భారతీయ తీర రక్షక దళం అసిస్టెంట్ కమాండెంట్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. గ్రాడ్యుయేట్లు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్టులతో నియామకాలుంటాయి. ఎంపికైనవాళ్లు గ్రూప్-ఎ గెజిటెడ్ ఆఫీసర్ హోదా పొందవచ్చు. ఆకర్షణీయ వేతనం, ప్రోత్సాహకాలూ అందుకోవచ్చు.
ఈ పోస్టులకు మహిళలూ అర్హులే. దాదాపు ఏటా ఈ ప్రకటన వెలువడుతుంది. ఆసక్తి ఉన్నవారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. అర్హులకు ఆప్టిట్యూడ్ టెస్టు ఆబ్జెక్టివ్ తరహాలో ఆంగ్ల మాధ్యమంలో నిర్వహిస్తారు. ప్రశ్నపత్రానికి 400 మార్కులు. ప్రతి ప్రశ్నకు 4 మార్కులు చొప్పున మొత్తం వంద ప్రశ్నలు వస్తాయి. తప్పు సమాధానానికి ఒక మార్కు తగ్గిస్తారు. ఇంగ్లిష్, రీజనింగ్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ, జనరల్ సైన్స్ అండ్ మ్యాథమెటికల్ ఆప్టిట్యూడ్, జనరల్ నాలెడ్జ్ ఒక్కో విభాగంలోనూ 25 ప్రశ్నలు వస్తాయి. పరీక్ష వ్యవధి 2 గంటలు. ఇందులో అర్హత సాధించినవారికి స్టేజ్-2 పరీక్షలు నిర్వహిస్తారు. దానిలో భాగంగా కంప్యూటరైజ్డ్ కాగ్నిటివ్ బ్యాటరీ టెస్టు (సీసీబీటీ), పిక్చర్ పర్సెప్షన్ అండ్ డిస్కషన్ టెస్టు (పీపీఅండ్‌డీటీ) ఉంటాయి. సీసీబీటీ ఆంగ్ల మాధ్యమంలో, ఆబ్జెక్టివ్ తరహాలో నిర్వహిస్తారు. పీపీ అండ్ డీటీ కోసం ఆంగ్లం/ హిందీలో మాట్లాడాలి. స్టేజ్-2 అర్హత పరీక్ష మాత్రమే. ఇందులో ఎంపికైనవారికి స్టేజ్-3 నిర్వహిస్తారు. అందులో భాగంగా.. సైకలాజికల్ పరీక్షలు, గ్రూప్ టాస్క్, ఇంటర్వ్యూ ఉంటాయి. స్టేజ్-3లోనూ మెరిస్తే స్టేజ్-4లో మెడికల్ పరీక్షలు నిర్వహిస్తారు. అందులో విజయవంతమైతే స్టేజ్-5లో భాగంగా స్టేజ్-1, 3ల్లో సాధించిన మార్కుల ప్రకారం మెరిట్ లిస్టు తయారు చేసి, ఖాళీలకు అనుగుణంగా అర్హులను శిక్షణకు తీసుకుంటారు. ఉద్యోగానికి ఎంపికైనవారి వివరాలు కోస్టు గార్డు వెబ్‌సైట్‌లో ప్రకటిస్తారు.
ఉద్యోగంలో..
వీరికి ఐఎన్‌ఏ, ఎజమాళలో 22 వారాల శిక్షణ నిర్వహిస్తారు. దాన్ని విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకున్నవారిని అసిస్టెంట్ కమాండెంట్ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు. ఈ సమయంలో రూ.56,100 మూలవేతనం చెల్లిస్తారు. డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ఇతర అలవెన్సులు అన్నీ కలిపి తొలి నెల నుంచే రూ.లక్షకు పైగా జీతం అందుకోవచ్చు. తక్కువ వ్యవధిలోనే డిప్యూటీ కమాండెంట్, కమాండెంట్ హోదాలు పొందవచ్చు. భారత సముద్ర తీరాన్ని కాపాడటం వీరి ప్రాథమిక విధి. అక్రమ చొరబాట్లను అడ్డుకోవాలి. ప్రమాదంలో చిక్కుకున్న మత్స్యకారులనూ రక్షించాలి. కింది స్థాయి ఉద్యోగులకు దిశానిర్దేశం చేయాలి.
అర్హతలు..
పోస్టు: అసిస్టెంట్ కమాండెంట్లు (గ్రూప్-ఎ గెజిటెడ్ ఆఫీసర్)
1) జనరల్ డ్యూటీ ఖాళీలు: 50
అర్హత: కనీసం 60 శాతం అగ్రిగేట్ మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత. ఇంటర్మీడియట్‌లో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ సబ్జెక్టుల్లో 55 శాతం మార్కులు అవసరం.
2) టెక్నికల్ (మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్) ఖాళీలు: 20
అర్హత: కనీసం 60శాతం అగ్రిగేట్ మార్కులతో నిర్దేశిత బ్రాంచీల్లో బీఈ/ బీటెక్ ఉత్తీర్ణత. అలాగే ఇంటర్ ఎంపీసీ లేదా డిప్లొమాలోనూ 55 శాతం మార్కులు ఉండాలి.
వయసు: పై రెండు పోస్టులకూ జులై 1, 2024 నాటికి 21 నుంచి 25 ఏళ్లలోపు ఉండాలి. అంటే 01.07.1999 – 30.06.2003 మధ్య జన్మించిన వారు అర్హులు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ఠ వయసులో సడలింపులు వర్తిస్తాయి. 157 సెం.మీ. ఎత్తు, అందుకు తగ్గ బరువు ఉండాలి. ప్రస్తుతం చివరి ఏడాది కోర్సులు చదువుతోన్న విద్యార్థులూ దరఖాస్తు చేసుకోవచ్చు.
ముఖ్య వివరాలు..
ఆన్‌లైన్ దరఖాస్తులు: మార్చి 6 సాయంత్రం 5:30 వరకు స్వీకరిస్తారు.
పరీక్ష ఫీజు: రూ.300. ఎస్సీ, ఎస్టీలు చెల్లించనవసరం లేదు.
పరీక్షలు: స్టేజ్-1 ఏప్రిల్, స్టేజ్-2 మే, స్టేజ్-3 జూన్-ఆగస్టు, స్టేజ్-4 జూన్-నవంబరు, స్టేజ్-5 డిసెంబరులో నిర్వహిస్తారు.
వెబ్‌సైట్: https://joinindiancoastguard.cdac.in/cgcat/