చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే సహించను

www.mannamweb.com


రాష్ట్రంలో ఏ పార్టీవారైనా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే సహించేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. తప్పు చేసినవారిని చట్టప్రకారం శిక్షిద్దామే తప్ప, రాజకీయ కక్షసాధింపు చర్యలు వద్దన్నారు. శాసనసభ కమిటీ హాల్‌లో చంద్రబాబు అధ్యక్షతన సోమవారం ఎన్డీయే శాసనసభాపక్ష సమావేశం నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ సహా..మంత్రులు, తెదేపా, జనసేన, భాజపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఆ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ… ‘మన వైపు నుంచి ఎవరైనా చిన్న తప్పు చేసినా ఉపేక్షించను. కక్షలూ కార్పణ్యాలు వద్దు. రాజకీయంగా ప్రతీకార చర్యలకు దిగవద్దు. ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఎవరూ వ్యవహరించకండి. ఈ విషయంలో మూడు పార్టీల ఎమ్మెల్యేలు, నాయకులు స్పష్టతతో ఉండాలి’ అని పేర్కొన్నారు. హింసాకాండకు పాల్పడిన వారిని శిక్షించే విషయంలో తరతమ భేదాలు చూడబోనన్నారు.

‘ఐదేళ్ల జగన్‌ పాలనలో చేయని అరాచకమంటూ లేదు. నాపై అక్రమ కేసులు బనాయించి 53 రోజులు జైల్లో పెట్టారు. కక్ష సాధించుకోవడమే మన లక్ష్యమైతే… మొదట నేనే ఆ పని చేయాలి. పవన్‌ కల్యాణ్‌ విశాఖకు వెళితే అడ్డుకున్నారు. తీవ్రంగా ఇబ్బంది పెట్టారు. నన్ను అక్రమంగా జైల్లో పెట్టినప్పుడు ఆయన పరామర్శకు వస్తున్నప్పుడూ అడ్డుపడ్డారు. ఆయనెలా స్పందించాలి? జగన్‌ చేసినట్టు మనం చేస్తే… ప్రజలు హర్షించరు. ప్రజలు మనకు అధికారమిచ్చింది దాని కోసం కాదు. వైకాపా నాయకులు రాష్ట్రాన్ని దోచుకుని వెళ్లిపోయారు. మనం రాష్ట్రాన్ని నిలబెట్టేందుకు, ప్రజలకు మంచి చేసేందుకూ వచ్చాం’ అని చంద్రబాబు స్పష్టంచేశారు. సోమవారం ఉదయం శాసనసభలో గవర్నర్‌ ప్రసంగం సందర్భంగా వైకాపా నాయకులు వ్యవహరించిన తీరుని సమావేశం తీవ్రంగా ఖండించింది. అసత్యాలు ప్రచారం చేస్తూ, రాష్ట్రపతి పాలనకు డిమాండ్‌ చేయడం వైకాపా నాయకుల రాజకీయ దివాలాకోరుతనానికి నిదర్శనమని ధ్వజమెత్తింది.

తప్పులు చేసి పక్కవాళ్లపై నెట్టేయడం వాళ్ల నైజం

తప్పులు చేసి వాటిని పక్కవాళ్లపైకి నెట్టేయడంలో వైకాపా నాయకులు ఆరితేరారని చంద్రబాబు ధ్వజమెత్తారు. ‘వివేకాది హత్య అని బయటపడేసరికి ఆ నెపాన్ని తెదేపా నాయకులు ఆదినారాయణరెడ్డి, బీటెక్‌ రవిపైకి నెట్టేయాలని చూశారు’ అని పేర్కొన్నారు. వైకాపా ఫేక్‌ ప్రచారం ఏ స్థాయిలో ఉంటుందో చెప్పేందుకు వినుకొండ ఘటన మరో నిదర్శనమన్నారు.  తప్పు చేసి తప్పించుకోవడంలో వైకాపా నాయకులు ఆరితేరారని, తాజాగా మదనపల్లె సబ్‌ కలెక్టర్‌ ఆఫీసులో ఫైళ్ల దగ్ధం ఘటన దానికి ఉదాహరణ అని తెదేపా అధినేత పేర్కొన్నారు.

ఇసుకకు దూరంగా ఉండండి.. 

మూడు పార్టీల ఎమ్మెల్యేలు, నాయకులు ఇసుకలో జోక్యం చేసుకోవద్దని చంద్రబాబు మరోసారి స్పష్టంచేశారు. ‘ఇసుక ఉచితంగా ఇస్తున్నాం. దాన్ని సక్రమంగా అమలయ్యేలా చూడాలి.  పార్టీ నాయకులెవరూ ఇసుక విషయంలో వేలు పెట్టినా అంగీకరించేది లేదు’ అని ఆయన అన్నారు. మన కార్యకర్తలే కదా అని కొందరికి అవకాశమిస్తే.. వారి మధ్యే గొడవలు తలెత్తడంతో పాటు, ప్రజల్లోనూ చెడ్డపేరు వస్తుందన్నారు. ప్రభుత్వం ఇసుకను ఉచితంగా ఇస్తున్నా కొన్ని జిల్లాల్లో ప్రజలకు చేరేసరికి ఎక్కువ ఖర్చవుతోందని, దీనికి ఏదైనా పరిష్కారం కనుగొనాలని కొందరు ఎమ్మెల్యేలు చంద్రబాబు దృష్టికి తెచ్చారు. ప్రస్తుతం స్టాక్‌యార్డ్‌ల నుంచే ఇసుకను సరఫరా చేస్తుండటం వల్ల..ఖర్చు ఎక్కువవుతోందని, రీచ్‌ల వద్దే ఇసుక సరఫరా చేయడం మొదలు పెడితే ఈ సమస్య పరిష్కారమవుతుందన్న అభిప్రాయం వ్యక్తమైంది. పవన్‌ కల్యాణ్‌ కోరినట్లుగా పేదల కోసం డొక్కా సీతమ్మ క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని చంద్రబాబు అన్నారు.

చంద్రబాబు నిర్ణయాలకు సంపూర్ణ మద్దతు: పవన్‌

రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం చంద్రబాబు తీసుకునే ప్రతి నిర్ణయానికీ జనసేన నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుందని పవన్‌ కల్యాణ్‌ స్పష్టంచేశారు. మంత్రి నాదెండ్ల మనోహర్‌ మాట్లాడుతూ రేషన్‌ డిపోల డీలర్‌షిప్‌ల కోసం మూడు పార్టీల కార్యకర్తల నుంచి డిమాండ్లు ఉన్నాయని, వాటిని కేటాయించేందుకు మార్గదర్శకాలు అవసరమని తెలిపారు. క్షేత్రస్థాయిలో నామినేటెడ్‌ పోస్టుల కేటాయింపునకు సంబంధించి మూడు పార్టీల మధ్య సమన్వయం అవసరమని ఆయన ప్రస్తావించారు. దీనిపై చంద్రబాబు స్పందిస్తూ… ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపు కోసం శ్రమించిన నాయకుల పేర్లను సిఫార్సు చేస్తే, అర్హులకు న్యాయం చేద్దామని తెలిపారు.


డాబు… దర్పం వద్దు..!

మనది ప్రజా ప్రభుత్వం. డాబు, దర్పం, అహంకారం వద్దు. సింపుల్‌గా ఉందాం. నా కోసం ట్రాఫిక్‌ ఆపవద్దని అధికారులకు చెప్పాను. మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా దాన్ని పాటించాలి. ప్రజలకు అసౌకర్యం కలిగించొద్దు.