Income tax: బడ్జెట్‌లో ఆదాయపు పన్ను రేట్లలో మార్పులు..?

www.mannamweb.com


బడ్జెట్‌లో ఆదాయపు పన్ను రేట్లలో మార్పులు ఉండొచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. వినియోగం పెంచడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందని తెలుస్తోంది.

Budget 2024 | ఇంటర్నెట్‌ డెస్క్‌: వ్యక్తిగత ఆదాయపు పన్ను (Inccome tax) విషయంలో ఊరట కోసం ఏళ్లుగా ఎదురుచూస్తున్న వేతన జీవుల నిరీక్షణకు తెరపడనుందా? త్వరలో వెలువడే బడ్జెట్‌లో (Budget 2024) ఆదాయపు పన్ను శ్లాబుల్లో మార్పులు రాబోతున్నాయా? అంటే అవుననే అంటున్నాయి సంబంధిత వర్గాలు. రాబోయే బడ్జెట్‌లో కొన్ని వర్గాల ఆదాయ వర్గాల వారికి పన్ను రేట్లను తగ్గించాలని ప్రభుత్వం భావిస్తోందట! తద్వారా వినియోగాన్ని పెంచాలన్న ఆలోచన చేస్తున్నట్లు రాయిటర్స్‌ సహా మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.

కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన మోదీ సర్కారు.. జులైలో పూర్తి స్థాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టనుంది. ఎన్నికల ముందు భాజపా ఆశించినట్లు సొంతంగా విజయం సాధించకపోగా.. ప్రభుత్వాన్ని నడిపే విషయంలో మిత్రపక్షాలపై ఆధారపడాల్సిన పరిస్థితి. ముఖ్యంగా ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, ఆదాయాలు తగ్గడం వంటి విషయాల్లో కొన్ని వర్గాల్లో వ్యతిరేకత ఈ పరిస్థితికి కారణమని పోస్ట్‌ పోల్‌ సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బడ్జెట్‌ రూపకల్పనకు సిద్ధమవుతున్న మోదీ సర్కారు.. వారికి ఊరటనిచ్చే విషయంలో ఆలోచన చేస్తోందని సమాచారం. మధ్యతరగతి ఆదాయాలు, వారి జీవనశైలిని పెంపొందించడమే తమ లక్ష్యమని ప్రధాని మోదీ సైతం ఇటీవల చెప్పారు.

ముఖ్యంగా మధ్యతరగతికి ఊరటనివ్వడంతో పాటు వారి పొదుపును పెంచేందుకు సర్కారు ఆలోచన చేస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా రూ.15 లక్షలకు పైగా ఆర్జిస్తున్న వారికి ఊరట ఉండొచ్చని చెబుతున్నారు. ప్రస్తుతం రూ.15 లక్షలలోపు ఆదాయం ఉన్న వారికి 5 నుంచి 20 శాతం మధ్య పన్ను పడుతుండగా.. రూ.15 లక్షలు పైబడిన వారికి గరిష్ఠంగా 30 శాతం ట్యాక్స్‌ పడుతోంది. అలాగే, రూ.10 లక్షల వార్షికాదాయంపైనా పన్ను రేట్లు తగ్గించే యోచన చేస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. కొత్త ఆదాయపు పన్ను శ్లాబుల గురించీ చర్చ జరుగుతోందని పేర్కొన్నాయి.

పన్ను రేట్లు తగ్గింపు వల్ల వినియోగం పెరుగుతుందని, తద్వారా ఆర్థిక వ్యవస్థలో డిమాండ్‌ పెరిగి ఇన్వెస్ట్‌మెంట్‌ సైకిల్‌ మెరుగవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. దీనివల్ల జీఎస్టీ వసూళ్ల రూపంలో ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది. మరోవైపు బడ్జెట్‌ రూపకల్పనకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు జరుగుతున్నాయి. జూన్‌ 20 నుంచి బడ్జెట్‌ ముందస్తు చర్చలు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రారంభించనున్నారు. వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలను సేకరించనున్నారు.