ఎకరానికి 30 వేలు పెట్టుబడి. ఆదాయం చూస్తే సంవత్సరానికి సంవత్సరానికి 4 లక్షలు వరకు వచ్చే అవకాశం. నష్టం వచ్చే అవకాశం ఆల్మోస్ట్ నిల్. అదే మునగ కాయల పంట.
ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మునగ కాయలకు మార్కెట్ లో విపరీతమైన డిమాండ్ ఉంటుంది. లోకల్ మార్కెట్ లోనే కాకుండా వీటి ఆకులకు విదేశాల్లో కూడా డిమాండ్ ఉంది. పంట వేసి మర్చిపోవడమే, 6 నెలల్లో పంట చేతికొస్తుంది. ఇక అప్పటి నుండి డబ్బే. పైగా పెద్దగా చీడ పీడల బాధ ఉండదు. ఎకరానికి ఇద్దరు కూలీలు ఉంటే సరిపోతారు. బాగుంది కదా. ఎలా సాగు చెయ్యాలి, మార్కెటింగ్ ఎలా అనే మొత్తం వివరాలు మీ కోసం….
ఇప్పుడు యువ రైతులు వ్యవసాయాన్ని లాభదాయకంగా చేస్తూ డబ్బు బీభత్సంగా సంపాదిస్తున్నారు. ఒకప్పటిలా వ్యవసాయం అంటే నష్టాలే అనే ఆలోచన తప్పు అని నిరూపిస్తున్నారు. ఎన్నో కొత్త కొత్త పంటలు వేస్తున్నారు. ఈ మునగ సాగు కూడా అలాంటిదే. ఎకరానికి నీటి సౌకర్యం ఉన్న భూములైతే పెట్టుబడి చాలా తక్కువగా ఉంటుంది. అదే నీటి సౌకర్యం లేని భూమైతే డ్రిప్ కి కొంచెం ఖర్చు అవుతుంది. అయితే డ్రిప్ సబ్సిడీ ఉండటం వల్ల ఆ ఖర్చు కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి. సాగు చేసే విధానం మీకోసం స్టెప్ బై స్టెప్.
మునగ సాగు కోసం ముందుగా భూమిని దున్నుకుని సహజమైన ఎరువులతో సిద్ధం చేసుకోవాలి. తరువాత విత్తనాలు నాటుకోవాలి. ఎకరానికి 1000 మొక్కల వరకు వేసుకోవచ్చు. విత్తనాలు ఖర్చు వెయ్యి రూపాయల లోపే. ఆన్లైన్ లో దొరుకుతాయి లేదా దగ్గరలో వ్యవయసాయ కేంద్రాల్లో లేదా విత్తనాల కొట్లలో కూడా దొరుకుతాయి. సాధారణంగా జూన్ నెల ఈ పంట వేసుకోవడానికి అనుకూలమైన కాలం. 6 నెలల కాలం లో తొలి పంట చేతికొస్తుంది. పంట పూర్తికాలం లో 20 టన్నులవరకు దిగుబడి వస్తుంది .
కేవలం మునగ కాయలకే కాదు ఆకులకు కూడా డిమాండ్ ఉంది అందువల్ల కొంత మంది డ్యూయల్ హార్వెస్టింగ్ చేస్తారు. అంటే కాయలు, ఆకులు కూడా కోస్తారు. మరికొంత మంది కేవలం ఆకుల కోసం మాత్రమే పంట వేస్తారు. అలా పంట వేసేవారు మాత్రం ఎకరానికి 5 వేల మొక్కల వరకు వేస్తారు. ఆకులను డైరెక్ట్ కొనే కంపెనీలు ఉన్నాయి. వారు విత్తనాలు ఫ్రీ గా ఇచ్చి ఆకును కొంటారు. ఆ విధంగా చేస్తే మీకు లాభం కొంచెం తక్కువగా ఉండే అవకాశం ఉంది. అదే మీరే ప్రాసెస్ చేసి అమ్మగలిగితే మాత్రం లాభాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అదెలా అంటే ఆకులను ఎండపెట్టి పొడి చేసి ఆర్గానిక్ షాపులకు డైరెక్ట్ గా అమ్ముకోవచ్చు. దీని ధర ఆన్లైన్ లో కేజీ 2000 వరకు ఉంది. కాబట్టి మీరే సొతంగా బ్రాండ్ ఏర్పాటు చేసుకుని అమెజాన్ లాంటి ఆన్లైన్ కంపెనీలు వేదికగా అమ్మవచ్చు. అయితే వీటికి కొన్ని నిబంధనలు పాటించాలి. రిజిస్ట్రేషన్ లు, FSSAI , GST వంటివి అవసరం పడతాయి.
ఇక కాయలు డైరెక్ట్ గా సూపర్ మార్కెట్లలో, రైతు బజార్లకు అమ్మవచ్చు. లేదా వ్యాపారులే మిమ్మల్ని కాంటాక్ట్ చేసి డైరెక్టుగా కూడా కొంటారు. అంతే కాకుండా మునగ ఎక్స్ పోర్ట్ చెయ్యటానికి కొన్ని కంపెనీలు కూడా ఉన్నాయి. వారిని కాంటాక్ట్ చేసి కూడా మీ ఉత్పత్తులు అమ్ముకోవచ్చు. దీని వల్ల ధర ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు మునగ తో చేసే టీ వంటి అనేక ప్రొడక్టులకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉండటంతో మీరు ఎక్కువ ఎకరాల్లో పంట వేసినట్లయితే మీరు పెద్ద పెద్ద ఎక్సపోర్ట్స్ ను కాంటాక్ట్ చెయ్యవచ్చు. మీకు ఆన్లైన్ లో వివరాలు దొరుకుతాయి.
సో ఇంకెందుకు ఆలస్యం. మీ దగ్గర ఒకటి రెండు ఎకరాల భూమి ఉన్నా, లేకపోతే తక్కువలో లీజు కు తీసుకున్నా ఈ పంట వేసి రెండు చేతులా సంపాదించండి. రెండు ఎకరాల్లో పంట వేసి సరిగా మార్కెటింగ్ చేసుకోగలిగితే, సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కంటే ఎక్కువే సంపాదిస్తూ కాలు మీద కాలేసుకుని ఉన్న ఊర్లోనే పెద రాయుడులా బతికెయ్యొచ్చు. కాదంటారా?



































