ఆకు కూరలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని నిపుణులు పదే పదే చెబుతున్నారు. అలాంటి ఆకుకూరల్లో గోంగూర కూడా ఒకటి. దీనినే పుంటికూర అని కూడా అంటారు.
గోంగూరతో పచ్చడి, పప్పు, పులిహోరను, గోంగూర చికెన్,గోంగూర మటన్, ఇలా రకరకాల వంటకాలు తయారు చేస్తారు. గోంగూర కేవలం రుచిలోనే కాదు..ఆరోగ్య పరంగా అనేక ప్రయోజనాలు కలిగి ఉందని మీకు తెలుసా..? తరచూ గోంగూర తింటే ఆరోగ్యానికి పుష్కలమైన ఉపయోగాలు ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
గోంగూరలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. ఇవి నోటికి రుచిని అందించడంతో పాటు శరీరానికి అనేక పోషకాలను అందించి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. గోంగూర ఆకులను తీసుకుని వాటికి కొద్దిగా ఆముదం రాయాలి. ఆ ఆకులను వేడి చేసి వాపు, గడ్డలు, నొప్పులు ఉన్నచోట కట్టులా కట్టాలి. దీంతో నొప్పి, వాపు తగ్గుతుంది.
గోంగూరలో ఎ, బి1, బి2, బి9 విటమిన్లతో పాటు విటమిన్ సి కూడా ఉంటుంది. అంతేకాదు..గోంగూరలో క్యాల్షియం, ఫాస్ఫరస్, పొటాషియం, సోడియం, ఐరన్ వంటి ఇతర ఖనిజాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా యాంటీఆక్సిడెంట్స్ మరెన్నో పోషక పదార్థాలు ఉంటాయి. రేచీకటితో బాధపడేవారు గోంగూరను తింటే మంచి ఫలితం ఉంటుంది. గోంగూర పూలను దంచి అరకప్పు రసం చేసి దాన్ని వడకట్టి దానిలో అరకప్పు పాలు కలిపి ఉదయం, సాయంత్రం రెండుపూటలా తాగితే. కంటికి మంచి జరుగుతుంది.
మిరపకాయలు వేయకుండా ఉప్పులో ఊరవేసిన గోంగూరతో అన్నం తిన్నా కూడా విరేచనాలకు చెక్ పెట్టవచ్చు. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో, జీర్ణ శక్తిని పెంచడంలో గోంగూర ఎంతో సహాయపడుతుంది. రక్త హీనత సమస్యతో బాధపడే వారు గోంగూరను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు. గోంగూర ఆకుల పేస్ట్‌ను తలకు పట్టించి కొంతసేపు అయ్యాక స్నానం చేయాలి. దీనివల్ల జుట్టు రాలడం, చుంద్రు సమస్య తగ్గుతుంది. గోంగూర నుంచి తీసిన జిగురును నీటిలో కలిపి తాగితే విరేచనాలు తగ్గుతాయి.
గోంగూరలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి బాడీలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. దీనివల్ల బరువు కూడా తగ్గే అవకాశం ఉంది. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. గోంగూరలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. మనకు రోజూవారీగా కావాల్సిన విటమిన్ సిలో 53 శాతం గోంగూరలో ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దగ్గు, ఆయాసం, తుమ్ములతో బాధపడేవారికి గోంగూర ఉపశమనం కలిగిస్తుంది. ఈ సమస్యతో బాధపడేవారు గోంగూర తినడం వల్ల ఫలితం ఉంటుంది.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.)