Iran-Israel: కమ్ముకున్న యుద్ధ మేఘాలు.. ఏ క్షణంలోనైనా దాడులు.. అన్ని దేశాలు అలర్ట్

www.mannamweb.com


ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణ అలుముకుంది. ఏ క్షణంలోనైనా ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడులకు తెగబడవచ్చని తెలుస్తోంది. ఇప్పటికే అగ్రరాజ్యం అమెరికా.. ఇజ్రాయెల్‌ను అప్రతమత్తం చేసింది. ఇటీవల సిరియా రాజధాని డమస్క్‌లో ఇరాన్ రాయబార కార్యాలయంపై ఇజ్రాయెల్ వైమానిక దాడులకు తెగబడింది. ఈ ఘటనలో పలువురు ఇరానీ ఆఫీసర్లు ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు గాజాపై దాడిని కూడా ఇరాన్ జీర్ణించుకోలేకపోతుంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్‌పై దాడి చేయాలని ఇరాన్ నిర్ణయం తీసుకుంది. ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దని ఇప్పటికే అమెరికాను ఇరాన్ హెచ్చరించింది. జోక్యం చేసుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చింది. ఇరాన్ హెచ్చరికల నేపథ్యంలో ఏ క్షణంలోనైనా ఇజ్రాయెల్‌పై దాడులు జరగొచ్చని సమాచారం. మరోవైపు ఇజ్రాయెల్‌ కూడా అప్రమత్తం అయింది. ఇరాన్‌ను ధీటుగా ఎదుర్కొనేందుకు అస్త్రాలను సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఇరు దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ ఆయా దేశాలు తమ పౌరులను అలర్ట్ చేశాయి. ఇరాన్-ఇజ్రాయెల్ దేశాలకు వెళ్లొద్దని సూచించాయి. ఫ్రాన్స్, భారత్, రష్యా, పోలాండ్, అమెరికా సహా పలు దేశాలు.. ఇజ్రాయెల్ వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశాయి. తాము సమాచారం తెలియజేసే వరకూ వెళ్లొద్దని పేర్కొన్నాయి. ఇక తమ పౌరులు భారత రాయబార కార్యాలయాలను సంప్రదించాలని భారత విదేశీ వ్యవహారాల శాఖ సూచించింది.

ఇక ఇజ్రాయెల్‌ను అమెరికా అప్రమత్తం చేస్తూనే.. తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చింది. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఫోన్ చేసి భరోసా ఇచ్చారు. ఇరాన్ ఏ క్షణంలోనే దాడులకు పాల్పడొచ్చని.. అందుకు సిద్ధంగా ఉండాలని అలర్ట్ చేసింది. మరోవైపు జర్మన్ సహా పలు దేశాలు విమాన సర్వీసులను రద్దు చేశాయి. మరోవైపు గత ఆరు నెలలుగా గాజా-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం సాగుతోంది. ఇప్పటికే వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. వేలాది ఇళ్లులు నేలమట్టం అయ్యాయి. ఇంకా యుద్ధం సాగుతూనే ఉంది. మరోవైపు దాడులకు విరామం ప్రకటించాలని ఇజ్రాయెల్‌తో చర్చలు కూడా నడుస్తున్నాయి. ఇంతలోనే మరో ముప్పు పొంచి ఉంది. తాజాగా ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య భీకరమైన యుద్ధం సాగేటట్లు సూచనలు కనిపిస్తున్నాయి.