IMA సంచలన ప్రకటన.. రేపు దేశవ్యాప్తంగా వైద్య సేవలు బంద్‌.. కారణమిదే

www.mannamweb.com


ఇండియన్​ మెడికల్​ అసోసియేషన్​ (ఐఎంఏ) సంచలన ప్రకటన చేసింది. దేశవ్యాప్తంగా 24 గంటల పాటు వైద్య సేవలను బంద్‌ చేస్తున్నట్లు పిలుపునిచ్చింది. ఆగస్ట్​ 17న ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని తెలిపింది. సుమారు 24 గంటల పాటు వైద్య సేవలను నిలిపివేస్తున్నట్టు ఐఎంఏ పేర్కొంది. అయితే ఐఎంఏ ఇంతటి కఠిన నిర్ణయం ఎందుకు తీసుకుంది.. కారణాలు ఏంటి అంటే.. కోల్​కతా వైద్యురాలి మృతికి నిరసనగా దేశవ్యాప్తంగా వైద్య సేవలను నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. ఆగస్టు 9న కోల్​కతా ఆర్​జీ కర్ మెడికల్ కాలేజీలో డ్యూటీ డాక్టర్​ అత్యాచారం, హత్య ఈ నిర్ణయానికి కారణమని పేర్కొంది. ఇందుకు నిరసనగా ఇలాంటి నిర్ణయం తీసుకున్నామని ఐఎంఏ చెప్పుకొచ్చింది.

ఈ మేరకు ఐఎంఏ ప్రకటన జారీ చసింది. “వైద్యురాలిపై హత్యాచారం ఘటన వైద్య వర్గాలతో పాటు దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. అప్పటి నుంచి రెసిడెంట్ డాక్టర్లు సమ్మె చేస్తున్నారు. ఐఎంఏ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిరసనలు, కొవ్వొత్తుల ర్యాలీలు జరుగుతున్నాయి” అని ప్రకటనలో ఉంది. అంతేకాక ఈ ఘటనకు నిరసనగా.. ఆగస్టు 17 (శనివారం) ఉదయం 6 గంటల నుంచి ఆగస్టు 18 (ఆదివారం) ఉదయం 6 గంటల వరకు 24 గంటల పాటు మోడ్రన్ మెడిసిన్ వైద్యుల సేవలను నిలిపివేస్తున్నట్లు ఐఎంఏ ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది.

అయితే నిత్యావసర వైద్య సేవలన్నీ యథావిధిగా కొనసాగుతాయని, క్షతగాత్రులకు చికిత్స జరుగుతుందని ఐఎంఏ తెలిపింది. కానీ సాధారణ ఓపీడీలు పనిచేయవని, ఎలక్టివ్ సర్జరీలు నిర్వహించబోమని ఐఎంఏ తెలిపింది. మోడర్న్​ మెడిసిన్​ డాక్టర్లు సేవలందించే అన్ని రంగాల్లో సేవలను నిలిపివేస్తామని.. వైద్యుల న్యాయమైన కారణంతో చేస్తున్న నిరసనలకు దేశ ప్రజల మద్దతు అవసరం అని ఈ సందర్భంగా ఐఎంఏ ప్రకటించింది.
అసలేం జరిగింది..

కోల్​కతాలో వైద్యురాలిపై నిర్వహించిన దారుణ హత్యాచార ఘటన దేశాన్ని కుదిపేసింది. ఈ కేసు విషయంపై కళాశాల అధికారుల నిర్లక్ష్యం, మొదటి రోజు తరువాత పోలీసు దర్యాప్తులు నిలిచిపోవడం వంటివి నిరసనలకు కారణాలుగా మారాయి. దాంతో కోల్​కతా హైకోర్టు ఈ కేసును సీబీఐకి అప్పగించింది. రాష్ట్ర పోలీసులు తమ దర్యాప్తును కొనసాగిస్తే సాక్ష్యాలు నాశనం అయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమైంది. ఆగస్టు 15, 2024 న, కొందరు ఆందోళనకారులు ఆస్పత్రి వద్దకు వచ్చి.. నిరసన వ్యక్తం చేసే క్రమంలో ఆస్పత్రి ప్రాంగణాన్ని నాశనం చేశారు. అంతేకాక నిరసన తెలుపుతున్న వైద్య విద్యార్థులపై కూడా దాడి జరిగింది. టీఎంసీ కావాలనే ఇలాంటి దాడులు చేయించిందని.. సాక్ష్యాలను నాశనం చేయడానికే ఇలాంటి చర్యలకు పాల్పడిందని బీజేపీ విమర్శలు చేసింది.