డల్లాస్ లో ఇండియన్స్ జాగ్రత్తగా ఉండాలి.. లేకుంటే H1b క్యాన్సిల్

ల్లాస్ ప్రాంతం..అమెరికాలో భారతీయ అమెరికన్లకు ఒక కొత్త నిలయంగా మారింది. వేలాది మంది ఇండియన్లు, ముఖ్యంగా ఉన్నత విద్యావంతులు, వైద్యులు, ఇంజనీర్లు, ఐటీ నిపుణులు ఇక్కడ స్థిరపడ్డారు.


ఈ ప్రతిభావంతులైన కమ్యూనిటీ స్థానిక ఆర్థిక వ్యవస్థకు గణనీయంగా దోహదపడుతోంది. భారతీయ అమెరికన్ల నిపుణత్వం, కృషి వల్ల ఈ ప్రాంతం వృత్తిపరంగా, ఆర్థికంగా మరింత బలంగా తయారైంది. ఈ వాస్తవం ఎవరూ కాదనలేనిది. అయితే నాణేనికి మరో వైపు డల్లాస్ ను ఇండియన్ కల్చర్ గా మార్చుతోన్న భారతీయులపై స్థానిక అమెరికన్లలో వ్యతిరేకత పెరుగుతోంది. వారి దేశంలో ఇండియా ఆధిపత్యం, పండుగలు, అమెరికన్లకు ఇబ్బందికరంగా మారుతున్నాయి. దీంతో అక్కడ డల్లాస్ నుంచి ఇండియన్లను పంపించేయాలని.. హెచ్1బీలను క్యాన్సిల్ చేయాలనే డిమాండ్ తాజాగా వెల్లువెత్తుతోంది. ఇది డల్లాస్ లోని ఇండియన్స్ కు ఒక డేంజర్ బెల్ గా చెప్పొచ్చు.

పెరిగిన అసంతృప్తికి కారణాలు

ఒకవైపు ఆర్థికంగా డల్లాస్‌కు ఇండియన్ల రాక ప్రయోజనం చేకూరుస్తున్నప్పటికీ, మరోవైపు స్థానిక అమెరికన్లలో పెరుగుతున్న అసంతృప్తి ఆందోళన కలిగిస్తోంది. దీనికి ప్రధాన కారణం భారతీయ కమ్యూనిటీ పండుగలు, సాంస్కృతిక కార్యక్రమాలను వీధులపై నిర్వహించడం.. దీనివల్ల ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. పండుగల కోసం రోడ్లపై గుంపులుగా చేరడం వల్ల ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడి, స్థానికులకు ఇబ్బందులు కలుగుతున్నాయి. శబ్ద కాలుష్యం ఎక్కువవుతోంది. భారీ శబ్దాలతో కూడిన ఊరేగింపులు, వేడుకలు స్థానికుల ప్రశాంతతకు భంగం కలిగిస్తున్నాయి. సాంస్కృతిక భేదాలు వస్తున్నాయి. తమ సంస్కృతిపై “దాడి” జరుగుతోందన్న భావన కొంతమంది అమెరికన్లలో పెరుగుతోంది. “డల్లాస్ ఇండియాగా మారిపోతోంది” అనే విమర్శలకు ఇది దారితీస్తోంది. డల్లాస్ లో ఇండియన్స్ కు హెచ్1బీ క్యాన్సిల్ చేయకపోతే తమ పిల్లలు అమెరికాలో పెరుగుతున్నట్టు అనిపించడం లేదని.. ఇండియాలోనే పెరుగుతున్నారన్న భావన కలుగుతోందని.. అందుకే ఈ ప్రాంతంలో ఇండియన్స్ ను తగ్గించాలన్న డిమాండ్ వినిపిస్తోంది.

*రాజకీయ ఒత్తిడి, H1B వీసాల ముప్పు

ఈ అసంతృప్తిని రాజకీయ నాయకులు, ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ వంటి వారు తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు. H1B వీసాల రద్దు వంటి హెచ్చరికలు చేయడం ద్వారా వలసదారులకు వ్యతిరేకంగా ఉన్న భావనలను వారు మరింత పెంచుతున్నారు. H1B వీసాలు చాలామంది ఇండియన్ ఐటీ నిపుణులకు అమెరికాలో ఉండటానికి ఆధారం. స్థానిక వ్యతిరేకత పెరిగితే, వీసా పాలసీలు మరింత కఠినతరం అయ్యే ప్రమాదం ఉంది. ఇది అమెరికాలో ఉన్న భారతీయ వృత్తి నిపుణుల భవిష్యత్తును అనిశ్చితిలోకి నెట్టేస్తుంది.

* నిపుణుల సూచనలు, పరిష్కార మార్గాలు

ఈ సమస్యకు పరిష్కారం కోసం నిపుణులు కొన్ని సూచనలు ఇస్తున్నారు. స్థానిక సంస్కృతికి గౌరవించడం ముఖ్యం. ఇండియన్లు తాము ఇప్పుడు అమెరికాలో ఉన్నామని, ఇక్కడి సంస్కృతి, నిబంధనలను గౌరవించాలని గుర్తుంచుకోవాలి. ప్రైవేట్ ప్రదేశాలు వినియోగించాలి. పండుగలు, ఉత్సవాలను వీధులపై కాకుండా కమ్యూనిటీ హాల్స్, టెంపుల్స్ లేదా ప్రైవేట్ ప్రదేశాల్లో నిర్వహించుకోవాలి. సమతుల్యత పాటించాలి. తమ సంస్కృతిని ప్రదర్శించడంలో స్థానికులకు ఇబ్బంది కలిగించకుండా జాగ్రత్త పడాలి. చిన్న పొరపాట్లను నివారించాలి. ఒక చిన్న పొరపాటు మొత్తం కమ్యూనిటీకి చెడ్డ పేరు తీసుకురావచ్చు. అందువల్ల, ప్రతి ఇండియన్ బాధ్యతగా వ్యవహరించడం ముఖ్యం.

ఈ అంశాలపై దృష్టి పెట్టి, స్థానిక సమాజంతో సత్సంబంధాలు ఏర్పరచుకోవడం ద్వారా మాత్రమే భారతీయ కమ్యూనిటీ తమ ప్రతిష్టను, H1B వంటి కీలక అవకాశాలను కాపాడుకోగలదు. డల్లాస్‌లో ఇండియన్లు అమెరికా సమాజంలో భాగం కావాలి తప్ప, అమెరికాను ఇండియాగా మార్చాలని ప్రయత్నించకూడదు. ఈ కఠినమైన వాస్తవాన్ని ఇండియన్లు గ్రహించడం చాలా అవసరం. లేదంటే H1Bలు రద్దు అయ్యి వారంతా స్వదేశానికి తరలిరావడం ఖాయం. ఇదో హెచ్చరికగా భావించి జాగ్రత్తగా డల్లాస్ లో మసులుకోవాల్సిన అవసరం ఉంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.