న్యూయార్క్: టీ20 ప్రపంచకప్ 2024లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌కు భారత్ షాక్ ఇచ్చింది. బౌలర్లు ఆధిపత్యం చెలాయించిన మ్యాచ్‌లో 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. 120 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన పాక్‌ను 20 ఓవర్లలో 7 వికెట్లు పడగొట్టి 113 పరుగులకే కట్టడి చేసింది. ఓపెనర్ రిజ్వాన్ (31) టాప్ స్కోరర్. జస్‌ప్రీత్ బుమ్రా (3/14), హార్దిక్ పాండ్య (2/24) పాక్ పనిపట్టారు. అర్ష్‌దీప్ సింగ్, అక్షర్ పటేల్ చెరో వికెట్ పడగొట్టారు. లక్ష్యఛేదనలో పాక్ తొలుత మెరుగ్గానే ఆడింది. దీంతో భారత్ గెలుపుపై అభిమానులు ఆశలు వదులుకుంటున్న దశలో టీమ్‌ఇండియా బౌలర్లు పుంజుకున్నారు. వరుస విరామాల్లో వికెట్లు పడగొడుతూనే పరుగులు కట్టడి చేసి ప్రత్యర్థి జట్టును ఒత్తిడిలోకి నెట్టారు. చివరి ఓవర్‌లో పాక్ విజయానికి 18 పరుగులు అవసరం కాగా.. అర్ష్‌దీప్ సింగ్ మొదటి మూడు బంతుల్లో రెండు పరుగులు ఇచ్చి వికెట్ పడగొట్టాడు. తర్వాత నసీమ్ షా వరుసగా రెండు ఫోర్లు బాదాడు. చివరి బంతికి సింగిల్ వచ్చింది.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్.. 19 ఓవర్లలో 119 పరుగులకు ఆలౌటైంది. పేస్ బౌలింగ్‌కు అనుకూలించిన పిచ్‌పై భారత బ్యాటర్లు కూడా పరుగులు రాబట్టలేకపోయారు. వన్‌డౌన్ బ్యాటర్ రిషభ్ పంత్ (42) టాప్ స్కోరర్. అక్షర్ పటేల్ (20), రోహిత్ శర్మ (13) పరుగులు చేశారు. విరాట్ కోహ్లీ (4), సూర్యకుమార్ యాదవ్ (7), శివమ్ దూబె (3), హార్దిక్ పాండ్య (7) సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. రవీంద్ర జడేజా డకౌటయ్యాడు. పాక్ బౌలర్లలో నసీమ్ షా 3, హారిస్ రవూఫ్ 3, మహ్మద్ అమీర్ 2, షాహీన్ అఫ్రిది ఒక వికెట్ పడగొట్టారు.
ఈ మెగా టోర్నీలో భారత్ వరసగా రెండు విజయాలు సాధించగా, పాక్ వరుసగా రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడింది. దీంతో ఆ జట్టు సూపర్ 8 అవకాశాలు సంక్లిష్టం అయ్యాయి. గ్రూప్ ఏలో భారత్ నెంబర్ వన్ స్థానానికి చేరుకోగా, అమెరికా రెండో స్థానంలో ఉంది.