అంతర్జాతీయ ఆహార భద్రత కోసం భారత్‌ పరిష్కార మార్గాలుః మోదీ

www.mannamweb.com


ఆహార భద్రతకు భారత్‌ అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఢిల్లీలో నిర్వహిస్తున్న 32వ వ్యవసాయ ఆర్ధికవేత్తల అంతర్జాతీయ సదస్సును ప్రధాని మోదీ ప్రారంభించారు. గత 10 ఏళ్లలో 1900 రకాల ఆహార వంగడాలను భారతీయ వ్యవసాయ శాస్త్రవేత్తలు సృష్టించారని ప్రశంసించారు.

ఢిల్లీలో 32వ వ్యవసాయ ఆర్ధికవేత్తల అంతర్జాతీయ సదస్సును ప్రారంభించారు ప్రధాని మోదీ. 65ఏళ్ల తర్వాత భారత్‌లో అగ్రికల్చర్‌ గ్లోబల్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. నిలకడైన వ్యవసాయ ఆహార వ్యవస్థల అజెండాగా సదస్సును ఏర్పాటు చేశారు. అంతర్జాతీయ ఆహార భద్రత కోసం భారత్‌ పరిష్కారాలు రూపొందించే పనిలో భారత్‌ ఉందని ప్రధాని మోదీ అన్నారు. భారత ఆర్థిక విధానాలకు వ్యవసాయం కీలకమని ప్రకటించారు. భారత ఆహార భద్రతకు చిన్న రైతులే బలమేనని ప్రధాని అన్నారు. 65 ఏళ్ల తర్వాత భారత్‌లో ఈ సదస్సు జరగడం ఆనందంగా ఉందన్నారు.

భారతదేశంలో నేటికి కూడా ఆరు రుతువులు దృష్టిలో పెట్టుకుని ప్రణాళికలు రూపొందిస్తామని వ్యవసాయ ఆర్థికవేత్తలకు ప్రధాని మోదీ వివరించారు. భారతదేశంలో 15 వ్యవసాయ వాతావరణ మండళ్లు ఉన్నాయని, ఇవి వేటికి అవే ప్రత్యేకమైనవి తెలిపారు. పాలు, సుగంధ ద్రవ్యాలు, పప్పు ధాన్యాల్లో భారతదేశం మిగులు దేశమని ప్రధాని తెలిపారు. భారతదేశం ఎంత పురాతనమైనదో ఇక్కడి వ్యవసాయ సంప్రదాయమూ అంతే పాతదని ప్రధాని తెలిపారు. భారతదేశ వ్యవసాయ సంప్రదాయంలో విజ్ఞానం, తర్కం ఇమిడి ఉన్నాయన్నారు. తమ ప్రభుత్వం సేంద్రీయ వ్యవసాయానికి కూడా అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని మోదీ అన్నారు. వ్యవసాయ రంగానికి ఎన్నో ప్రోత్సాహకాలు ఇస్తున్నట్టు మోదీ తెలిపారు. గత 10 ఏళ్లలో 1900 కొత్త వంగడాలను భారతీయ వ్యవసాయ శాస్త్రవేత్తలు సృష్టించారని ప్రశంసించారు. వ్యవసాయ పరిశోధన సంస్థలు, యూనివర్సిటీల మధ్య అనుసంధానాన్ని మరింత పెంచేందుకు ఈ సదస్సును నిర్వహిస్తున్నారు.