Lakhpati Didi Scheme Details : మహిళా సంక్షేమమే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోంది. అలాంటి పథకాలలో ఇది ఒకటి. ఈ పథకం ద్వారా మహిళలు వడ్డీ లేని రుణాలను పొందవచ్చు. అయితే దీని గురించి చాలా మందికి తెలియదు! అసలు ఆ పథకం ఏంటి? ఎవరు అర్హులు వంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
How to Apply for Lakhpati Didi Scheme: ఎప్పుడైతే మహిళలు ఆర్థిక స్వాతంత్య్రం సాధించి కుటుంబానికి అండగా నిలిస్తారో అప్పుడే దేశం ముందుకు సాగుతుందని నిపుణులంటున్నారు. అందుకే ప్రభుత్వాలు మహిళలకు వివిధ రకాల నైపుణ్యాలను నేర్పించి, ఉపాధి కల్పించేందుకు వీలుగా ఎన్నో రకాల పథకాలను ప్రవేశపెడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని పథకాలు గ్రామీణ ప్రాంతాల్లో నివసించే మహిళలు, నిరక్ష్యరాస్యులు ఆర్థిక స్వాతంత్య్రం సాధించేందుకు కృషి చేశాయి. అయితే, గ్రామీణ ప్రాంతంలో ఉండే మహిళల కోసం మరో పథకాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా మహిళలకు వడ్డీ లేకుండానే రుణం అందిస్తారు. కాగా, ఈ పథకం గురించి చాలా మందికి తెలియదు. మరి ఆ పథకానికి సంబంధించిన వివరాలు, లోన్ పొందడానికి ఎవరు అర్హులు ? ఎన్ని లక్షల వరకు రుణాన్ని అందిస్తారు ? అనే వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.
అదే లక్ష్యంగా: మహిళలను లక్షాధికారులను చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 2023లో లఖ్‌పతి దీదీ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకాన్ని కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ అమలు చేస్తోంది. మొట్టమొదట ఈ పథకాన్ని ప్రవేశపెట్టినప్పుడు దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో నివసించే 2 కోట్ల మంది మహిళలకు లబ్ధి చేకూరాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తాజాగా 2024-25 మధ్యంతర బడ్జెట్‌లో దాదాపు 3 కోట్ల మంది మహిళలకు రుణాలను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఈ స్కీమ్ పొందడానికి అర్హులు : స్వయం సహాయక సంఘాలలో సభ్యులుగా ఉండి.. 18 నుంచి 50 ఏళ్ల వయసు మధ్యలో ఉన్నవారు లఖ్‌పతి దీదీ పథకానికి అర్హులు.
ఈ పథకం పొందడానికి కావాల్సిన డాక్యుమెంట్లు:
ఆధార్ కార్డు
బ్యాంక్ పాస్‌బుక్
SHG సభ్యత్వ కార్డు
కులధ్రువీకరణ పత్రం
ఫోన్ నెంబర్
పాస్‌ఫొటో
ఎలా అప్లై చేసుకోవాలంటే:
మీరు ఈ స్కీమ్ ద్వారా రుణాన్ని పొందడానికి మీ జిల్లాలోని మహిళా శిశు అభివృద్ధి శాఖ కార్యాలయాన్ని సందర్శించాలి.
అక్కడ లఖ్‌పతి దీదీ పథకం ఫారమ్ తీసుకుని.. అందులో కావాల్సిన వివరాలను పొందుపరచాలి.
తర్వాత కావాల్సిన డాక్యుమెంట్లను జత చేసి సంబంధిత అధికారులకు సబ్మిట్ చేయాలి.
మీ దరఖాస్తు ఫారమ్‌ను అధికారులు పరిశీలించి.. అర్హులైతే వడ్డీ లేని రుణాన్ని మంజూరు చేస్తారు.
శిక్షణను అందిస్తారు : ఈ పథకం ద్వారా మహిళలకు ఎల్‌ఈడీ బల్బుల తయారీ శిక్షణ, పశుపోషణ, పుట్టగొడుగుల పెంపకం వంటి వివిధ రకాల శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తారు. తర్వాత వారికి ఆర్థిక నిర్వహణ, మార్కెటింగ్, ఆన్‌లైన్ వ్యాపారం, బిజినెస్‌కు సంబంధించిన శిక్షణను అందించి వారి కాళ్లపై వారు నిలబడేలా ప్రోత్సహిస్తారు. ఈ స్కీమ్ ద్వారా మహిళలు ఆదాయ వనరుల్ని కల్పించుకునేందుకు, పెంచుకునేందుకు అవకాశం ఉంటుందని కేంద్రం పేర్కొంది.