500 పోస్ట్‌ల భర్తీకి ఐడీబీఐ నోటిఫికేషన్
పీజీడీబీఎఫ్‌లో ప్రవేశంతో కొలువులు ఖరారు
కోర్సు పూర్తయ్యాక బ్యాంకులో నియామకం
ఏడాదికి రూ. 6.5 లక్షల వరకు వేతనం
మొత్తం పోస్టుల సంఖ్య 500
ఐడీబీఐ తాజా నోటిఫికేషన్ ద్వారా.. మొత్తం 500 జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్‌ల భర్తీకి శ్రీకారం చుట్టింది. ఓపెన్ కేటగిరీలో 203; ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 50; ఓబీసీ కేటగిరీలో 135; ఎస్‌సీ కేటగిరీలో 75, ఎస్‌టీ కేటగిరీలో 37 పోస్ట్‌లు ఉన్నాయి.
అర్హతలు
జనవరి 31, 2024 నాటికి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.
వయసు: జనవరి 31, 2024 నాటికి 20 నుంచి 25 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్‌సీ/ఎస్‌టీ అభ్యర్థులకు అయిదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు చొప్పున గరిష్ట వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
పీజీడీబీఎఫ్ పూర్తి చేసుకుంటేనే
జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్‌లకు నోటిఫికేషన్ విడుదల చేసిన ఐడీబీఐ.. నియామకాల ఖరారుకు వినూత్న విధానాన్ని అమలు చేస్తోంది. ఎన్‌ఈఐపీఎల్, మణిపాల్ గ్లోబల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ సంస్థలతో కలిసి.. ఏడాది వ్యవధిలోని పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్(పీజీడీబీఎఫ్) కోర్సును అందిస్తోంది. జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్‌ల ఎంపిక ప్రక్రియలో విజేతలుగా నిలిచిన వారు ఈ కోర్సును పూర్తి చేసుకుంటేనే బ్యాంకులో కొలువు ఖరారు చేస్తారు.
పీజీడీబీఎఫ్ ఇలా
పీజీడీబీఎఫ్ కోర్సులో భాగంగా ముందుగా బ్యాంకింగ్ రంగ నైపుణ్యాలపై ఆరు నెలల పాటు క్లాస్ రూమ్ బోధన ఉంటుంది. ఆ తర్వాత రెండు నెలల ఇంటర్న్‌షిప్, మరో నాలుగు నెలలు ఐడీబీఐ శాఖల్లో ఆన్ జాబ్ ట్రైనింగ్ సదుపాయం కల్పిస్తారు. ఈ కోర్సు పూర్తి చేసుకున్న తర్వాత అభ్యర్థులకు ఐడీబీఐ శాఖల్లో అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్-ఓ స్థాయిలో నియామకం ఖరారవుతుంది. కోర్సు పూర్తి చేసుకున్న వారికి కొలువుతోపాటు పీజీడీబీఎఫ్ సర్టిఫికెట్ కూడా అందిస్తారు.
స్టయిఫండ్
ఐడీబీఐ పీజీడీబీఎఫ్ కోర్సులో చేరిన అభ్యర్థులకు స్టయిఫండ్ పేరుతో ఆర్థిక ప్రోత్సాహకాన్ని కూడా అందిస్తారు.ఏడాది వ్యవధిలోని కోర్సు సమయంలో మొదటి ఆరు నెలలు నెలకు రూ.5వేలు; ఆ తర్వాత రెండు నెలల ఇంటర్న్‌షిప్ సమయంలో నెలకు రూ.15 వేలు చొప్పున స్టయిఫండ్ అందిస్తారు.
రూ. 6.5 లక్షల వేతనం
పీజీడీబీఎఫ్ కోర్సును విజయవంతంగా పూర్తి చేసుకుని.. జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్-ఓ హోదాలో కొలువు ఖరారు చేసుకున్న వారికి ప్రారంభ వార్షిక వేతనం రూ.6.14 లక్షల నుంచి రూ.6.5 లక్షల వరకు ఉంటుంది. ఈ హోదాలో మూడేళ్లు పని చేశాక బ్యాంకు నిబంధనలకు అనుగుణంగా గ్రేడ్-ఎ ఆఫీసర్లుగా పదోన్నతికి అర్హత లభిస్తుంది.
ఏడాది ప్రొబేషన్
జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్-ఓ హోదాలో నియమితులైన వారికి ఏడాది పాటు ప్రొబేషనరీ పిరియడ్ విధానం అమలవుతోంది. నియామకం ఖరారు చేసుకున్న వారు బ్యాంకులో కనీసం మూడేళ్ల పాటు విధులు నిర్వర్తిస్తామని రూ. 2 లక్షల విలువైన పూచీకత్తు బాండ్ ఇవ్వాల్సి ఉంటుంది.
రెండంచెల ఎంపిక ప్రక్రియ
ఐడీబీఐ బ్యాంకులో జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్-ఓ పోస్ట్‌లకు మార్గం వేసే పీజీడీబీఎఫ్ కోర్సులో ప్రవేశానికి ఎంపిక ప్రక్రియ రెండు దశల్లో నిర్వహిస్తారు. అవి.. రాత పరీక్ష,పర్సనల్ ఇంటర్వ్యూ.
నాలుగు విభాగాల్లో రాత పరీక్ష
పీజీడీబీఎఫ్ కోర్సులో ప్రవేశానికి నిర్వహించే రాత పరీక్ష.. రెండు వందల మార్కులకు నాలుగు విభాగాల్లో ఉంటుంది. ఇందులో లాజికల్ రీజనింగ్, డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్‌ప్రిటేషన్ 60ప్రశ్నలు-60 మార్కులు, ఇంగ్లిష్ లాంగ్వేజ్ 40 ప్రశ్నలు-40 మార్కులు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 40 ప్రశ్నలు-40 మార్కులు, జనరల్/ఎకానమీ/బ్యాంకింగ్ అవేర్‌నెస్/కంప్యూటర్/ఐటీ 60 ప్రశ్నలు-60 మార్కులకు ఉంటాయి. పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. ఈ ఆన్‌లైన్ టెస్ట్‌కు కేటాయించిన సమయం రెండు గంటలు. నెగెటివ్ మార్కింగ్ నిబంధన(ప్రతి తప్పు సమాధానానికి 1/4 మార్కు)ఉంది.
చివరగా పర్సనల్ ఇంటర్వ్యూ
రాత పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా అందుబాటులో ఉన్న పోస్ట్‌లు, రిజర్వేషన్లను పరిగణనలోకి తీసుకుని మెరిట్ జాబితా రూపొందిస్తారు. ఈ జాబితాలో నిలిచిన వారికి చివరగా 100 మార్కులకు పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
వెయిటేజీ విధానం
పీజీడీబీఎఫ్‌కు ఎంపిక చేసేందుకు… తుది జాబితా రూపకల్పనలో వెయిటేజీ విధానాన్ని అమలు చేస్తారు. రాత పరీక్షకు 75 మార్కులు; పర్సనల్ ఇంటర్వ్యూకు 25 మార్కులు చొప్పున వెయిటేజీని నిర్ధారించారు. అభ్యర్థులు పొందిన మార్కులను ఈ వెయిటేజీలకు అనుగుణంగా క్రోడీకరించి.. తుది జాబితా విడుదల చేస్తారు.
రాత పరీక్షలో రాణించేలా
లాజికల్ రీజనింగ్, డేటా అనాలిసిస్ అండ్ డేటా ఇంటర్‌ప్రిటేషన్‌కు సంబంధించి డైరక్షన్స్, డిస్టెన్స్, అనాలజీ, బ్లడ్ రిలేషన్స్, సిరీస్, డబుల్ లైనప్, డయాగ్రమ్స్, ఫ్లో చార్ట్‌లను ప్రాక్టీస్ చేయాలి.
ఇంగ్లిష్‌కు సంబంధించి గ్రామర్ అంశాలపై పూర్తి అవగాహన ఏర్పరచుకోవాలి. ముఖ్యంగా వొకాబ్యులరీ, కాంప్రహెన్షన్‌లపై పట్టు సాధించాలి. అదే విధంగా సింపుల్, కాంప్లెక్స్, కాంపౌండ్ సెంటెన్స్‌లను ప్రాక్టీస్ చేయాలి.
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌కు సంబంధించి మ్యాథమెటిక్స్‌లోని కోర్ అంశాలతోపాటు అర్థమెటిక్ అంశాలు (నిష్పత్తులు, శాతాలు, టైం అండ్ డిస్టెన్స్, టైం అండ్ వర్క్, యావరేజెస్, స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్, కూడికలు, హెచ్చవేతలు తదితర)పై దృష్టి పెట్టాలి.
నాలుగో విభాగంలోని జనరల్ అవేర్‌నెస్‌కు సంబంధించి కరెంట్ అఫైర్స్‌పై పట్టు సాధించాలి. ఎకానమీ విషయంలో ఇటీవల కాలంలో ఆర్థిక రంగంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు తెలుసుకోవాలి. బ్యాంకింగ్ అవేర్‌నెస్ విషయంలో బ్యాంకింగ్ వ్యవస్థ స్వరూపంతోపాటు తాజా పరిణామాలు, బ్యాంకింగ్ టెర్మినాలజీపై అవగాహన ఏర్పరచుకోవాలి. కంప్యూటర్/ఐటీ అవేర్‌నెస్ విషయంలో అభ్యర్థులు కంప్యూటర్ ఆపరేషన్ టూల్స్‌పై పట్టు సాధించాలి.
ముఖ్య సమాచారం
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 2024, ఫిబ్రవరి 26
ఆన్‌లైన్ టెస్ట్ తేదీ: 2024, మార్చి 17
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://www.idbibank.in/