ఆ హీరో కోసం ఏమైనా చేస్తా.. అతడి లైఫ్ స్టైల్ చాలా నచ్చుతుంది.. జగపతి బాబు

నటుడు జగపతి బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు హీరోగా అలరించిన ఆయన.. ఇప్పుడు సహాయ నటుడిగా, విలన్ పాత్రలతో బిజీగా ఉంటున్నారు.

సినీరంగంలో తన కెరీర్, వ్యక్తిగత జీవితం, తోటి సినీ ప్రముఖులతో తన సంబంధాలపై ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేశారు. తన కెరీర్ పతనం ప్రారంభమైన ఆరు నెలల తర్వాత భారీ అప్పులు చేసి ఇల్లు కట్టడమే తన జీవితంలో చేసిన పెద్ద తప్పు అని ఆయన భావోద్వేగంగా తెలిపారు. దాదాపు 15-20 సంవత్సరాల పాటు ఆ అప్పులకు వడ్డీలు చెల్లించానని, ఇది తన జీవితంలో పెద్ద నష్టమని పేర్కొన్నారు. తన కుటుంబం తన సమస్యలను తెలుసుకుని బాధపడకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని, ఈ కష్టకాలంలో తన కుటుంబం ఎంతో మద్దతుగా నిలిచిందని, అది తన అదృష్టమని జగపతి బాబు అన్నారు.


సైరా నరసింహారెడ్డి చిత్రంలో తన పాత్ర గురించి మాట్లాడుతూ, ఇది తాను గతంలో చేసిన పాత్రల కంటే భిన్నంగా ఉంటుందని చెప్పారు. ఈ నిర్మాణ విలువలు, ముఖ్యంగా రామ్ చరణ్ ప్రొడక్షన్ విషయంలో చూపిన శ్రద్ధను ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. జార్జియాలో షూటింగ్ సమయంలో చిన్న యూనిట్ సభ్యుల నుండి పెద్దవారి వరకు అందరికీ అద్భుతమైన ఆతిథ్యం, భోజనం, వసతి, వైద్య సేవలు అందించారని, రామ్ చరణ్ సైలెంట్‌గా వచ్చి అన్ని ఏర్పాట్లు చక్కగా చేశారని అన్నారు.. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జునలతో కలిసి నటించిన తాను వెంకటేష్‌తో మాత్రం ఇంకా చేయలేదని తెలిపారు.

నాగార్జునతో తనకున్న బంధం, ఆయనపై తనకున్న అపారమైన గౌరవం గురించి మాట్లాడుతూ, నాగార్జున తనకంటే రెండు, మూడేళ్లు పెద్దవారని, అన్నయ్యలా కాకుండా స్నేహితుడిలా ఎక్కువ అని పేర్కొన్నారు. ప్రతీ రెండు రోజులకోసారి నాగార్జునను తలుచుకుంటానని, ఆయన జీవితాన్ని జీవించే విధానం తనకెంతో నచ్చుతుందని జగపతి బాబు చెప్పారు. సంపాదించడమే కాదు, ఖర్చు పెట్టడం, ఇవ్వడం కూడా నాగార్జునకు తెలుసని, ఆయన ప్రతి విషయంలోనూ పూర్తి హస్తం పెట్టి, నిజాయితీగా కృషి చేస్తారని ప్రశంసించారు. నాగార్జున, వెంకటేష్‌ వంటి వారి ఆలోచనా విధానం, ఆచరణాత్మకత ఎంతో బాగుంటాయని, వారు తమ జీవితాలను అద్భుతంగా జీవిస్తున్నారని అన్నారు.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.