ఆగస్టులో అయోధ్య, కాశీ వెళ్లే యాత్రికుల కోసం ఐఆర్‌సిటిసి స్పెషల్ ఆఫర్.. ఎలా బుక్ చేసుకోవాలంటే.

www.mannamweb.com


IRCTC Tour Package ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్(IRCTC) శ్రావణ మాసంలో తీర్థయాత్రలకు వెళ్లే ప్రయాణికుల కోసం ప్రత్యేక టూరిజం ప్యాకేజీని ప్రకటించింది. తక్కువ బడ్జెట్లో విలాసవంతమైన, సౌకర్యవంతమైన జర్నీ సాఫీగా సాగేలా ఏర్పాట్లు చేసింది. ఈ స్పెషల్ ప్యాకేజీలో భాగంగా ఉత్తర భారతంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను కేవలం నాలుగు రోజుల్లోనే సందర్శించొచ్చు. ఈ ఆధ్యాత్మిక టూర్ ఆగస్టు 9వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ యాత్రలో వారణాసి, అయోధ్య, ప్రయాగ్ రాజ్‌తో సహా అనేక పుణ్యక్షేత్రాలను సందర్శించొచ్చు. ఈ టూర్ మొత్తం 4 రాత్రులు, 5 రోజుల పాటు సాగనుంది. దీనికి సంబంధించిన వివరాలను ఐఆర్‌సిటిసి X పోస్ట్‌లో అప్‌లోడ్ చేసింది. హోలీ కాశీ విత్ అయోధ్య దర్శన్ EX కోజికోడ్(SEA37) పేరుతో ఈ టూర్ ప్యాకేజీ ప్రయాణికులకు అందుబాటులో ఉంటుందని తెలియజేసింది. ఈ ప్యాకేజీలో భాగంగా యాత్రికులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించనుంది.. విమాన టికెట్ ధరలు ఎలా ఉన్నాయనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం…

ఎప్పటినుంచి ప్రారంభమంటే..
ఐఆర్‌సిటిసి ఇప్పటివరకు ఎక్కువగా ట్రైన్ జర్నీనే యాత్రికుల కోసం ప్రకటిస్తూ వచ్చేది. చాలా రోజుల తర్వాత, శ్రావణ మాసం వస్తున్న నేపథ్యంలో విమానయానం ఆఫర్‌ను కూడా ప్రకటించింది. ఐఆర్‌సిటిసి నివేదికల ప్రకారం ఈ ఆధ్యాత్మిక యాత్ర ఆగస్టు 9వ తేదీన ప్రారంభం కానుంది. తమ యాత్రికుల సంఖ్యను పెంచుకునేందుకు ఈ టూర్ ప్యాకేజీని భిన్నంగా ప్రకటించింది.

టికెట్ ధర ఎంతంటే..
ఐఆర్‌సిటిసి ప్యాకేజీలో భాగంగా ముగ్గురు ఒకేసారి బుక్ చేసుకుంటే ఒక్కొక్కరికి రూ.34,270 వరకు ఉంటుంది. అదే కేవలం ఒక్కరే జర్నీ చేయాలనుకుంటే రూ.47,200తో బుక్ చేసుకోవాలి. అదే ఇద్దరు కలిపి బుక్ చేసుకుంటే ఒక్కొక్కరికి రూ.35,970గా ఐఆర్‌సిటిసి ధరను నిర్ణయించింది. 5-11 ఏళ్లలోపు పిల్లలకు రూ.33,350 నుంచి (బెడ్ సౌకర్యం కోసం), ఒకవేళ పిల్లలకు బెడ్(మంచం) అక్కర్లేదనుకుంటే రూ.30,850 చెల్లించాలి. అదే 2-4 ఏళ్లలోపు పిల్లలుంటే రూ.18,510 వరకు చెల్లించాలి.

కోజికోడ్ నుంచి ప్రారంభం..
ఈ పుణ్యక్షేత్రాల సందర్శన కోసం మీరు విమానయానం చేయాల్సి ఉంటుంది. ఇది ముందుగా కోజికోడ్ నుంచి ప్రారంభమవుతుంది. మొదటి రోజు కోజికోడ్ ఎయిర్ పోర్ట్ నుంచి మధ్యాహ్నం 2:50 గంటలకు జర్నీ ప్రారంభమవుతుంది. వారణాసికి రాత్రి 9:15 గంటలకు చేరుకుంటుంది. అక్కడే మీకు హోటల్ రూమ్, ఆహారం ఉచితంగా అందజేస్తారు. రెండో రోజు అల్పాహారం తీసుకున్న తర్వాత, వారణాసి, కాశీ విశ్వనాథ ఆలయం, విశాలాక్షి అమ్మవారి ఆలయం, అన్నపూర్ణ దేవాలయాలతో పాటు సాయంత్రం గంగా హారతి తర్వాత అక్కడే హోటల్‌లో భోజనం, వసతి సౌకర్యాలను కల్పిస్తారు.

భోజన, వసతి ఏర్పాట్లు..
ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా ఫుడ్(టిఫిన్, భోజనం), అకామిడేషన్(వసతి) ఏర్పాటు చేయనున్నట్లు IRCTC ప్రకటించింది. మూడో రోజున ప్రయాగ్ రాజ్, త్రివేణి సంగమం, హనుమాన్ ఆలయాలతో పాటు అయోధ్య దర్శనం పూర్తవుతుంది. ఆరోజు రాత్రి అయోధ్యలోనే వసతి, భోజన సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాతి రోజున రామ జన్మభూమి, హనుమాన్ ఘటి ఆలయాలతో పాటు ఇతర దేవాలయాల సందర్శన తర్వాత తిరిగి వారణాసి చేరుకుంటారు. ఐదో రోజు మధ్యాహ్నం తిరిగి 3:50 గంటలకు తిరిగి కోజికోడ్‌కు చేరుకోవడంతో మీ టూర్ పూర్తవుతుంది.

ఇలా బుక్ చేసుకోవాలి..
ఈ స్పెషల్ టూర్ ప్యాకేజీ కావాలనుకునే వారు https://www.irctctourism.com/pacakage_description?packageCode=SEA37 ఈ లింక్‌పై క్లిక్ చేసి నేరుగా మీరే ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు లేదా ఈ ఫోన్ నెంబర్లను 8287932064 లేదా 8287932098 లేదా 0484-2382991 నెంబర్లను సంప్రదించగలరు. ఈ విమానం వారణాసి నుంచి కోజికోడ్ మరియు కోజికోడ్ నుంచి వారణాసి వరకు అందుబాటులో ఉంటుంది.