugu Desam Party) సమావశం ముగిసింది. ఈ సమావేశంలో కొత్తగా ఎన్నికైన ఎంపీలకు పార్టీ అధినేత చంద్రబాబు(Chandrababu Naidu) కీలక సూచనలు చేశారు. కేంద్రంలో, రాష్ట్రంలో ఎలా వ్యవహరించాలనే దానిపై గురువారం నాడు ఎంపీలతో(TDP MPs) చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ భేటీలో చంద్రబాబు కీలక కామెంట్స్ చేశారు. ప్రజలు ఇచ్చిన తీర్పుతో ఎవరూ ఆకాశంలో ఎగరొద్దని వార్నింగ్ ఇచ్చారు. ప్రజలు నమ్మకంతో ఇచ్చిన విజయాన్ని బాధ్యతగా సమాజ సేవ చేసేందుకు వినియోగించాలని దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలు పట్టించుకోని వైసీపీ ఎంపీలు.. జగన్ కేసుల మాఫీ అజెండాతోనే ఢిల్లీలో పైరవీలు చేశారన్నారు.


కానీ, మన కర్తవ్యం వేరు అని టీడీపీ ఎంపీలకు చంద్రబాబు సూచించారు. రాష్ట్ర ప్రయోజనాలే మనందరి ప్రథమ కర్తవ్యం కావాలని ఎంపీకు సూచించారు. అందుకు తగ్గట్లుగానే పార్లమెంట్‌లో కృషి చేయాలన్నారు. ముందు ప్రజాస్వామ్య వ్యవస్థల్ని గౌరవించాలని.. ఆ తరువాతే మనం అని చంద్రబాబు అన్నారు. వ్యవస్థలకు అతీతంగా ఎవరు వ్యవహరించినా.. ఆ వ్యవస్థే తిరిగి కాటేస్తుందన్నారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించాలని సూచించారు చంద్రబాబు. పదువులు శాశ్వతం అని ఎవరూ అనుకోవద్దని హెచ్చరించారు. ముఖ్యమంత్రిగా తన ప్రమాణ స్వీకారానికి మోదీని ఆహ్వానించామని.. ఆయన వచ్చేందుకు సానుకూలంగా స్పందించారన్నారు.

ఆసక్తికర వ్యాఖ్యలు..

కాగా, ఎంపీల సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక నుంచి మీరు మారిన చంద్రబాబును చూస్తారని అన్నారు. బ్యూరో క్రాట్‌ల పాలన ఎంతమాత్రం ఇక ఉండదన్నారు. ‘చంద్రబాబు మారరు అనే అపవాదు నా మీద ఉంది. ఇకముందు అలా ఉండదు. మీరే ప్రత్యక్షంగా చూస్తారు. ఎంపీలు అందరు తరచూ వచ్చి కలవండి. నేను బిజీగా ఉన్నా కూడా పక్కకు వచ్చి మాట్లాడి వెళ్తాను. టీడీపీ కార్యకర్తలు, నేతలు ఈ ఐదు సంవత్సరాల నా కోసం ప్రాణాలు ఇచ్చారు. కత్తి మీద పెట్టినా జై టీడీపీ, జై చంద్రబాబు అన్నారు. అధికార పార్టీ వత్తిడికి ఎవరూ తలొగ్గలేదు. ఇకనుంచి ప్రతి అంశం నేను వింటాను.. నేనే చూస్తాను. ఇక ముందు రాజకీయ పరిపాలన ఉంటుంది. అందరూ కలిసి పని చేయాలి. ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా కలిసి పనిచేయాలి. ఎవరి బౌండరీలు ఏమిటో నేను స్పష్టంగా చెపుతాను. అందరు ఎవరు పరిధిలో వారు పని చేయాలి. అందరం కలిసి కార్యకర్తలు, నేతలకు న్యాయం చేయాలి. ఈ ఐదు సంవత్సరాలు కార్యకర్తలు, నేతలు పడిన ఇబ్బందులు నాకు చాలా మనోవేదన కలిగించాయి. వారి కష్టం, వారి త్యాగం, కృషి వలనే ఈ రోజు పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ నెల 12వ తేదిన ప్రమాణ స్వీకారం చేస్తాను. ఈ సారి ఎన్నికైన ఎంపీల టీమ్ చాలా బాగుంది. గతంలో ఎర్రంనాయుడు ఉన్నప్పుడు ఇటువంటి టీమ్ ఉంది. ఈ టీమ్ ఢిల్లీలో రాష్ట్ర ప్రయోజనాల కోసం బాగా పని చేయాలి.’ అని చంద్రబాబు అన్నారు.