రాజధాని అమరావతిలో రాబోయే ఐదేళ్లలో రూ.6వేల కోట్ల నుంచి రూ.10వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు మలేసియా కంపెనీలు ఆసక్తి కనబరిచాయి. మలేసియాలోని సెలాంగార్ స్టేట్ ఎక్స్‌కో మంత్రి పప్పారాయుడు, క్లాంగ్ ఎంపీ గనబతిరావ్‌తో కూడిన మలేసియా ప్రతినిధుల బృందం రాజధాని అమరావతి నిర్మాణ పనులు పరిశీలించాక ముఖ్యమంత్రి చంద్రబాబును సచివాలయంలో శుక్రవారం కలిసింది. మలేసియాలో తెలుగు మూలాలున్న పారిశ్రామికవేత్తలకు చెందిన పలు కంపెనీలు ఏపీలో పెట్టబోయే పెట్టుబడుల ప్రణాళికను ఆ బృందం వివరించింది. ప్రధానంగా విద్య, పర్యాటకం, ఆతిథ్యం, వాణిజ్యం, రియల్ ఎస్టేట్ తదితర రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు మలేసియా కంపెనీలు ఆసక్తి చూపాయి. అమరావతిలో వైద్య విశ్వవిద్యాలయ ఏర్పాటుకు మలేసియాలోని సైబర్ జయ యూనివర్సిటీ ముందుకొచ్చింది. ఫైవ్‌స్టార్ హోటల్ ఏర్పాటుకు బెర్జయా గ్రూపు సంసిద్ధతను వ్యక్తం చేసింది. ‘సీఎం చంద్రబాబు విజన్, నాయకత్వంలో అమరావతి వేగంగా అభివృద్ధి చెందుతోంది. మేము భారత ప్రభుత్వంతో కలిసి అమరావతి అభివృద్ధికి కృషిచేస్తాం. మలేసియాలో తెలుగు మూలాలున్న పారిశ్రామికవేత్తలు అమరావతిలో పెట్టుబడులు పెట్టడానికి ఉత్సాహంగా ఉన్నారు’ అని మలేసియా మంత్రి పప్పారాయుడు అన్నారు. అమరావతిని ప్రపంచంలోని అత్యుత్తమ రాజధానుల స్థాయికి తీసుకెళ్లాలని సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ప్రపంచంలో మొదటి ఐదు రాజధానుల్లో ఒకటిగా అమరావతి: నారాయణ
ప్రపంచంలో మొదటి ఐదు రాజధానుల్లో ఒకటిగా నిలిచిపోయేలా అమరావతిని నిర్మిస్తున్నట్లు మలేసియా ప్రతినిధుల బృందానికి మంత్రి నారాయణ వివరించారు. సీఎంని కలిసే ముందు మంత్రితో సచివాలయంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడారు. ‘రాజధాని అమరావతిలో రూ.51వేల కోట్ల విలువైన పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. కేపిటల్ సిటీలో 360 కిలోమీటర్ల మేర ట్రంక్‌రోడ్లు ఏడాదిన్నరలో పూర్తికానున్నాయి. రెండేళ్లలో 1,500 కిలోమీటర్ల మేర లేఅవుట్ రోడ్లు, మార్చి నెలాఖరులోగా అధికారులు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులకు 4వేల ఇళ్ల నిర్మాణం పూర్తిచేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నాం. సచివాలయం టవర్లు, అసెంబ్లీ, హైకోర్టు భవనాలు రెండున్నరేళ్లలో పూర్తిచేయనున్నాం. వర్షాల కారణంగా గత మూడు నెలల్లో పనులకు కొంతమేర ఆటంకం కలిగింది. రాబోయే రోజుల్లో పనులు వేగవంతం అవుతాయి’ అని మంత్రి నారాయణ వివరించారు. పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్‌కుమార్, సీఆర్‌డీఏ కమిషనర్ కన్నబాబు, అదనపు కమిషనర్ భార్గవతేజ తదితరులు పాల్గొన్నారు.
































