విజయనగరం జిల్లా భోగాపురం మండలం రావాడ గ్రామ పంచాయతీ పరిధిలో కొందరు ఐఏఎస్ అధికారులు 5.33 ఎకరాలను కొద్ది నెలల కిందట కొనుగోలు చేశారు. కొందరు అధికారులు బృందంగా ఏర్పడి కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ ప్రాంతం విశాఖకు 40 కి.మీ, విజయనగరానికి 30 కి.మీ.దూరంలో, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి ఏడు కి.మీ. దూరంలో ఉంది. విశాఖ మహాప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ)- 2041 బృహత్తర ప్రణాళిక అమల్లోకి రావడంతోపాటు విమానాశ్రయం వల్ల భవిష్యత్తులో ఇక్కడి భూములకు మరింత విలువ పెరగనుంది. ఈ నేపథ్యంలోనే స్థానికుల నుంచి జిరాయితీ భూములు కొనుగోలు చేశారు. ఓ ప్రైవేటు వ్యక్తి ఆధ్వర్యంలో ఈ స్థలాలను సేకరించి కొనుగోలు చేసినట్లు సమాచారం.
లేఅవుట్‌కు అనుమతి కోరుతూ..
ఐఏఎస్‌లు కొనుగోలు చేసిన స్థలాలు విమానాశ్రయానికి సమీపంలో వీఎంఆర్‌డీఏ బృహత్తర ప్రణాళిక మిశ్రమ వినియోగ జోన్-3లో ఉన్నాయి. దీంతో ఇక్కడ నచ్చిన నిర్మాణాలు చేపట్టవచ్చు. పర్యాటక, వాణిజ్య, నివాస ఇతర అవసరాలకు వినియోగించుకోవచ్చు. ప్రస్తుతం ఇక్కడ లేఅవుట్ అనుమతి (ఎల్‌పీ) కోసం వీఎంఆర్‌డీఏకు ప్రతిపాదించినట్లు సమాచారం. ఆధునిక వసతులతో గేటెడ్ కమ్యూనిటీ తరహాలో దీన్ని అభివృద్ధి చేయనున్నారు. ఇందులో 85 ప్లాట్ల వరకు ఉండే విధంగా ప్రణాళిక చేసినట్లు తెలిసింది. ఉత్తరాంధ్రలో పనిచేస్తున్న వారితో పాటు ఇతర చోట్ల విధులు నిర్వహించే అధికారులు ఇక్కడ కొనుగోలు చేసినట్లు సమాచారం.