ఇకపై డిగ్రీ, పీజీ కోర్సులు చదివే విద్యార్థులందరికీ ఐరిస్‌ హాజరు.. సర్కార్ ఆదేశాలు

www.mannamweb.com


ఏపీ రాష్ట్ర సర్కార్ మరో సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. ఉన్నత విద్యాసంస్థల్లో విద్యార్ధుల హాజరుకు ఐరిస్‌ విధానాన్ని తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది.

డిగ్రీ, పోస్టుగ్రాడ్యుయేషన్‌ కోర్సులు చదివే విద్యార్థులందరికీ ఈ మేరకు ఐరిస్‌ హాజరును అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. తద్వారా ఎంతమంది విద్యార్ధులు తరగతులకు హాజరవుతున్నారు? ఎంతమంది రెగ్యులర్‌గా కాలేజీలకు వస్తున్నారనే విషయాలను తెలుసుకునేందుకు ఈ విధానం ఉపకరిస్తుందనిఐరిస్‌ హాజరును తీసుకువస్తోంది. గతంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో ఈ విధానంలో విద్యార్థుల హాజరు నమోదుచేసినప్పటికీ.. ఇటీవల ఈ విధానాన్ని నిలిపివేశారు. మరోవైటు ప్రైవేటు విద్యాసంస్థల్లో ఎలాంటి వివరాలూ ఉండటం లేదు. దీంతో అన్నింటికీ ఐరిస్‌ హాజరు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. యాప్‌ ద్వారా ముఖ గుర్తింపు హాజరు నమోదుచేయనుంది.

ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో చేరుతున్నవారిలో దాదాపు 40 శాతం మంది మధ్యలో ఆపేస్తున్నారు. ప్రైవేటు ఇంజినీరింగ్‌ కాలేజీల్లో ఉత్తీర్ణత కేవలం 57 శాతంగా మాత్రమే ఉంటోంది. ఎంబీఏ లాంటి కోర్సుల్లో అయితే 52 శాతానికి మించి ఉత్తీర్ణత నమోదుకావడం లేదు. దీంతో మార్పు తీసుకొచ్చేందుకు విద్యార్థులపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనిలో భాగంగా ప్రభుత్వం విద్యార్థుల ఐరిస్‌ హాజరును జ్ఞానభూమి పోర్టల్‌కు అనుసంధానం చేయనుంది. విద్యార్థుల ఐరిస్‌ను ఒకసారి యాప్‌లో అప్‌లోడ్‌ చేస్తే ఆ వివరాలు మూడేళ్ల వరకు అందుబాటులోనే నిక్షిప్తమై ఉంటాయి. తరగతిలో యాప్‌ ఆన్‌ చేసి, విద్యార్థి వద్ద పెడితే వివరాలు ప్రత్యక్షమవుతాయి. వాటిని ఓకే చేస్తే హాజరు నమోదు పూర్తవుతుంది. ఒకేసారి ముగ్గురు, నలుగురి హాజరు నమోదుచేసేలా ప్రభుత్వం యాప్‌ను తీసుకొస్తోంది. అంతేకాకుండా బోధన రుసుముల చెల్లింపునకు కనీసం 75 శాతం హాజరు ఉండాలనే నిబంధన కారణంగా విద్యార్థులకు ఆ స్థాయిలో హాజరు ఉండేలా ప్రైవేటు యాజమాన్యాలు నిబంధనలు తుంగలో తొక్కుతున్నట్లు ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చాయి. ఐరిస్‌ హాజరుతో బోధన రుసుముల చెల్లింపుల్లోనూ కచ్చితత్వం రానుంది.

కాళోజీ కన్వీనర్‌ కోటా బీడీఎస్‌ వెబ్‌ ఆప్షన్లకు నోటిఫికేషన్‌ విడుదల

కాళోజీ నారాయణరావు ఆరోగ్య యూనివర్సిటీ అనుబంధ ప్రభుత్వ, ప్రైవేటు, ఆర్మీ డెంటల్‌ కాలేజీల్లో కన్వీనర్‌ కోటా కింద వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకునేందుకు తొలి విడత నోటిఫికేషన్‌ విడుదలైంది. అర్హులైన విద్యారుల ప్రవేశాల కోసం ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని గతంలో వర్సిటీ నోటిఫై చేయడంతో విద్యారులు తమ ధ్రువపత్రాలు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ సమయంలో అప్‌లోడ్‌ చేశారు. ఈ క్రమంలో సంబంధిత అధికారులు ధ్రువపత్రాలను పరిశీలించి అర్హులైన వారి పేర్లను మెరిట్ జాబితాలో పొందుపర్చి ఈ నెల 26న విడుదల చేశారు. వీరంతా వెబ్‌ఆప్షన్లను ఎంపిక చేసుకోవడానికి నోటిఫికేషన్‌ విడుదల చేశారు. పీడబ్ల్యూడీ, ఆంగ్లో ఇండియన్, సీఏపీ, ఈడబ్ల్యుఎస్‌ కోటాతో సహా ప్రొవిజినల్‌ తుది మెరిట్ జాబితాలో పేర్లున్న వారంతా అక్టోబరు 1వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు వెబ్‌ ఆప్షన్లను ఇచ్చుకోవడానికి అవకాశం కల్పించారు.