శీతాకాలంలో ఎండు ఖర్జూరం తినొచ్చా.? లేదా.? ఇది అందరిలోనూ ఉండే ప్రశ్న. ఈ వింటర్ సీజన్‌లో ఎండు ఖర్జూరం తీసుకోవడం వల్ల శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని వైద్యులు చెబుతున్నారు.
ఎండు ఖర్జూరం ఎముకలను బలంగా మార్చడంతో పాటు జీర్ణక్రియను మెరుగుపరిచడంలో సహాయపడుతుంది. డ్రై ఫ్రూట్స్‌లో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా చలికాలంలో కొన్ని ప్రత్యేకమైన డ్రై ఫ్రూట్స్ తీసుకుంటే శరీరానికి మరింత శక్తి, రోగనిరోధక శక్తి లభిస్తాయి. అలాంటి వాటిలో ఎండు ఖర్జూరం ఒకటి. ఎండు ఖర్జూరంలో ఫైబర్, పొటాషియం, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, విటమిన్ బి లాంటి కీలక పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరాన్ని అనేక రకాల వ్యాధుల నుంచి రక్షించడంలో సహాయపడతాయి.
ముఖ్యంగా చలికాలంలో వచ్చే ఎముకల నొప్పులు, జీర్ణ సమస్యలు, అలసట లాంటి సమస్యలకు ఎండు ఖర్జూరం మంచి ఔషధంలా పనిచేస్తుంది. చలికాలంలో చాలామందికి నడుము నొప్పి, కీళ్ల నొప్పులు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇలాంటి సమస్యల నుంచి ఉపశమనం పొందేందుకు ఎండు ఖర్జూరం చాలా ఉపయోగపడుతుంది. రాత్రి ఒక గ్లాసు నీటిలో రెండు ఎండు ఖర్జూరాలు, ఒక చెంచా మెంతులు నానబెట్టి ఉంచి.. ఉదయం లేచిన వెంటనే ఖర్జూరాలను నమిలి తిని, ఆ నీటిని వడగట్టి తాగాలి. ఇలా కొన్ని రోజుల పాటు చేస్తే శరీరంలోని నొప్పులన్నీ క్రమంగా తగ్గుతాయి.
ఎప్పుడూ అలసటగా ఉండటం, శరీరంలో శక్తి లేకపోవడం లాంటి సమస్యలు ఉంటే ఎండు ఖర్జూరం మంచి పరిష్కారం. రాత్రి పూట లేదా ఉదయం ఎండు ఖర్జూరం తినడం వల్ల శరీరానికి ఎనర్జీ వస్తుంది. అలాగే ఐరన్ అధికంగా ఉండటం వల్ల రక్తహీనత సమస్య ఉన్నవారికి ఇది ఎంతగానో ఉపయోగకరం. ఇది శరీరంలో హిమోగ్లోబిన్ ఉత్పత్తికి సహాయపడి, రక్తహీనత లక్షణాలైన అలసటను తగ్గిస్తుంది. చలికాలంలో ఛాతిలో కఫం చేరడం, దగ్గు, జలుబు లాంటి శ్వాస సంబంధిత సమస్యలు సర్వసాధారణం. రెండు ఎండు ఖర్జూరాలను బాగా నమిలి తిని, తర్వాత కొద్దిగా గోరువెచ్చని నీరు తాగితే కఫం కరిగి బయటకు రావడంలో సహాయపడుతుంది. తద్వారా శ్వాస సంబంధిత సమస్యలు తగ్గుతాయి.
ఎండు ఖర్జూరంలో ఫైబర్, మెగ్నీషియం అధికంగా ఉండటం వల్ల జీర్ణ వ్యవస్థ బలపడుతుంది. ఇది మలబద్ధకం, గ్యాస్, ఎసిడిటీ లాంటి సమస్యల నుంచి ఉపశమనం అందిస్తుంది. క్రమం తప్పకుండా ఎండు ఖర్జూరం తీసుకోవడం వల్ల పేగులు ఆరోగ్యంగా పనిచేస్తాయి. హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో కూడా ఎండు ఖర్జూరం కీలకపాత్ర పోషిస్తుంది. ఇది రక్త ప్రసరణను మెరుగుపరిచి గుండె పనితీరును బలోపేతం చేస్తుంది. అలాగే, రోగనిరోధక శక్తిని పెంచే యాంటీ ఆక్సిడెంట్లు ఇందులో సమృద్ధిగా ఉంటాయి. వీటి వల్ల జలుబు, దగ్గు వంటి సీజనల్ వ్యాధుల నుంచి శరీరం రక్షణ పొందుతుంది. చలికాలంలో ఎండు ఖర్జూరం తీసుకోవడం శరీరానికి చాలా మంచిది. రోజు పరిమిత మోతాదులో తీసుకుంటే శక్తి, ఆరోగ్యం రెండు మెరుగవుతాయి. అయితే, మధుమేహం ఉన్నవారు మాత్రం వైద్యుల సలహాతో మాత్రమే తీసుకోవడం మంచిది.



































