ఇప్పటికే అనేక స్మార్ట్ ఫోన్ల బ్రాండ్లు ఉన్నాయి. స్మార్ట్ ఫోన్ల తయారీ కంపెనీల మధ్య బలమైన పోటీ నడుస్తోంది. ఈ పోటీని తట్టుకుని నిలబడడం అనేది కత్తి మీద సాము లాంటిది. ఇప్పటికే పలు కంపెనీలు తమ కార్యకలాపాలను నిలిపివేశాయి. ఇంటెక్స్, స్పైస్, వీడియో కాన్, పానాసోనిక్ వంటి కంపెనీలు స్మార్ట్ ఫోన్ల తయారీని నిలిపివేశాయి. సేల్స్ తగ్గిపోవడంతో ఈ కంపెనీలు ఫోన్ల తయారీని నిలిపివేశాయి. తాజాగా ఈ లిస్టులోకి మరో ప్రముఖ కంపెనీ చేరబోతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనికి కారణం ఆ కంపెనీ తయారు చేసిన స్మార్ట్ ఫోన్ల విక్రయాలు గణనీయంగా తగ్గుతూ వస్తుండడమే.
ప్రముఖ చైనీస్ స్మార్ట్ ఫోన్ల తయారీ కంపెనీ షావోమీకి ఇండియాలో గడ్డు పరిస్థితి నెలకొంది. రెగ్యులేటరీ ఫైలింగ్ ప్రకారం.. ఇండియాలో షావోమీ లాభాలు తగ్గాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీ లాభాలు 77 శాతం మేర తగ్గి 238.63 కోట్లకు చేరుకున్నాయి. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో ఈ లాభాలు 1057.7 కోట్లుగా కంపెనీ తెలిపింది. 2022 ఆర్థిక ఏడాదిలో 39,100 కోట్లుగా ఉన్న షావోమీ ఆదాయం.. 2023 ఆర్థిక ఏడాదికి రూ. 26,697 కోట్లకు పడిపోయింది. షావోమీ కార్యకలాపాల ద్వారా వచ్చే ఈ ఆదాయం 32 శాతం మేర తగ్గింది. 2023 ఆర్థిక ఏడాదిలో షావోమీ కంపెనీ ఉత్పత్తి విక్రయాల నుంచి రూ. 26,395 కోట్లు ఆర్జించింది. సర్వీసుల సహా ప్రకటనలు, వేల్యూ యాడెడ్ సర్వీసులు, ఇతరాల నుంచి రూ. 264 కోట్లు ఆర్జించింది. మార్కెట్ రీసెర్చ్ ఫర్మ్ ఐడీసీ ప్రకారం.. 2022లో షావోమీ కంపెనీ స్మార్ట్ ఫోన్ షిప్మెంట్ లో 25 శాతం క్షీణతను నమోదు చేసింది.
2023 ఆర్థిక సంవత్సరానికి చెందిన మూడు త్రైమాసికాల్లో క్షీణత ఉన్నప్పటికీ భారతీయ స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో 21 శాతం మార్కెట్ వాటాను షావోమీ కలిగి ఉంది. 2024 మార్చి త్రైమాసికం కోసం షావోమీ తమ మార్కెట్ వాటాను పెరుగుతుందని అంచనా వేస్తుంటే.. రీసెర్చ్ అనలిస్టులు మాత్రం దీనికి విభేదిస్తున్నారు. సైబర్ మీడియా రీసెర్చ్ అంచనా వేసిన దాని ప్రకారం.. 18.6 శాతంతో షావోమీ కంపెనీ శాంసంగ్ కంటే కొద్దిగా వెనకబడి ఉంది. అయితే ఐడీసీ రీసెర్చ్ మాత్రం షావోమీ మార్కెట్ వాటా 13 శాతంగానే చెబుతోంది. షావోమీ కంపెనీ ఇటీవలే ఇండియాలో కార్యకలాపాల్లో పది వసంతాలను పూర్తి చేసుకుంది. రాబోయే పదేళ్లలో స్మార్ట్ ఫోన్ విక్రయాలను రెట్టింపు చేయాలని కంపెనీ భావిస్తుంది. గత 10 పదేళ్లలో 35 కోట్ల డివైజ్ లను అమ్మగా.. ఇంకో పదేళ్లలో 70 కోట్లు విక్రయించాలని కంపెనీ యోచిస్తోంది. కానీ పలు రీసెర్చ్ ల ప్రకారం.. భారత మార్కెట్ లో షావోమీ వ్యాపారం క్రమంగా తగ్గిపోతూ వస్తుందని.. ఒక్క ఏడాదిలో షావోమీ బిజినెస్ 32 శాతం తగ్గడంతో భారత మార్కెట్లో ఆ కంపెనీ క్రేజ్ తగ్గుతోందని రీసెర్చ్ అనలిస్టులు చెబుతున్నారు.