సిబిల్ స్కోర్ తక్కువగా ఉంటే లోన్స్ మాత్రమే కాదు, ఉద్యోగాలు కూడా రావట

క్రెడిట్ కార్డులు, లోన్స్ పొందడం విషయంలో సిబిల్ స్కోర్ ఎంతో కీలకమైనది. సిబిల్ స్కోర్ తక్కువగా ఉంటే లోన్స్ పొందడం కష్టమవుతుంది, కొన్ని సందర్భాల్లో లోన్ ఇచ్చినా, అధిక వడ్డీకి లోన్స్ ఇస్తారు.


అయితే సిబిల్ స్కోర్ తక్కువగా ఉంటే లోన్స్‌ అప్రూవల్ మాత్రమే కాదు, ఉద్యోగ అవకాశాలు కూడా తగ్గిపోవచ్చట. ప్రత్యేకించి బ్యాంకింగ్ సెక్టార్‌లో ఉద్యోగాలు పొందటంలో సిబిల్ స్కోర్ ఎంతో కీలకంగా ఉంటుందట.

సిబిల్ స్కోర్ అనేది సిబిల్(CIBIL) అనే క్రెడిట్ బ్యూరో సంస్థ ఇచ్చే క్రెడిట్ స్కోర్. మూడంకెల ఈ సిబిల్ స్కోర్ సాధారణంగా 300 నుండి 900 వరకు ఉంటుంది. ఒక వ్యక్తి క్రెడిట్ హిస్టరీని తెలియజేసే స్కోర్ ఇది. అయితే సిబిల్ మాత్రమే కాకుండా మరికొన్ని క్రెడిట్ బ్యూరో సంస్థలు కూడా క్రెడిట్ స్కోర్ అందిస్తున్నాయి. Experian, Equifax, CRIF High Mark ఇండియాలో ఉన్న క్రెడిట్ బ్యూరో సంస్థలు.

రాజ్య సభ ఎంపీ డా.జాన్ బ్రిట్టాస్ బ్యాంకు ఉద్యోగాలకు సిబిల్ స్కోర్ అంశం గురించి ఆర్థిక శాఖను అడిగారు. బ్యాంకు ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులకు సిబిల్ స్కోర్ 650కి పైగా ఉండాల్సిందేనా అని ప్రశ్నించారు.

ఈ అంశంపై ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి స్పందిస్తూ, జాతీయ బ్యాంకుల నియామక పరీక్షను నిర్వహించే IBPS (ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్) 2023-24 (CRP-XIII) నియామక ప్రక్రియలో ఈ నిబంధన పెట్టిందని తెలిపారు. దీని ప్రకారం, బ్యాంకింగ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం 650 CIBIL స్కోరు ,హెల్తీ క్రెడిట్ హిస్టరీని కలిగి ఉండాలని పేర్కొన్నారు.

బ్యాంకింగ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలంటే సిబిల్ స్కోర్ ఉండాల్సిందేనా?

అయితే , ఈ నింబంధన 2024-25 (CRP-XIV) నియామక ప్రక్రియ నుండి తొలగించినట్లు మంత్రి స్పష్టం చేశారు. ఇప్పుడు అభ్యర్థులు సిబిల్ స్కోర్‌తో అవసరం లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఉద్యోగంలో చేరే సమయానికి హెల్తీ క్రెడిట్ హిస్టరీని చూపించాల్సి ఉంటుంది. ఒక వేళ అభ్యర్థి సిబిల్ రికార్డులు అప్‌డేట్ లేనట్లయితే, సంబంధిత రుణదాత నుండి NOC తీసుకుని రావాల్సి ఉంటుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.