కథలు మన ఆలోచన విధానాన్ని మారుస్తాయి. మనలో ధైర్యాన్ని, స్ఫూర్తిని నింపుతాయి. అలాంటి ఎన్నో కథలు చిన్న నాటి నుంచి చదువుతూనే ఉంటున్నాం. అలాంటి ఒక స్ఫూర్తివంతమైన కథ గురించి ఈరోజు తెలుసుకుందాం..
ఒక అడవిలో తాబేలు ఉంటుంది. అది ఎప్పుడూ బాధతో ఉంటుంది. అడవిలో అన్ని జంతువులు ఎంచక్కా చురుగ్గా పరిగెడుతూ ఉంటుంటే తాను మాత్రం నెమ్మదిగా నడుస్తానని బాధపడుతుంది. అంతలోనే అటుగా ఓ కోతి వస్తుంది. ‘ఏమైంది తాబేలు బావా అలా ఢీలాగా ఉన్నావు’ అనగానే మళ్లీ ఇదే కథ చెప్పుకొస్తుంది. ‘ఏముంది నువ్వు చూడు ఎంచక్కా చెట్ల కొమ్మలపై గెంతుతూ సందడిగా ఉంటున్నావు. నేనేమో ఇలా పాకుతూ, నెమ్మదిగా నడుస్తున్నాను. అసలు నా జీవితం ఏంటో, ఆ దేవుడు నన్ను ఎందుకు ఇలా పుట్టించాడో’ అని బాధపడుతుంది.
వీరిద్దరూ ఇలా మాట్లాడుకుంటున్న సమయంలోనే అక్కడే ఉన్న ఓ నది వద్ద అలజడి రేగుతుంది. నదిలోకి కొత్తగా వచ్చిన ఓ భారీ మొసలి నీళ్లు తాగేందుకు వెళ్లే వారిని బెదిరిస్తూ చంపడానికి ప్రయత్నిస్తుంది. ఈ విషయం అక్కడే ఉన్న కోతి, తాబేలు చెవిన పడుతుంది. వెంటనే ఆ రెండు అక్కడికి వెళ్తాయి. క్షణం ఆలోచించకుండా తాబేలు చెరువు గట్టు వద్దకు వెళ్తుంది.
దీంతో మొసలి తాబేలుపై దాడి చేసేందుకు వస్తుంది. వెంటనే తాబేలు తలను లోపలికి మలిచి బండరాయిలా మారిపోతుంది. మొసలి దానిపై దాడి చేసేందుకు ప్రయత్నించగా గట్టిగా దెబ్బ తగులుతుంది. అదేదో వింత జంతువుగా భయపడ్డ మొసలి వెంటనే అక్కడి నుంచి పారిపోతుంది. దీంతో జంతువులన్నీ ఎంచక్కా నదిలోని నీటిని తాగుతాయి.
ఇదంతా చూసిన కోతి మాట్లాడుతూ.. ‘చూశావా తాబేలు బావా ఈ గొప్పతనం ఏంటో ఇప్పుడైనా నీకు అర్థమైందా.? ఇప్పుడు అడవికి నువ్వే నిజమైన హీరో అయ్యావు. నీ సహనం, నీ ధైర్యం, నీ ప్రత్యేకతే మా అందరినీ కాపాడింది. కాబట్టి నీలో ప్రత్యేకత లేదనుకోకు, ప్రతీ ఒక్కరిలో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది’ అని చెబుతుంది. దీంతో తాబేలు నవ్వుతూ అక్కడి నుంచి ముందుకు వెళ్తుంది.
నీతి: మనలో కూడా చాలా మంది నిత్యం జీవితంలో ఇలా ఢీలా పడుతుంటారు. తమలో ఎలాంటి ప్రత్యేకత లేదని ఫీలవుతుంటారు. అయితే ప్రతీ ఒక్కరిలో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. సమయం వచ్చినప్పుడు అది బయటకు వస్తుందనే గొప్ప సందేశం ఈ కథలో ఉంది.