చాణక్యుడు గొప్ప తాత్వివేత్త, ఆర్థిక శాస్త్రవేత్త, రాజనీతిజ్ఞుడు. చాణక్య నీతి పేరుతో ఆయన ఎన్నో విషయాలు చెప్పారు. రాజకీయాలు, ఆర్థికం, మన రోజువారీ జీవితం ఇలా అన్నింటికీ ఉపయోగపడే బోధనలు అందులో ఉన్నాయి.
అందుకే చాలామంది తమ లైఫ్ బాగు చేసుకోవడానికి, సమస్యల్ని అధిగమించడానికి చాణక్య నీతిని ఫాలో అవుతారు. మన చుట్టూ ఉన్న మనుషుల నైజం తెలుసుకోవాలని, లేకపోతే కష్టాలు తప్పవని చాణక్య నీతి సూత్రాలు చెబుతున్నాయి. కొంతమంది వ్యక్తులు శత్రువులకన్నా, పాములకన్నా డేంజర్‌గా ఉంటారట. వీరితో జాగ్రత్తగా ఉంటేనే జీవితంలో ప్రశాంతంగా ఉండగలమని చాణక్యుడు చెప్పాడు. వాళ్లెవరో చూద్దాం.
* కామం, కోపం, అత్యాశ ఉన్నవారు
కామం, కోపం, అత్యాశతో కళ్లు మూసుకుపోయిన వాళ్లకు మంచి చెడులు తెలియవని చాణక్యుడు తన నీతి శాస్త్రంలో చెప్పాడు. వాళ్ల కోరికలు తీర్చుకోవడం తప్ప ఇంకేం పట్టించుకోరు, ఎదుటివారికి హాని చేయడానికైనా వెనకాడరు. అలాంటి వాళ్లను అస్సలు నమ్మకూడదు, వీరికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.
* స్వార్థపరులు
స్వార్థపరుల్ని అస్సలు నమ్మొద్దని చాణక్యుడు సూచించాడు. వీళ్లు ఎప్పుడూ తమ గురించే ఆలోచిస్తారు, ఎప్పుడైనా మోసం చేస్తారు. శత్రువు ఎదురుగా దాడి చేస్తాడు కానీ, స్వార్థపరులు వెన్నుపోటు పొడుస్తారు. స్నేహితుల్లా నటిస్తారు కానీ, తమ స్వార్థం గురించే పట్టించుకుంటారు. కష్టాల్లో ఉన్నప్పుడు వీరిని నమ్ముకుంటే కుక్కతోక పట్టుకొని గోదారి ఈదినట్లే.
* దురాశ, అసూయ ఉన్నవాళ్లు
దురాశ ఉన్నవాళ్లు తమ స్వార్థం కోసం ఎవరికైనా హాని చేస్తారు. అసూయపరులు ఎదుటివాళ్లు బాగుండటం చూడలేరు. వారి ఎదుగుదల చూసి తట్టుకోలేక సమస్యలు సృష్టిస్తారు. వీరికి మంచి చెడులు, న్యాయం ధర్మం లాంటివేమీ ఉండవు. కష్టాల్లో ఉన్నప్పుడు సాయం కోరితే సపోర్ట్ చేయకపోగా, మోసం చేస్తారు.
* అతిగా పొగిడేవాళ్లు
మనల్ని అతిగా పొగిడే వాళ్లకు దూరంగా ఉండమని చాణక్య నీతి హెచ్చరిస్తోంది. ఇలాంటి వాళ్లు ఎప్పుడూ తమ స్వార్థం గురించే ఆలోచిస్తారు. మన ముందే పొగిడేవాడు, వెనుక గోతులు తీసే ప్రమాదం ఉంది. అందుకే అలాంటి వారిని అస్సలు నమ్మకూడదు.
* కోపిష్టులు
కోపం మనిషికి శత్రువు అంటాడు చాణక్యుడు. కోపం వచ్చినప్పుడు మనిషికి బుద్ధి పనిచేయదు. కోపంలో ఏం చేస్తారో వాళ్లకే తెలియదు, దానివల్ల వాళ్లకే కాదు.. ఇతరులకు కూడా నష్టం జరుగుతుంది. వీరు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో చెప్పలేం, అందుకే తెలిసిన శత్రువులకన్నా వీళ్లే ప్రమాదకరం. ఇలాంటి వారితో తిరిగితే మీ జీవితంలో అనవసరంగా గొడవలు వస్తాయి.
* రహస్యాలు దాచుకోలేని వాళ్లు
కొంతమంది ఏ విషయాన్నీ సీక్రెట్‌గా ఉంచలేరు. వారికి ఏది చెప్పినా వెంటనే ఊరంతా తెలిసిపోతుంది. చాణక్యుడు ఇలాంటి వ్యక్తుల జోలికి కూడా పోవద్దంటాడు. ఎందుకంటే, మీ వ్యక్తిగత విషయాలు, బలహీనతలు వీరి ద్వారా అందరికీ తెలిసిపోయే ప్రమాదం ఉంది. శత్రువులు దీన్ని అడ్వాంటేజ్‌గా తీసుకునే ఛాన్స్ ఉంది.
* చెడు స్నేహితులు
స్నేహితులు మంచివారైతే, లైఫ్‌లో సగం టెన్షన్ తగ్గిపోతుంది. కానీ బ్యాడ్ ఫ్రెండ్స్ ఉంటే మాత్రం జీవితం నరకమే అంటాడు చాణక్యుడు. చెడు స్నేహితులు తప్పుదోవ పట్టించగలరు, చెడు వ్యసనాలకు బానిసల్ని చేయగలరు, మీ పరువు తీసే పనులు కూడా చేయొచ్చు. వారితో తిరిగితే భవిష్యత్తు నాశనం అవుతుంది.




































