ప్రపంచ జూనియర్ మిక్స్‌డ్ టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత జట్టు పతకంతో చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైంది. సొంతగడ్డపై జరుగుతున్న ఈ ఈవెంట్‌లో భారత్ జైత్రయాత్ర కొనసాగుతోంది.
గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో భారత జట్టు 44-45, 45-30, 45-33తో దక్షిణ కొరియాపై విజయం సాధించింది. సెమీస్ చేరడం ద్వారా కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది. బాలుర డబుల్స్‌లో భార్గవ్ రామ్-విశ్వతేజ్ జంట 5-9తో చొ హ్యోంగ్ వూ-లీ హ్యోంగ్ వూ జోడీ చేతిలో ఓడింది.
బాలికల డబుల్స్‌లో వెన్నెల-రిషిక జోడీ 10-9తో చివోన్ హ్యూ- మున్ ఇన్ సియో జంటపై గెలిచింది. తర్వాత బాలుర సింగిల్స్‌లో రౌనక్ చౌహాన్ 11-9తో చొయ్ అహ్ సియంగ్‌ను ఓడించాడు. కానీ మిక్స్‌డ్ డబుల్స్‌లో లాల్‌రామ్‌సంగ-అన్య బిష్త్ జోడీ 4-9తో లీ-చివోన్ జంట చేతిలో ఓడింది. కీలకమైన మహిళల సింగిల్స్ రెండు మ్యాచ్‌ల్లోనూ ఉన్నతి హుడా గెలుపొందడంతో భారత్ విజయం సాధించింది.































