జవహర్ రెడ్డికి స్థాన చలనం – నూతన సీఎస్ గా రేసులో..!?

www.mannamweb.com


ఏపీలో ఎన్నికల పోరు హోరా హోరీగా మారుతోంది. కూటమి నేతలు వైసీపీ అనుకూల అధికారులు అంటూ కొందరి పైన ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పై లేఖ రాసారు. అందులో భాగంగా ప్రస్తుత సీఎస్ జవహర్ రెడ్డి మార్పు పైన అధికార వర్గాల్లో చర్చ సాగుతోంది. జవహర్ రెడ్డికి స్థాన చలనం కలిగితే నూతన సీఎస్ గా పరిశీలనలో అయిదుగురు పేర్లు ఉన్నాయి.

సీఎస్ జవహర్ రెడ్డి వైసీపీ ప్రభుత్వానికి అత్యంత అనుకూలంగా పని చేస్తున్నారని ఎన్నిక సంఘానికి పురందేశ్వరి లేఖ రాసారు. సీఎస్ తో పాటుగా డీజీపీ, పలువురు సివిల్ సర్వీసు అధికారుల పేర్లు అందులో ప్రస్తావించారు. ఈ లేఖ పైన ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వ స్పందన కోరింది. సీఎస్ గా జవహర్ రెడ్డికి స్థాన చలనం ఖాయమని చెబుతున్నారు. ఇదే సమయంలో జవహర్ రెడ్డిని తప్పిస్తే ఇంఛార్జ్ సీఎస్ గా అయిదుగురి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. సీనియర్ ఐఏఎస్ అధికారులు నీరబ్ కుమార్ ప్రసాద్, ఆర్‌పి సిసోడియా, రజత్‌ భార్గవ్‌, శ్రీలక్ష్మి, అనంతరామ్‌లతో కూడిన జాబితాను ఈసీ పరిశీలనకు.. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి మీనా పంపినట్లు తెలుస్తోంది.

ఆ క్రమంలో నీరబ్ కుమార్ ప్రసాద్ లేదా సిసోడియాలలో ఒకరికి తదుపరి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటికే ఫిర్యాదుల ఆధారంగా ఏపీలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల విషయంలో ఎన్నికల సంఘం స్పందించింది. అధికారులను బదిలీ చేసింది. ఈ క్రమంలో పురందేశ్వరి చేసిన ఫిర్యాదు పైన రాజకీయంగానూ దుమారం చెలరేగింది. వాలంటీర్ల ను పెన్షన్ల పంపిణీ విధుల నుంచి దూరంగా ఉంచాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఆ సమయంలో అధికారుల తీరు పైన ప్రతిపక్ష నేతలు ఫిర్యాదులు చేసారు. దీంతో, ఇప్పుడు సీఎస్ జవహర్ రెడ్డి విషయంలో ఎన్నికల సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.