వెండి వస్తువులు కొత్త వాటిలా మెరవాలంటే.

వర్షాకాలంలో వెండి వస్తువులు నల్లగా మారే అవకాశాలు ఎక్కువ. ఇందుకు కారణం గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉండటమే. ఇలా గాల్లోని తేమతో జరిగే రసాయనిక చర్య వల్ల వెండి నల్లగా మారిపోతుంది. ఫలితంగా అది మెరుపుని కోల్పోతుంది. అందుకే వెండి వస్తువులను వీలైనంత వరకూ గాలి, తేమ తగలని ప్రదేశంలో భద్రపరచాలంటారు. అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఒక్కోసారి ఇవి నల్లగా మారి మెరుపును కోల్పోతుంటాయి. ఇలాంటప్పుడు కొన్ని ఇంటి చిట్కాలతో తిరిగి వాటిని మెరిపించచ్చంటున్నారు నిపుణులు.


వేడి నీళ్లతో…

వెండి నగలు, వస్తువులపై బాగా మురికి పేరుకుపోయినప్పుడు వేడి నీళ్లతో దాన్ని సులభంగా శుభ్రం చేయచ్చు. ఇందుకోసం రెండు కప్పుల వేడి నీళ్లలో కొద్దిగా డిటర్జెంట్‌ పౌడర్‌ని కలపాలి. ఆ తర్వాత శుభ్రం చేయాలనుకుంటున్న వెండి వస్తువుల్ని అందులో కాసేపు ఉంచాలి. అనంతరం బయటకు తీసి, మెత్తని బ్రష్‌తో సున్నితంగా రుద్దాలి. ఆ తర్వాత పొడిగా ఉన్న మెత్తని వస్త్రంతో తుడిచేస్తే ఫలితం ఉంటుంది.

ఉప్పు నీళ్లతో…

కాస్త నల్లగా మారిన వెండి వస్తువుల్ని ఉప్పు నీళ్లతో సులభంగా శుభ్రం చేసుకోవచ్చు. కొన్ని నీళ్లు తీసుకొని అందులో కొద్దిగా ఉప్పు కలపాలి. దానిలో నల్లగా మారిన వెండి వస్తువుల్ని కాసేపు ఉంచాలి. ఆ తర్వాత మెత్తటి బ్రష్‌తో రుద్దితే నలుపు పూర్తిగా వదిలిపోయి పూర్వపు మెరుపును సంతరించుకుంటాయి.

టూత్‌పేస్ట్‌తో…

టూత్‌పేస్ట్‌లో ఉండే క్యాల్షియం వెండి వస్తువులను ధగధగలాడేలా చేస్తుంది. ఈ క్రమంలో కొద్దిగా పేస్ట్‌ని తీసుకుని దాన్ని వెండి వస్తువుకు పల్చని పొరలా పూయాలి. టూత్‌పేస్ట్‌ పూర్తిగా ఆరిపోయే దాకా ఆగాలి. ఆ తర్వాత టిష్యూ పేపర్‌తో తుడిచి నీటితో శుభ్రం చేసేయాలి. ఇలా చేస్తే వాటి మెరుపు తిరిగొస్తుంది. ఇంకా వెండి వస్తువుల నలుపు పూర్తిగా వదలకపోతే ఇదే పద్ధతిని మరోసారి ఫాలో అయితే సరి అంటున్నారు నిపుణులు!

బేకింగ్‌ సోడాతో..

బేకింగ్‌ సోడా కూడా వెండి వస్తువుల మెరుపును తిరిగి తీసుకొస్తుంది. దీనికోసం బేకింగ్‌ సోడాలో కొన్ని నీళ్లు కలిపి పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. మెత్తని బ్రష్‌తో ఈ మిశ్రమాన్ని తీసుకుని వెండి వస్తువులను మృదువుగా రుద్దాలి. ఆ తర్వాత వేడి నీటితో కడిగేయాలి. ఇలా చేస్తే వెండి వస్తువులు కొత్త వాటిలా మెరిసిపోతాయి.

 

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.