ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌లో జరిగిన కరెన్సీ ఫెస్టివల్ చూపరులను ఆకట్టుకుంది. ఈ ఫెస్టివల్లో మొఘలులు, గుప్తులు, బ్రిటిష్ కాలం నాటి కరెన్సీ నాణెలు, నోట్లు ప్రదర్శించారు. దేశంలోని పది రాష్ట్రాలల్లోని 50 నగరాల నుంచి వ్యాపారులు, పురాతన కరెన్సీపై ఆసక్తి ఉన్నవారు ఈ ఫెస్టివల్ కు వచ్చారు. పురాతన కాయిన్స్, నోట్లను కొందరు విక్రయించగా, తమకు నచ్చిన వాటిని ఇంకొందరు కొనుగోలు చేశారు.
చరిత్రకు రుజువులు!
నాణేలు చరిత్రకు సజీవ రుజువులు అని చెబుతారు చరిత్రకారులు. అది నిజమేనని మేరఠ్ కరెన్సీ ఫెస్టివల్ నిరూపించింది. చరిత్ర, రాజకీయ పరిస్థితి, భౌగోళిక పరిస్థితి, వాణిజ్యం అలాగే జీవనశైలి, ఓ పాలకుడు ఎంతకాలం పరిపాలించాడనే దాని గురించి నాణేలు మనకు ప్రతిదీ తెలియజేస్తాయి. కాలక్రమేణా జరిగిన మార్పుల కారణంగా కొన్ని కరెన్సీ నాణెలు, నోట్లు చలామణిలో లేవు.మేరఠ్ కరెన్సీ ఫెస్టివల్ లో 25 పైసల నాణెం రూ. 8 వేలు పలుకుతోంది. చలామణిలో లేని కరెన్సీ నోట్లు, కాయిన్లు కూడా చాలా విలువైనవిగా మారిపోయాయి. ఆంగ్లేయులు, మెుఘలుల కాలం నాటి రూ.2 నాణెం మూడు లక్షల రూపాయిల ధర పలుకుతోంది. 50 ఏళ్ల క్రితం వెయ్యి రూపాయల నోటు ధర రూ.40 వేలు. 108 ఏళ్ల నాటి రూపాయి నోటు ధర రూ.10,000-రూ.12,000 వరకు ఉంది. మొఘల్ కాలంనాటి రూపాయి నోటు ధర రూ.20,000 పలుకుతోంది.బ్రిటిష్ కాలం నాటి కరెన్సీకి ఫుల్ డిమాండ్
ఆంగ్లేయుల కాలం నాటి రూపాయి నోటు విలువ రూ.30,000- రూ.35,000. 5 రూపాయల నోటును కూడా రూ. 75,000 కు కొనుగోలు చేస్తున్నారు. ఈ కరెన్సీ ఫెస్టివల్ లో రూ. 125, రూ. 225, రూ. 350, రూ. 400 స్మారక నాణేలు కూడా పుష్కలంగా ఉన్నాయి. కాగా, మేరఠ్ లో ఇలాంటి కార్యక్రమాన్ని తొలిసారిగా నిర్వహిస్తున్నట్లు కరెన్సీ ఫెస్టివల్ నిర్వాహకుడు మనోజ్ జైన్ చెప్పారు.’ఇరవై ఏళ్లుగా కరెన్సీ నోట్లు కొంటున్నా, అమ్ముతున్నా’
గుజరాత్ లోని అహ్మదాబాద్ నుంచి వచ్చిన సునీల్ వాస్వానీ 1917 నాటి ఒక రూపాయి నోటును కరెన్సీ ఫెస్టివల్‌కు తీసుకొచ్చాడు. తాను గత ఇరవై ఏళ్లుగా అలాంటి నోట్లను కొని అమ్ముతున్నానని పేర్కొన్నాడు. 108 ఏళ్ల క్రితం నాటి రూపాయి నోటు విలువ ప్రస్తుతం రూ.10,000-రూ.12,000 అని వరకు ఉంటుందన్నాడు.
‘చలామణిలోని లేని కరెన్సీకి భారీ డిమాండ్’
తన దగ్గర చాలా రకాల పురాతన నాణేలు ఉన్నాయని లఖ్‌నవూకు చెందిన మహమ్మద్ సలావుద్దీన్ చెబుతున్నాడు. 1982 ఆసియా క్రీడలకు గుర్తుగా విడుదల చేసిన 25 పైసల స్మారక నాణెం ప్రజలను బాగా ఆకర్షించిందని తెలిపాడు. ఈ కాయిన్ విలువ ప్రస్తుతం రూ.8,000- రూ.10,000 అని చెప్పాడు. చలామణిలో లేని నోట్లు భారీ ధర పలుకుతున్నాయని వెల్లడించాడు. చలామణీలో ఉన్న 25 పైసల నాణేలు దాదాపు రూ.2వేలు పలుకుతున్నాయన్నాడు.తన దగ్గర మొఘలుల కాలం నుంచి ఇప్పటివరకు అనేక రకాల నాణేలు ఉన్నాయని హరియాణాకు చెందిన అశ్వనీ కుమార్ చెబుతున్నాడు. మెఘల రాజైన అక్బర్ కాలంలో ఈ నాణేలను దామ్ అని పిలిచేవారన్నాడు. నేడు ఈ దామ్ నాణెం విలువ ఒక పైసాకు సమానమని చెప్పాడు. దీని విలువ రూ. 800- రూ.1000 వరకు ఉందని వెల్లడించాడు.
































