టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై మ్యాచ్ రిఫరీ కఠిన చర్యలు తీసుకున్నారు. ఐసీసీ నిబంధనలను ఉల్లంఘించాడనే కారణంతో అతని మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధించడంతో పాటు ఓ డీ మెరిట్ పాయింట్ కేటాయించారు.
ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో మెల్‌బోర్న్ వేదికగా గురువారం ప్రారంభమైన నాలుగో టెస్ట్‌లో విరాట్ కోహ్లీ సహనం కోల్పోయిన విషయంతెలిసిందే.
ఆసీస్ అరంగేట్ర ప్లేయర్ కోన్‌స్టాస్(65 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 60) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగడంతో విరాట్ కోహ్లీ ఆగ్రహానికి గురయ్యాడు. దాంతో ఈ 19 ఏళ్ల కుర్రాడినే కవ్వించే ప్రయత్నం చేశాడు.
తనకు ఎదురుగా నడిచిన సామ్ కోన్‌స్టాస్ భుజాన్ని కోహ్లీ బలంగా ఢీకొట్టాడు. అనంతరం అతనితో వాగ్వాదానికి దిగాడు. ఉస్మాన్ ఖవాజా, అంపైర్లు జోక్యం చేసుకొని ఇద్దర్ని వారించారు. ఈ ఘటన ఆసీస్ తొలి ఇన్నింగ్స్ 10వ ఓవర్ అనంతరం చోటు చేసుకుంది. ఈ ఓవర్ పూర్తయిన అనంతరం సామ్ కోన్‌స్టాస్ మరో ఎండ్ వైపు నడుస్తుండగా.. కోహ్లీ డ్యాష్ ఇచ్చాడు.
కోహ్లీ కవ్వింపులకు ఏమాత్రం సహనం కోల్పోని సామ్ కోన్‌స్టాస్ బ్యాట్‌తోనే బదులిచ్చాడు. బుమ్రా వేసిన ఆ మరుసటి 11వ ఓవర్‌లో కోన్‌స్టాస్ వరుసగా 4, 0, 2, 6, 4, 2 బాది 18 పరుగులు పిండుకున్నాడు.
19 ఏళ్ల అరంగేట్ర ఆటగాడి పట్ల కోహ్లీ వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లు విరాట్ కోహ్లీ తీరును తప్పుబట్టారు. కోహ్లీ ఉద్దేశపూర్వకంగానే సామ్ కోన్‌స్టాస్‌ను ఢీ కోట్టాడని ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అన్నాడు. ఈ ఘటనపై మ్యాచ్ రిఫరీ కఠిన చర్యలు తీసుకోవాలని కోరాడు.
ఈ ఘటన నేపథ్యంలో విరాట్ కోహ్లీపై ఓ మ్యాచ్ నిషేధం పడుతుందని కూడా జోరుగా చర్చ సాగింది. కానీ అంపైర్ల ఫిర్యాదుతో విచారణ చేపట్టిన మ్యాచ్ రిఫరీ.. ఐసీసీ నిబంధనల ప్రకారం లెవల్-1 నేరంగా పరిగణించి 20 శాతం మ్యాచ్ ఫీజు కోతతో పాటు ఒక డీమెరిట్ పాయింట్ కేటాయించాడు.
24 నెలల కాలంలో ఏ ఆటగాడైన నాలుగు డీమెరిట్ పాయింట్స్ పొందితే ఒక టెస్ట్ మ్యాచ్ లేదా రెండు పరిమిత ఓవర్ల మ్యాచ్‌లు ఆడకుండా నిషేధం విధిస్తారు. అయితే విరాట్ కోహ్లీ ఖాతాలో ఒక్క డీమెరిట్ పాయింట్ కూడా లేదు. రాబోయే రెండెళ్లలో కోహ్లీ మరో డీ మెరిట్ పాయింట్స్ పొందితే ఓ మ్యాచ్ నిషేధం ఎదుర్కోవాల్సి ఉంటుంది.