కల నిజమైంది.. మహిళ క్రికెటర్లు చరిత్ర తిరగరాశారు. భారత మహిళల క్రికెట్ జట్టు ఐసీసీ వరల్డ్ కప్ ట్రోఫీని ముద్దాడింది. ముంబైలో జరిగిన ఫైనల్‌లో సమిష్టి ప్రదర్శనతో అదరగొట్టిన భారత్..
ప్రత్యర్థి దక్షిణాఫ్రికాను చిత్తు చేసి తొలిసారి విశ్వవిజేతగా నిలిచింది. ఈ మ్యాచులో సఫారీలను 52 రన్స్‌తో ఓడించింది. 2005, 2017 ఫైనల్స్‌లో చేజారిన కలను కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని జట్టు సాకారం చేసింది.
బ్యాటింగ్‌లో షెఫాలీ, దీప్తి మెరుపులు
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్.. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసి దక్షిణాఫ్రికాకు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఓపెనర్లు షెఫాలీ వర్మ (87), స్మృతి మంధాన (45) జట్టుకు కళ్లుచెదిరే ఆరంభాన్నిచ్చారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 104 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ముఖ్యంగా షెఫాలీ మెరుపు బ్యాటింగ్‌తో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. జెమీమా రోడ్రిగ్స్ (24), హర్మన్‌ప్రీత్ కౌర్ (20) త్వరగా నిష్క్రమించినా.. ఆల్ రౌండర్ దీప్తి శర్మ (58 నాటౌట్), రిచా ఘోష్ (34) నిలకడగా ఆడి.. జట్టు స్కోరు 298కి చేర్చారు.
బౌలింగ్‌లో మ్యాజిక్
299 పరుగుల లక్ష్యంతో ఛేదన మొదలుపెట్టిన దక్షిణాఫ్రికాకు ఓపెనర్లు లారా వోల్వార్డ్ట్ (65), తాజ్మిన్ బ్రిట్స్ (23) మంచి ఆరంభాన్ని ఇచ్చారు. అయితే కీలక సమయంలో అమాన్‌జోత్ కౌర్ మెరుపు ఫీల్డింగ్‌తో బ్రిట్స్ రనౌట్ అవ్వడం మ్యాచ్‌ను మలుపు తిప్పింది. ఆ తర్వాత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ వేసిన మాస్టర్ స్ట్రోక్ అద్భుత ఫలితాన్నిచ్చింది. బ్యాటింగ్‌లో అదరగొట్టిన షెఫాలీ వర్మను అనూహ్యంగా బౌలింగ్‌కు తీసుకురాగా, ఆమె బ్రేక్‌త్రూలు అందించింది. తన అద్భుతమైన స్పిన్ మాయాజాలంతో షెఫాలీ.. దక్షిణాఫ్రికా కీలక బ్యాటర్లైన సునె లూస్ (25), మరిజానే కాప్ (4) వికెట్లు తీసి దక్షిణాఫ్రికా పతనాన్ని శాసించింది. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో, ఒత్తిడిలో దక్షిణాఫ్రికా బ్యాటర్లు చేతులెత్తేశారు. భారత మహిళలు చారిత్రక విజయాన్ని సాధించడంతో దేశమంతా సంబరాల్లో మునిగిపోయింది.

































