సమ్మర్​ స్పెషల్.. ఇది తాగితే ఎండల్లో తిరిగినా కూడా వడదెబ్బ అస్సలు తగలదు..

ఎండ తీవ్రత రోజురోజుకి పెరిగిపోతోంది. దీంతో ప్రజలు బయటికి రావాలంటేనే ఇబ్బంది పడుతున్నారు. ఇక తప్పని పరిస్థితుల్లో ఇంటి నుండి బయటకు వెళ్లినవారు ఎండ వేడి నుంచి ఉపశమనం పొందడానికి అనేక కూల్‌డ్రింక్స్‌ తాగుతారు.


అయితే, ఇలా బయటకు వెళ్లిన ప్రతి రోజూ కూల్‌డ్రింక్స్‌ తాగితే అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి, ఎండ నుండి రిలీఫ్ పొందడానికి రాగి జావ బెస్ట్​ అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

వేసవిలో రాగి జావ తాగితే ఆరోగ్యంగా ఉంటారని చెబుతున్నారు. వడదెబ్బ తగలకుండా ఉండటానికి, అలాగే శరీరాన్ని చల్లబరచడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే, చాలా మందికి రాగిజావ ఎలా తయారు చేస్తారో తెలియదు. సమ్మర్‌ స్పెషల్‌ రాగి జావను ఇంట్లోనే ఎలా ప్రిపేర్‌ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

రాగి జావకు కావాల్సిన పదార్థాలు :

రాగి పిండి – 4 టేబుల్ స్పూన్లు

జీలకర్ర పొడి – 1/2 టేబుల్‌ స్పూన్‌

పెరుగు లేదా మజ్జిగ – 1 కప్పు

నీరు – 2 నుంచి 3 గ్లాసులు

ఉప్పు – రుచికి సరిపడ

రాగి జావ తయారీ విధానం :

ముందుగా ఒక చిన్న గిన్నెలో రాగి పిండి తీసుకోని, అందులో 1/2 కప్పు నీళ్లు పోసి బాగా కలపుకోవాలి. తర్వాత ఒక పెద్ద గిన్నెను తీసుకుని స్టవ్‌పై పెట్టి, అందులో రెండు గ్లాసుల నీళ్లు పోసి కొద్దిగా మరిగించాలి. ఆ తర్వాత, కలిపి పెట్టుకున్న రాగి పిండి మిశ్రమాన్ని అందులో పోయాలి. మంట చిన్నగా పెట్టుకుని గరిటెతో జావను తిప్పుతూ ఉండాలి. జావ ఉడికిన తర్వాత అందులో సరిపడినంత ఉప్పు, జీలకర్ర పొడిని వేసి కలపాలి.

జావ కొద్దిగా చల్లారిన తర్వాత అందులో పెరుగు లేదా మజ్జిగ వేసి కలిపి తాగితే చాలా బాగుంటుంది. మీరు జావ మరింత టేస్ట్‌గా ఉండలాంటే, కొన్ని తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కాస్త కొత్తిమీరను కూడా యాడ్‌ చేసుకోవచ్చు.

రాగి జావ ప్రయోజనాలు :

వేసవిలో రాగి జావ తాగితే శరీరంలో వేడి తగ్గి చలువ చేస్తుందని నిపుణులు అంటున్నారు. దీనిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుందని.. ఇది తాగితే రక్తపోటు, షుగర్‌ కంట్రోల్లో ఉంటాయని చెబుతన్నారు. ఉదయం పూట రాగి జావ తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. రాగుల్లో ఫైబర్, ఐరన్, క్యాల్షియం, ఐయోడిన్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. దీనిని తాగితే శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ అందుతాయి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.)