హైదరాబాద్ లో చైనా మాంజా కారణంగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అంబర్ పేట కొత్త ఫ్లైఓవర్ మీద బైక్ పై వెళుతుండగా చైనా మాంజా మెడకు చుట్టుకుంది.
దీంతో అతడి గొంతు కోసుకుపోయి తీవ్ర రక్తస్రావం జరిగింది. వెంటనే బాధితుడిని ఆస్పత్రికి తరలించగా ప్రస్తుతం చికిత్స జరుగుతోంది. మరోవైపు నిజామాబాద్ జిల్లాలోనూ ఓ బాలుడు ఆడుకుంటుండగా చైనా మాంజా గొంతుకు కోసుకుపోయి తీవ్రగాయాలు అయ్యాయి. బాలుడికి వైద్యులు 20 కుట్లు వేశారు.
మరోవైపు ఇప్పటికే హైదరాబాద్ లో ఈ ఏడాది 5కు పైగా చైనా మాంజా తెగిన కేసులు నమోదయ్యాయి. ఓ వ్యక్తి ప్రాణాలు సైతం కోల్పోయాడు. పక్షులు సైతం మాంజా కారణంగా తీవ్రంగా గాయపడుతూ మరణిస్తున్నాయి. అయితే ఇప్పటికే రాష్ట్రంలో చైనా మాంజా విక్రయాలపై నిషేదం విధించినా ఎక్కడో ఒక దగ్గర అమ్ముతూనే ఉన్నారు. దీంతో అధికారులు చైనా మాంజా విక్రయిస్తున్న దుకాణాల మీద దాడులు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.


































