బీమా అనేది ప్రతి ఒక్కరికీ చాలా అవసరం. జీవితంలో ఎదురయ్యే అనుకోని ఇబ్బందులను అధిగమించడానికి, ఆర్థిక నష్టాలకు దూరంగా ఉండటానికి ఇది చాలా అవసరం. పాలసీలలో అనేక రకాలు ఉన్నాయి.
సాధారణంగా జీవిత బీమా పాలసీలను చాలామంది ఎక్కువగా తీసుకుంటారు. వీటితో పాటు ఆరోగ్య పాలసీలు కూడా ఎంతో ఉపయోగంగా ఉంటాయి. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు ఆరోగ్య బీమా (హెల్త్ ఇన్స్యూరెన్స్) పాలసీలు చేయించడం చాలా అవసరం.
పెరుగుతున్న వృద్ధులు..
ప్రస్తుతం మన దేశం జనాభాలో మొదటి స్థానంలో ఉంది. దానికి అనుగుణంగానే వృద్ధులు కూడా పెరుగుతున్నారు. రాబోయే రోజులలో వీరి సంఖ్య ఇంకా ఎక్కువవుతుంది. వృద్ధ్యాప్యంలో అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఆరోగ్య పరంగా అనేక ఇబ్బందులు కలుగుతాయి. వారి ఆరోగ్య సంరక్షణకు అధికంగా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఆ పరిస్థితిలో ఆరోగ్య పాలసీలు ఎంతో ఆదుకుంటాయి. కానీ దేశంలో చాలామంది సీనియర్ సిటిజన్లకు హెల్త్ పాలసీలు లేవు.
అనేక పాలసీలు..
హెల్త్ పాలసీలలో అనేక రకాలు ఉంటాయి. వాటిని జాగ్రత్తగా పరిశీలించి మనకు ఉపయోగపడే దానిని ఎంపిక చేసుకోవాలి. ముఖ్యం పాలసీలోని అంశాలను అర్థం చేసుకోవడం చాలా అవసరం.
ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్.. ఈ పాలసీ కుటుంబమంతటికీ బీమా కవరేజ్ అందజేస్తుంది. సీనియర్లతో సహా మొత్తం కుటుంబానికి రక్షణ కల్పిస్తుంది.
వ్యక్తిగత ఆరోగ్య ప్రణాళిక.. సీనియర్ల ప్రత్యేక ఆరోగ్య పరిస్థితుల కోసం తీసుకునే పాలసీ. వ్యక్తిగతంగా ఇది కవరేజ్ ఇస్తుంది.
సీనియర్ సిటిజన్ హెల్త్ ప్లాన్.. ప్రత్యేకంగా వృద్ధుల కోసం ఈ పాలసీని రూపొందించారు.
క్రిటికల్ ఇల్‌నెస్ ప్లాన్.. క్యాన్సర్, గుండెపోటు వంటివి సంభవించినప్పుడు ఉపయోగపడుతుంది. నిర్దిష్ట, క్లిష్టమైన అనారోగ్యాల కోసం ఒకేసారి చెల్లింపు చేస్తారు.
వ్యక్తిగత ప్రమాద బీమా.. ప్రమాదవశాత్తూ సంభవించిన మరణం, గాయాలు, వైకల్యం తదితర వాటికి బీమా అందిస్తుంది. వైద్య ఖర్చుల కోసం ఆర్థిక రక్షణ కల్పిస్తుంది.
ప్రసూతి ప్రణాళిక.. ప్రసూతి వయసు కలిగిన మహిళల కోసం ఈ పాలసీ ఉపయోగపడుతుంది. ప్రసూతి సంబంధిత ఖర్చులకు కవరేజ్ లభిస్తుంది.
గమనించాల్సిన అంశాలు..
- సహ చెల్లింపులు లేని పాలసీలు సీనియర్లకు ఉపయోగంగా ఉంటాయి. వైద్య ఖర్చులను కవర్ జేస్తాయి. ఆరోగ్యం కోసం మనం ఖర్చు చేసే అదనపు వ్యయాన్ని తగ్గిస్తాయి.
- మీరు పాలసీ తీసుకునే బీమా కంపెనీ నెట్ వర్క్ చాలా బాగుండాలి. మీకు సమీపంలోని ఆసుపత్రులను కలిగి ఉండే ఉపయోగంగా ఉంటుంది.
- ప్రీమియం-టు-కవరేజ్ నిష్పత్తిని అంచనా వేయడం చాలా అవసరం. అతి తక్కువ ధరతో కవరేజీని పెంచుకోండి.
- ఇప్పటికే ఉన్న అనారోగ్యాలకు తిరస్కరణ లేకుండా మీ పాలసీ కవర్ చేయాలి.
- వృద్ధులకు టైలర్డ్ ప్లాన్ తో ప్రత్యేక కవరేజీ, ప్రయోజనాలు కలుగుతాయి.
అనేక సంస్కరణలు..
వృద్ధులకు ఆరోగ్య బీమా సౌలభ్యం, ప్రయోజనాలను మెరుగుపరచడానికి ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏఐ) అనేక సంస్కరణలను తీసుకువచ్చింది. ఇందులో భాగంగా 2024 నుంచి ఆరోగ్య బీమా పాలసీని కొనుగోలు చేయడానికి 65 ఏళ్ల పరిమితిని తొలగించింది. వేచి ఉండే వ్యవధిని నాలుగేళ్ల నుంచి మూడేళ్లకు తగ్గించింది. అవసరమైన చికిత్సలకు త్వరితగతిన యాక్సెస్ చేయడానికి వీలుగా నిబంధనలను రూపొందించింది. అలాగే సీనియర్ సిటిజన్ల క్లెయిమ్‌లు, ఫిర్యాదులను పరిష్కరించడానికి ప్రత్యేక ఛానెళ్లను ఏర్పాటు చేయాలని బీమా సంస్థలను ఆదేశించింది.