వయసు పెరిగే కొద్దీ ఎముకలు బలహీనపడటం ప్రారంభమవుతాయి. ఫలితంగా మోకాలి, నడుముతో సహా వివిధ భాగాల కీళ్లలో విపరీతమైన నొప్పి మొదలవుతుంది. మొదటి నుంచి ఎముకల బలంపై తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే తర్వాత పెద్ద ఇబ్బందులు ఎదుర్కోకతప్పదు.
సాధారణంగా శరీరంలో కాల్షియం లోపం వల్ల ఎముకల్లో నొప్పి వస్తుంది. ముఖ్యంగా స్త్రీలకు 40 ఏళ్లు రాగానే కాల్షియం లోపం తలెత్తుతుంది. అందువల్ల, ఎముకలు ఆరోగ్యంగా ఉండటానికి శరీరంలో కాల్షియం స్థాయిని పెంచుకోవడం చాలా అవసరం.
చాలా మంది కీళ్ల నొప్పికి కాల్షియం సప్లిమెంట్లను తీసుకుంటూ ఉంటారు. అయితే కొన్ని సాధారణ ఆహారాల ద్వారా కూడా శరీరంలో కాల్షియం లోపాన్ని అధిగమించడం సాధ్యమవుతుంది. అవేంటంటే.. కాల్షియం అధికంగా ఉండే ఆహారాల్లో ఒకటి పాలు. రోజూ పాలు తాగడం ద్వారా కాల్షియం లోపాన్ని భర్తీ చేయవచ్చు. పాలు తాగడం ఇష్టంలేకుంటే.. ఆహారంలో భాగంగా చీజ్, నెయ్యి, వెన్న వంటి పాల ఉత్పత్తులను తీసుకోవచ్చు.
బ్రోకలీ వంటి ఆకుపచ్చ కూరగాయలలో కాల్షియం అధికంగా ఉంటుంది. వీటిని ఆహారంలో ఉంచడం ద్వారా కాల్షియం లోపం త్వరగా భర్తీ అవుతుంది. ఎముకలు బలంగా ఉంటాయి.
నట్స్‌లో కూడా అధికంగా కాల్షియం ఉంటుంది. అందువల్ల, ప్రతిరోజూ కొన్ని గింజలు, బాదంపప్పులు తింటే కాల్షియం లోపాన్ని భర్తీ చేయవచ్చు. పొద్దుతిరుగుడు విత్తనాల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది.
ఎముకలు దృఢంగా ఉండాలంటే చిలగడదుంప తప్పక తినాలి. ఇందులో కాల్షియం, భాస్వరం అధికంగా ఉంటుంది. ఇది ఎముకల ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఆహారంలో కాల్షియం సమృద్ధిగా ఉండే అంజీర్ పండ్లను కూడా తీసుకోవచ్చు. ఇవి ఎముకలను దృఢంగా చేస్తాయి.