జాబ్ చేస్తే ఈ కంపెనీల్లోనే చేయాలి.. ఉద్యోగులకు దీపావళి గిఫ్ట్ కింద కార్లతో పాటు అపార్ట్‌మెంట్లు

దీపావళి పండుగ సమీపిస్తుండటంతో భారతీయ కంపెనీలు తమ ఉద్యోగులకు ఇచ్చిన బహుమతులు సోషల్ మీడియా, వార్తా మాధ్యమాల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఈ పండుగ సీజన్‌లో ఉద్యోగులకు విలాసవంతమైన గిఫ్ట్‌లు, సెలవులు, ప్రోత్సాహకాలు అందిస్తూ సంస్థలు సంతోషాన్ని పంచుకున్నాయి.


కార్పొరేట్ భారతదేశం ఉద్యోగులతో పండుగను జరుపుకునే తీరును చూస్తుంటే ఇది కేవలం బహుమతుల పండుగ కాదు, కంపెనీలు తమ ఉద్యోగుల కృషికి ఇచ్చే గౌరవం కూడా అని ఇట్టే తెలిసిపోతోంది.

సోషల్ మీడియాలో వైరల్ అయిన గిఫ్ట్‌లలో ముఖ్యంగా నిలిచింది ఇన్ఫో ఎడ్జ్ కంపెనీ పంపిన ఉద్యోగులకు పంపిన బహుమతి ప్యాక్. ఈ సంస్థ తన ఉద్యోగులకు ప్రత్యేకంగా రూపొందించిన దీపావళి సూట్‌కేస్ హ్యాంపర్ ఇచ్చింది. అందులో నాణ్యమైన స్నాక్ బాక్స్, దీపం, చిన్న గిఫ్ట్ ఐటమ్స్ వంటి వాటితో పాటుగా పండుగ వాతావరణాన్ని ప్రతిబింబించే అందమైన ప్యాకేజింగ్ కూడా ఉంది. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, నెట్‌జన్లు ఆ సంస్థను ప్రశంసలతో ముంచెత్తారు. ఉద్యోగుల పట్ల ఇంత ప్రేమ, శ్రద్ధ చూపినందుకు కంపెనీకి బెస్ట్ బాస్ అనే బిరుదు కూడా లభించింది.

ఇక కోహ్లర్ ఇండియా అనే మరో అంతర్జాతీయ కంపెనీ తన ఉద్యోగులకు ఇచ్చిన దీపావళి గిఫ్ట్‌లతో ట్రెండింగ్‌లో నిలిచింది. ఈ సంస్థ పంపిన గిఫ్ట్ బాక్స్‌లో 20 గ్రాముల వెండి బార్, ఎయిర్ ఫ్రయర్, కాఫీ మెషీన్,కాఫీ ప్యాక్‌లు, కాపర్ దీపాలు, హ్యాండ్‌క్రాఫ్ట్ డెకర్ ఐటమ్స్, పండుగకు తగిన మిఠాయిలు ఉన్నాయి. ఈ విలాసవంతమైన హ్యాంపర్‌ను చూసిన నెటిజన్లు ఇది గిఫ్ట్ కాదు, నిజంగా పండుగే అంటూ కామెంట్లు చేశారు. ఉద్యోగులు కూడా తమ కంపెనీ అందించిన గిఫ్ట్‌లను గర్వంగా సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఇక గుజరాత్‌కు చెందిన వ్యాపారవేత్త ఎం.కే. భాటియా తన సంస్థ ఉద్యోగులకు ఇచ్చిన గిఫ్ట్‌తో దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచాడు. ఈయన తన ఉద్యోగులకు 51 లగ్జరీ కార్లు బహుమతిగా ఇచ్చారు. ఉద్యోగుల కష్టాన్ని గుర్తించి, వారి అంకితభావానికి గుర్తింపుగా ఈ కార్లను పంపిణీ చేశామని ఆయన తెలిపారు. ఇది కేవలం గిఫ్ట్ కాకుండా, ఉద్యోగులు తమ సంస్థ పట్ల మరింత నిబద్ధతతో ఉండేందుకు ఒక ప్రోత్సాహక చర్యగా పలువురు భావిస్తున్నారు.

ఇక మరో కంపెనీ ఢిల్లీలోని ఎలైట్ మార్క్ కంపెనీ కూడా ఈ సీజన్‌లో ఉద్యోగులకు సర్‌ప్రైజ్‌గా తొమ్మిది రోజుల దీపావళి సెలవు ప్రకటించింది. అంతేకాకుండా ప్రతి ఉద్యోగికి ఒక ట్రావెల్ సూట్‌కేస్ బహుమతిగా ఇచ్చారు. పండుగను కుటుంబంతో గడపడం కూడా ఒక బహుమతి అనే భావనతో ఈ నిర్ణయం తీసుకున్నామని కంపెనీ తెలిపింది. ఈ చర్య ఉద్యోగులలో ఆనందాన్ని కలిగించడంతో పాటు, ఇతర సంస్థలలో కూడా ఈ విధానంపై చర్చలు మొదలయ్యాయి.

హర్యానాలోని పంచకులలో ఉన్న ప్రముఖ ఔషధ సంస్థ మిట్స్‌కిండ్ హెల్త్‌కేర్ అత్యంత నిబద్ధతతో పనిచేసిన, ఉత్పాదకత చూపిన ఉద్యోగులను ప్రోత్సహించేందుకు ప్రత్యేకమైన బహుమతులు ఇచ్చింది. సంస్థ మొత్తం 15 కార్లు ఉద్యోగులకు అందజేసింది. వాటిలో రెండు మారుతి గ్రాండ్ విటారా మోడల్స్, 13 టాటా పంచ్ వాహనాలు ఉన్నాయి. ఈ బహుమతులు ఉద్యోగులకు పూర్తిగా సర్‌ప్రైజ్‌గా ఇవ్వబడ్డాయి. ఉద్యోగులు కొత్త కార్ల తాళాలు స్వీకరించినప్పుడు ఆనందంతో మునిగిపోయారు. కంపెనీ మేనేజ్‌మెంట్ ఈ కార్యక్రమం ద్వారా ఉద్యోగుల్లో విశ్వాసం, నిబద్ధత మరింత పెరుగుతుందని భావిస్తోంది.

తమిళనాడులోని కోటగిరిలో ఉన్న ఒక ప్రసిద్ధ టీ ఎస్టేట్ తమ కార్మికులకు ఇచ్చిన బహుమతులతో అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ ఎస్టేట్ యజమాని దీపావళి సందర్భంగా దాదాపు 15 మంది ఉద్యోగులకు రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లు బహుమతిగా ఇచ్చారు. ఒక్కో బైక్ విలువ రూ. 2 లక్షలకు పైగా ఉండగా, యజమాని స్వయంగా ఉద్యోగులకు తాళాలు అందజేసి వారిని విహార యాత్రకు తీసుకెళ్లాడు. ఈ చర్య ఉద్యోగుల మనసులు గెలుచుకుంది. పండుగ సంతోషాన్ని పంచుకోవడంలో ఇది నిజమైన ఉదాహరణగా నిలిచింది.

ఉద్యోగులకు బహుమతులు ఇవ్వడంలో సుదీర్ఘ చరిత్ర కలిగిన సూరత్ వజ్రాల వ్యాపారి సావ్జీ ధోలాకియా ఈసారి కూడా తన శైలిలోనే వార్తల్లో నిలిచాడు. ఆయనకు చెందిన హరే కృష్ణ ఎక్స్‌పోర్ట్స్ కంపెనీ తన దీపావళి బోనస్ కార్యక్రమంలో భాగంగా ఉద్యోగులకు 400 అపార్ట్‌మెంట్‌లు బహుమతిగా ఇచ్చింది. ప్రతి ఫ్లాట్ 1,100 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగి ఉండగా, ఉద్యోగులకు చెల్లించదగిన సౌకర్యవంతమైన డౌన్ పేమెంట్‌లను అందించారు.

ఈ ప్రణాళిక ఉద్యోగుల జీవన ప్రమాణాలను పెంచడమే కాకుండా, వారి భవిష్యత్ భద్రతకు కూడా దోహదపడుతుంది.అంతేకాదు, అదే సంస్థ ఉద్యోగుల పనితీరు ఆధారంగా ఒకే సంవత్సరంలో 1,260 ఆటోమొబైల్స్ బహుమతిగా ఇచ్చింది. సావ్జీ ధోలాకియా ఎప్పటిలాగే ఈసారి కూడా తన ఉద్యోగులను కుటుంబసభ్యుల్లా భావిస్తూ పండుగ సీజన్‌ను మరింత ప్రత్యేకంగా మార్చారు.

చెన్నైలోని చల్లాని జ్యువెలరీ కూడా తమ ఉద్యోగులకు అద్భుతమైన గిఫ్ట్‌లను అందించింది. షాప్ ఫ్లోర్ నుండి మేనేజర్ స్థాయివరకు ఉన్న ఉద్యోగులకు సంస్థ 8 కార్లు, 18 బైకులు బహుమతిగా ఇచ్చింది. ఈ బహుమతుల మొత్తం విలువ దాదాపు రూ. 1.2 కోట్లు. యజమాని జయంతిలాల్ చయంతి.. ఈ బహుమతులను ఉద్యోగుల కృషి, నిబద్ధతకు గుర్తింపుగా అందజేశారు. గిఫ్ట్‌లు అందుకున్నప్పుడు కొంతమంది సిబ్బంది కళ్లలో ఆనందభాష్పాలు కదిలాయి.

ఈ అన్ని సంఘటనలన్నీ..భారతీయ కంపెనీలు ఇప్పుడు కేవలం లాభాలు కాదు. మానవ సంబంధాలు కూడా ప్రాధాన్యంగా చూస్తున్నాయని. ఉద్యోగుల సంతోషమే సంస్థ విజయానికి పునాది అని ఈ దీపావళి సందర్భంగా కార్పొరేట్ ఇండియా మరోసారి నిరూపించింది. ఉద్యోగులు కంపెనీకి వెన్నెముక అయితే, ఈ బహుమతులు ఆ వెన్నెముకకు మద్దతుగా నిలుస్తున్నాయి. Diwali పండుగ సీజన్‌లో ఉద్యోగులకు గిఫ్ట్‌లు ఇవ్వడం ఒక కార్పొరేట్ ట్రెండ్‌గా మారినప్పటికీ, ఈ సంవత్సరం అది మరింత భావోద్వేగపూరితంగా, మానవతా దృక్కోణంలో వెలుగొందిందని చెప్పవచ్చు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.