Post Office Schemes: పెట్టుబడులకు ఎన్నో పథకాలు మనకు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం చిన్న మొత్తాల పొదుపు పథకాల్ని కూడా తీసుకొచ్చింది. ఇవి బ్యాంకులు, పోస్టాఫీసుల్లో అందుబాటులో ఉంటాయి. పెద్ద మొత్తాల్లో కాకుండా చిన్న మొత్తాల్లో కూడా దీంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. స్థిర వడ్డీ ప్రకారం రాబడి ఉంటుంది. కేంద్రం మద్దతు ఉంటుంది కాబట్టి గ్యారెంటీ రిటర్న్స్ ఉంటాయి. నిర్దిష్ట కాలానికి వడ్డీ ప్రకారం రాబడి అందుకోవచ్చు. ఈ పథకాల్లో సుకన్య సమృద్ధి యోజన, సీనియర్ సిటిజెన్ సేవింగ్స్ స్కీమ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) వంటి వాటికి డిమాండ్ ఎక్కువ ఉంటుంది.
అయితే ఈ పథకాల్లో ఇన్వెస్ట్ చేసే వారు బ్యాంకుల్లో లేదా పోస్టాఫీసుల్లో కచ్చితంగా ఆధార్ కార్డ్ నంబర్ ఇవ్వాల్సిందేనా? కచ్చితంగా ఇవ్వాల్సిందే. కొత్తగా ఈ అకౌంట్లు తెరిచే వారు కచ్చితంగా ఆధార్ కార్డు డీటెయిల్స్ సమర్పించాల్సి ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ లేటెస్ట్ నోటిఫికేషన్‌లో వెల్లడించింది. దీనికి సంబంధించి 2023, ఏప్రిల్ 3న నోటిఫికేషన్ వచ్చింది. 2023, ఏప్రిల్‌కు ముందు చాలా మంది ఆధార్ కార్డు, పాన్ కార్డు లేకుండానే ఇలాంటి పథకాల్లో ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించింది. వీరికి సదరు కార్డులు సమర్పించాలని గతంలోనే అలర్ట్ చేసింది కేంద్రం. ఇక మీదట ఇన్వెస్ట్ చేసే సమయంలోనే సమర్పించాలని పేర్కొంది.
ఆధార్ కార్డు నంబర్ లేకుంటే.. ఆధార్ స్కీమ్ కింద ఎన్‌రోల్ చేసుకొని ఆ నమోదు సంఖ్యను సమర్పించాలని అదే నోటిఫికేషన్‌లో కేంద్రం స్పష్టం చేసింది. ఇలా ఎన్‌రోల్‌మెంట్ ప్రూఫ్ సబ్మిట్ చేసి స్కీమ్‌లో అకౌంట్ తెరవొచ్చని పేర్కొంది. ఇంకా అకౌంట్ ఓపెన్ చేసిన 6 నెలల్లోగా మళ్లీ ఆధార్ కార్డు నంబర్ సమర్పించాలని వెల్లడించింది. అయితే నిర్దిష్ట సమయంలోగా అకౌంట్ హోల్డర్.. ఆధార్ కార్డు సమర్పించకపోతే అకౌంట్ నిలిచిపోతుందని.. మళ్లీ ఆధార్ నంబర్ సమర్పించినప్పుడు తిరిగి పునరుద్ధరించడం జరుగుతుందని తెలిపింది.
ఇలా అకౌంట్ ఫ్రీజ్ అయిన సమయంలో వడ్డీ ప్రయోజనాలు కోల్పోతారు. సదరు స్కీమ్ అకౌంట్లలో డబ్బులు డిపాజిట్ చేయలేరు. విత్‌డ్రా చేయలేరు. ఇతర బెనిఫిట్స్ అందుకోలేరు. అందుకే సమయానికి సమర్పించడం మంచిది. ఇక పాన్ కార్డు కూడా అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు సమర్పించలేని వారు.. రెండు నెలల్లోగా అందించాల్సి ఉంటుంది. చిన్న పొదుపు పథకాలకు కేవైసీగా పాన్ కార్డు ఉపయోగిస్తామని గతంలో కేంద్రం తెలిపింది. లిమిట్ కంటే ఎక్కువ ఇన్వెస్ట్ చేసేందుకు పాన్ కార్డు కచ్చితంగా అందించాల్సిందేనని వివరించింది.