టికెట్ బుకింగ్స్‌లో జరుగుతున్న మోసాలను అరికట్టడానికి భారత రైల్వే శాఖ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) పోర్టల్‌లో కొన్ని మార్పులు చేసింది. ఇప్పుడు మరిన్ని మార్పులు చేసేందుకు సిద్ధమవుతోంది. వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో పెట్టుకుని వివిధ చర్యలు చేప్పటింది. ఇందులో ఆధార్ లింకింగ్, మోసాలకు అరికట్టడంపై రైల్వే శాఖ ప్రత్యేక దృష్టి సారించింది.
ఏఐ టెక్నాలజీతో మోసాలకు చెక్
ఇకపై ఐఆర్‌సీటీసీ ప్లాట్ఫామ్లో టికెట్ పొందేందుకు ఏ అనధికార టికెట్ బుకింగ్ ఏజెంట్ ఒకేసారి బహుళ ప్రయత్నాలు చేయలేరని రైల్వే అధికారి తాజాగా తెలిపారు. అనధికార టిక్కెట్ బుకింగ్స్‌ను అరికట్టడానికి ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ (AI) ఆధారిత అధునాతన సాంకేతిక పద్ధతిని అమలు చేసినట్లు చెప్పారు. డిస్పోజబుల్ ఈ- మెయిల్ అడ్రెస్ల వల్ల ఇబ్బంది ఉండని తెలిపారు.
3.5 కోట్ల తప్పుడు ఐడీలు బ్లాక్
అయితే అనధికారంగా రైలు టికెట్లు బుక్ చేస్తున్నవారికి అడ్డుకట్ట వేయడానికి ఏడాది కాలంలో 3.5 కోట్ల తప్పుడు ఐడీలను స్తంభింపజేసినట్లు ఐఆర్‌సీటీసీ అధికారి తెలిపారు. దీంతో పోర్టల్‌లో ట్రాఫిక్ గణనీయంగా తగ్గిందని చెప్పారు. బుకింగ్ వ్యవస్థను అంతరాయం కలిగించే తప్పుడు ఖాతాలను గుర్తించి ఏఐ టెక్నాలజీ నిలిపివేస్తుందని ఆయన అన్నారు.
7వేల డిస్పోజబుల్ ఈ-మెయిల్స్ ఐడీలు బ్లాక్
అదే సమయంలో ఇటీవల 7,000 డిస్పోజబుల్ ఈ-మెయిల్ ఐడీలను బ్లాక్ చేశామని, ఇది టికెటింగ్ సమగ్రతను మరింత బలోపేతం చేస్తుందని మరో అధికారి తెలిపారు. దీంతో ఐఆర్‌సీటీసీ తన డిజిటల్ మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తూనే ఉందని చెప్పారు. దేశమంతటా లక్షలాది మందికి మరింత పారదర్శకంగా, అందుబాటులో ఉండే సమర్థవంతమైన రైల్వే బుకింగ్ అనుభవాన్ని ప్రోత్సహిస్తుందని ఆయన అన్నారు.
తత్కాల్ బుకింగ్స్‌పై కీలక నిర్ణయం
కాగా, తత్కాల్ టికెట్లు బుక్ చేసుకునేందుకు ఈ-ఆధార్ ధ్రువీకరణను త్వరలో ప్రారంభిస్తామని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ బుధవారం వెల్లడించారు. అసలైనవారికి బెర్తులు ఖాయమయ్యేందుకు ఇది దోహదపడుతుందని చెప్పారు. ఒక ప్రయాణికుడి గుర్తింపును ఆధార్ ద్వారా ధ్రువీకరించేందుకు రైల్వే సమాచార వ్యవస్థ కేంద్రం (క్రిస్)ను అనుమతిస్తూ ఇటీవల గెజిట్ ప్రకటన జారీ అయింది.
అయితే ఆధార్ ధ్రువీకరణకు ఐఆర్‌సీటీసీ కూడా థర్డ్ పార్టీపై ఆధారపడుతోంది. 13 కోట్ల మంది వినియోగదారులు ఉంటే వారిలో 1.20 కోట్ల మందికే ఆధార్ ధ్రువీకరణ పూర్తయింది. మిగిలినవారి కోసం ప్రత్యేక కార్యక్రమం చేపట్టనున్నారు. ఆధార్‌తో అనుసంధానమైన వారికి తత్కాల్ టికెట్ల అమ్మకాల్లో మొదటి 10 నిమిషాల్లో ప్రాధాన్యం లభిస్తుంది. ఇలాంటి ఖాతాలున్న వారికే ఆన్‌లైన్‌లో తత్కాల్ టికెట్ల అవకాశం కల్పించనుంది.
































