గట్టిగా కొడితేనే.. గట్టెక్కేది! టీమ్‌ఇండియాకు కఠిన సవాల్‌

డిఫెండింగ్‌ ఛాంపియన్‌. ఫేవరెట్‌గా టోర్నీలో అడుగుపెట్టింది. ఆశించినంత ఆధిపత్యాన్ని ప్రదర్శించలేకపోయినా గ్రూప్‌ దశలో అగ్రస్థానం సాధించింది. కానీ సూపర్‌ 8లో ఓ భారీ ఓటమి ఆ జట్టును త్వరగా ప్రపంచకప్‌ నుంచి నిష్క్రమించే ప్రమాదంలోకి నెట్టింది. బ్యాటర్ల అస్థిర ప్రదర్శన, ముఖ్యంగా టాప్‌ ఆర్డర్‌ పేలవ ఫామ్‌ టీమ్‌ఇండియాకు పెద్ద సమస్య. ఇలాంటి పరిస్థితుల్లో అత్యంత కీలక పోరాటానికి సిద్ధమైంది భారత్‌. చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో నేడు జింబాబ్వేను ఢీకొంటుంది. ఓడితే ఇంటికే! సెమీస్‌ ఆశలు సజీవంగా ఉండాలంటే  గెలిస్తేనే సరిపోదు.. చాలా ఘనంగా నెగ్గాలి. నెట్‌ రన్‌రేట్‌లో బాగా వెనుకబడ్డ టీమ్‌ఇండియా.. శక్తులన్నింటినీ కూడదీసుకుని అసాధారణ ప్రదర్శనే చేయాలి. 


చెన్నై

టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియాకు పరీక్షా సమయం. భారత్‌ తన రెండో సూపర్‌ 8 మ్యాచ్‌లో గురువారం జింబాబ్వేను ఢీకొంటుంది. జింబాబ్వేపై గెలవడం కష్టమేమీ కాకపోవచ్చు. కానీ తొలి మ్యాచ్‌లో 76 పరుగుల తేడాతో భారీ పరాజయంతో నెట్‌ రన్‌రేట్‌ (-3.80) తీవ్రంగా దెబ్బతిన్న నేపథ్యంలో భారీ విజయం సాధించడమే సవాల్‌. ఈ మ్యాచ్‌లోనే కాదు.. సెమీఫైనల్‌ రేసులో ఉండాలంటే తన చివరి సూపర్‌ 8 (వెస్టిండీస్‌తో) పోరులోనూ టీమ్‌ఇండియా మంచి విజయం సాధించాల్సి రావొచ్చు. చెరో మ్యాచ్‌లో నెగ్గిన దక్షిణాఫ్రికా (3.800), వెస్టిండీస్‌ (5.350) గ్రూప్‌-1లో రన్‌రేట్‌లో చాలా ముందున్నాయి. ఈ నేపథ్యంలో గ్రూప్‌లో టాప్‌-2లో నిలవాలంటే భారత జట్టు అద్భుతంగా ఆడాల్సిందే.

అభిషేక్‌ పుంజుకునేనా?

టోర్నీలో టీమ్‌ఇండియా ప్రస్తుత సంకట స్థితికి ప్రధాన కారణం బ్యాటింగే అనడంలో సందేహం లేదు. మెరుపులు మెరిపించకపోయినా ఏదోలా గ్రూపు దశలో అగ్రస్థానంలో నిలిచిన ఆ జట్టు సూపర్‌ 8 తొలి మ్యాచ్‌లో బొక్క బోర్లా పడింది. ఈ సమస్యను పరిష్కరించుకోవడం భారత్‌కు అత్యవసరం. దక్షిణాఫ్రికాపై చాలా మంది బ్యాటర్లు పరిస్థితులకు తమను తాము అన్వయించుకోకుండా, పేలవ షాట్లతో వికెట్లు పారేసుకున్నారు. ముఖ్యంగా టాప్‌ ఆర్డర్‌లో అభిషేక్‌ శర్మ వైఫల్యం జట్టును దెబ్బతీస్తోంది. ఈ టోర్నీలో ఇప్పటివరకు ఈ ఓపెనర్‌ నాలుగు మ్యాచ్‌ల్లో 3.75 సగటుతో కేవలం 15 పరుగులు చేశాడు. అందులో మూడు డకౌట్లు. అతడు తనదైన శైలిలో ఆరంభాలు ఇచ్చి ఉంటే టోర్నీలో భారత్‌ పరిస్థితి భిన్నంగా ఉండేదే. ఇప్పటికైనా అభిషేక్‌ పుంజుకోవడం ఆతిథ్య జట్టుకు చాలా కీలకం. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అతడు తన సహజ శైలిలో ఆడతాడా లేదా నియంత్రణ పాటిస్తాడా అన్నది ఆసక్తికరం. కొన్ని మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడిన మరో ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్‌ కూడా గత రెండు మ్యాచ్‌ల్లో రాణించలేపోయాడు. అతడు తిరిగి జోరందుకోవాలని జట్టు కోరుకుంటోంది. అభిషేక్, ఇషాన్‌ బ్యాట్లకు పనిచెబితే భారత్‌ పని సగం పూర్తయినట్లే. సూర్యకుమార్‌ 180 పరుగులు చేశాడు కానీ స్ట్రైక్‌రేట్‌ 127 మాత్రమే. తిలక్‌ వర్మ కూడా అంతే. వేగంగా బ్యాటింగ్‌ చేయలేకపోతున్నాడు. స్ట్రైక్‌రేట్‌ 118 మాత్రమే. శివమ్‌ దూబె, హార్దిక్‌ పాండ్య జోరు పెంచకపోయుంటే టోర్నీలో ఓ మాదిరి స్కోర్లు చేయడానికి కూడా టీమ్‌ఇండియా ఇబ్బందిపడేది. బ్యాటర్లంతా సమష్టిగా రాణించాల్సివుంది. ముఖ్యంగా స్పిన్నర్లను సమర్థంగా ఎదుర్కోవాలి.

జట్టులో శాంసన్, అక్షర్‌!

తండ్రి అనారోగ్యం కారణంగా ఇంటికి వెళ్లిన రింకు సింగ్‌.. తిరిగి జట్టుతో చేరాడు. కానీ ఈ మ్యాచ్‌కు అతడికి తుది జట్టులో స్థానం దక్కడం అనుమానమే. సంజు శాంసన్‌ ఆడడం ఖాయంగా కనిపిస్తోంది. అతణ్ని అభిషేక్‌కు జోడీగా ఓపెనింగ్‌కు పంపే అవకాశముంది. ఇషాన్‌ మూడో స్థానంలో దిగుతాడు. టోర్నీలో ప్రత్యర్థి జట్లు తెలివిగా.. పవర్‌ప్లేల్లో ఎడమచేతి వాటం బ్యాటర్లు ఇషాన్, అభిషేక్, తిలక్‌లకు ఆఫ్‌స్పిన్నర్లతో బౌలింగ్‌ చేయించడం ద్వారా వాళ్ల స్కోరింగ్‌ అవకాశాలను తగ్గించాయి. కుడిచేతి వాటం బ్యాటరైన శాంసన్‌ను తీసుకోవడం ద్వారా సమస్యను అధిగమించవచ్చని భారత జట్టు మేనేజ్‌మెంట్‌ భావిస్తోంది. మరోవైపు వాషింగ్టన్‌ సుందర్‌ స్థానంలో అక్షర్‌ పటేల్‌ రావడం కూడా ఖాయమే. ఇక బౌలింగ్‌లో బుమ్రా సూపర్‌ ఫామ్‌ భారత్‌కు గొప్ప సానుకూలాంశం. అతడితోపాటు అర్ష్‌దీప్, హార్దిక్, అర్ష్‌దీప్, వరుణ్‌ చక్రవర్తి, అక్షర్‌లతో కూడిన భారత బౌలింగ్‌ దాడిని తట్టుకుని నిలవడం జింబాబ్వేకు పెద్ద సవాలే.

వాళ్లను తేలికగా తీసుకోవద్దు

తన తొలి సూపర్‌-8 మ్యాచ్‌లో వెస్టిండీస్‌ చేతిలో చిత్తయినప్పటికీ జింబాబ్వేను తక్కువ అంచనా వేయడం పొరపాటే అవుతుంది. ఆ జట్టు ఆస్ట్రేలియా, శ్రీలంకలకు షాకిచ్చి గ్రూప్‌ దశలో అజేయంగా నిలిచింది. ఆ జట్టుకు కోల్పోయేదేమీ లేదు కాబట్టి.. స్వేచ్ఛగా ఆడుతుంది. బ్యాటింగ్‌లో బెనెట్, కెప్టెన్‌ సికందర్‌ రజా, మరుమాని.. బౌలింగ్‌లో ముజరబాని, ఎవాన్స్‌లు జింబాబ్వేకు కీలకం.

పిచ్‌ ఎలా ఉందంటే..

మ్యాచ్‌ వేదిక చెపాక్‌ సాధారణంగా స్పిన్నర్లకు అనుకూలిస్తుంది. కానీ ఈ ప్రపంచకప్‌లో మాత్రం అదే అత్యుత్తమ బ్యాటింగ్‌ మైదానం. స్పిన్నర్లకు పెద్దగా కలిసి రాలేదు. పేసర్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. వికెట్లు తీయడానికి, పరుగుల ప్రవాహానికి అడ్డుకట్ట వేయడానికి చాలా కష్టపడ్డారు. ఇక్కడ అఫ్గానిస్థాన్‌పై 183 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్‌ కేవలం 17.5 ఓవర్లలో ఛేదించింది. ఈ మ్యాచ్‌లో కూడా పిచ్‌ బ్యాటర్లకు సహకరించే అవకాశముంది. మ్యాచ్‌కు ఎలాంటి వర్షం ముప్పు లేదు.

తుది జట్లు (అంచనా)

భారత్‌: అభిషేక్‌ శర్మ, సంజు శాంసన్, ఇషాన్‌ కిషన్, సూర్యకుమార్, తిలక్‌ వర్మ, దూబె, హార్దిక్, అక్షర్‌ పటేల్, అర్ష్‌దీప్, వరుణ్‌ చక్రవర్తి, బుమ్రా.

జింబాబ్వే: మరుమాని, బెనెట్, మయర్స్, ర్యాన్‌ బర్ల్, సికందర్‌ రజా, మున్యోంగా, ముసెకివా, ఎవాన్స్, క్రీమర్, ముజరబాని, ఎంగరవ.

1

టీ20 ప్రపంచకప్పుల్లో భారత్, జింబాబ్వే ఇంతకుముందు ఒకే ఒక్కసారి తలపడ్డాయి. 2022లో ఎంసీజీలో జరిగిన ఆ మ్యాచ్‌లో భారత్‌ 71 పరుగుల తేడాతో గెలిచింది. భారత్‌లో టీమ్‌ఇండియాతో టీ20 మ్యాచ్‌ ఆడడం జింబాబ్వేకు ఇదే తొలిసారి.

 

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.