ఏపీలో మళ్లీ కరెంటు ఛార్జీల పెంపు? కీలక నిర్ణయం దిశగా ఈఆర్సీ..

ఏపీలో ఎన్నికల వేళ మరోసారి కరెంటు ఛార్జీల పెంపు తప్పేలా లేదు. ఇప్పటికే సరఫరా, ఇతరత్రా నష్టాలను తగ్గించుకుని లాభాలు పెంచుకోవాల్సిన డిస్కంలు అందులో విఫలమై కరెంటు ఛార్జీల పెంపుపైనే ఆధారపడాల్సిన పరిస్ధితి ఏర్పడింది.
దీంతో మరోసారి కరెంటు ఛార్జీలు పెంచుకునేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ)ని కోరాయి. ఈ నేపథ్యంలో ఇవాళ విశాఖలో నామమాత్రపు ప్రజాభిప్రాయసేకరణకు ఈఆర్సీ సిద్దమైంది.


రాష్ట్రంలో విద్యుత్ సంస్ధలు(డిస్కంలు) 2024-25 ఆర్ధిక సంవత్సరానికి రూ.251 కోట్ల మేర విద్యుత్ ఛార్జీలు పెంచుకునేందుకు అనుమతించాలని కోరుతూ విద్యుత్ నియంత్రణ మండలికి ప్రతిపాదనలు అందించాయి. వీటిపై ఈఆర్సీ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టి తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కానీ కొన్నేళ్లుగా ఈఆర్సీ ఇలా డిస్కంలు అందించిన ప్రతిపాదనలపై నామమాత్రపు ప్రజాభిప్రాయ సేకరణ జరిపినా అభ్యంతరాలతో సంబంధం లేకుండా దాదాపుగా వాటికి ఆమోద ముద్ర వేస్తూనే ఉంది. దీంతో ఈసారి కూడా రూ.251 కోట్ల మేర విద్యుత్ ఛార్జీల పెంపుకు ఆమోదం పడేలా కనిపిస్తోంది.

 

డిస్కంల ప్రతిపాదనలకు ఈఆర్సీ ఇవాళ విశాఖలో జరిపే ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత ఆమోద ముద్ర వేస్తే వినియోగదారులపై రూ.251 కోట్ల మేర భారం పడటం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే డిస్కంలు కోరినట్లుగా అదనపు ఛార్జీలు, ఇతరత్రా ఛార్జీలను పెంచుకుంటూ పోవడం వల్ల కరెంటు బిల్లుల మోత పెరుగుతోందన్న విమర్శలు ఉన్నాయి. ఇలాంటి తరుణంలో మరోసారి డిస్కంల ప్రతిపాదనలకు ఈఆర్సీ ఆమోద ముద్ర వేయొద్దనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.

ఇవాళ్టి నుంచి నాలుగు రోజుల పాటు విశాఖ లోని ప్రాంతీయ కార్యాలయంలో ఈఆర్సీ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనుంది. వర్చువల్ విధానంలో సాగే ఈ ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత డిస్కంల ప్రతిపాదనలపై ఈఆర్సీ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. డిస్కంల ప్రతిపాదనల్ని పూర్తిగా తోసిపుచ్చేందుకు కూడా ఈఆర్సీకి అధికారం ఉంటుంది. అలాగే మార్పు చేర్పులు చేసేందుకు, అవేవీ లేకుండానే పూర్తిగా ఆమోదించేందుకూ ఈఆర్సీకి అధికారం ఉండటంతో ఎన్నికల వేళ కరెంటు ఛార్జీల పెంపుపై తీసుకోబోయే నిర్ణయం కీలకంగా మారింది.